TDP V/s Janasena In Chittoor | టీడీపీ మిత్రపక్షంలో పెరిగిన విబేధాలు
సీఎం సొంత జిల్లాలో టీడీపీ, జనసూన మధ్య అంతరం పెరుగుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు మారింది. ఇదీ చంద్రగిరి కథ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-24 01:30 GMT
టీడీపీ కూటమిలో విబేధాలు బయటపడుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (JANASENA) మధ్య లుకలుకలు వెలుగు చూస్తున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య సయోధ్య లేదు. స్థానిక పరిస్థితులు, ఆధిపత్య ధోరణి వల్ల కలిసి సాగడం కష్టంగా మారింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి ( CHANDRAGIRI ) నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం ప్రారంభించడం వెనుక కూడా బలమైన కారణం ఉందనే ప్రచారం సాగుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయింది. సుదీర్ఘ విరామం తరువాత పిఠాపురంలో జనసేన ప్లీనరీ నిర్వహించింది. ఇందులో దిశా, దశ నిర్దేశం లేకున్నా, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని మాత్రం నిర్ణయించారు.
"తమను నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు. టీడీపీ గెలిచిన చోట అధికారులు తమ మాట ఖాతరు చేయడం లేదు" అని ఆ పార్టీ మథనపడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు ఇంకా సుదీర్ఘకాలం ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలనే దిశగా అడుగులు వేయడానికి జనసైనికులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో అది కూడా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో జనసేన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. సీఎం స్వగ్రామం నారావారిపల్లె కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన కేంద్రంలోనే కూటమి నేతల మధ్య ఉన్న విబేధాలు వెలుగుచూశాయి.
ఇదే సాక్ష్యం
చంద్రగిరి పట్టణంలోని నాగాలమ్మ క్రాస్ నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి, క్లాక్ టవర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కొత్తపేటలో పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన తరువాత కార్యాలయాన్ని ఎమ్మెల్యే లు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్ పార్రంభించారు.
"పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కుల,మతాలకు అతీతంగా పార్టీ బలోపేతానికి పనిచేయాలి" అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల నాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేయడం, పోటీకి నేతలు సిద్ధం కావాలి" అని సూచించారు.
రాయలసీమలో జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. చంద్రగిరిలో అట్టహాసంగా ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు (Railway Koduru) ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, భారీగా జనసైనికులు హాజరయ్యారు. మినహా, టీడీపీ నేత ఒకరే రావడలో ఆంతర్యం ఏమిటనేది చర్చకు దారి తీసింది.
"జనసేన బలోపేతం జనశ్రేణుల ముందున్న లక్ష్యం అని కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కర్తవ్యబోధ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రైల్వే కోడూరు జనసేన నేతలు తాతంశెట్టి నాగేంద్ర, తిరుపతి నుంచి ఆకేపాటి సుభాషిణి, రాజారెడ్డి, టిడిపి నేత దొడ్ల కరుణాకర్ రెడ్డి, బిజేపి నియోజకవర్గ ఇన్చార్జీ మెడసాని పురుషోత్తం నాయుడు పాల్గొన్నారు.
బయటపడిన విబేధాలు
2024 ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తరువాత చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. పులివర్తి నాని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ కార్యాలయ ప్రారంభాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కాదు. కనీసం కార్యకర్తలు కూడా హాజరు కాలేదని సమాచారం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఊరి నుంచి టీడీపీ రాష్ట్ర నేతగా ఉన్న ఒకరు వెళ్లారని చెబుతున్నారు.
చంద్రగిరి కార్యాలయ ప్రారంభానికి ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యే పులివర్తి నాని సందేశం పంపించడం వల్లే ఈ కార్యక్రమం జనసేన పార్టీ శ్రేణేలకు మాత్రమే పరిమితమైటనట్లు భావిస్తున్నారు.
ఇద్దరి మధ్య అంతరం
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీతో చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి దేవర మనోహర్ మధ్య సఖ్యత లేదనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. జనసేన ఇన్ చార్జి కూడా ఎన్నికలు ముగిసిన తొమ్మది నెలల తరువాత దేవర మనోహర్ చంద్రగిరి సీన్ లోకి రావడం వెనుక కూడా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయనేది ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది.
ఎమ్మెల్యే పులివర్తి నాని జనసేన నేతల ఫోన్ కాల్స్కు స్పందించరనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటికి వెళ్లినా, బయటికి వెళ్లారని చెప్పించారని దేవర మనోమర్ పార్టీ శ్రేణుల వద్ద ఆవేదన చెందాడని చెబుతున్నారు. ఇవే కాకుండా, అనేక అంశాలపై ఎమ్మెల్యేతో జనసైనికుల మధ్య అంతరం ఉన్నట్లు భావిస్తున్నారు.
అధికారంలో ఉన్న తమ మాట చెల్లుబాటు కావడం లేదనేది రాష్ట్రంలో ఈపాటికే జనసేన నేతల ఆవేదన. అది చిత్తూరు జిల్లాలో మరింత హెచ్చుగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు న్యాయవాదిగా ఉన్న జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్బంగా "పార్టీ, క్యాడర్ కు ఇక పూర్తి సమయం అందుబాటులో ఉంటా" అని ప్రకటించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయనేది వేచి చూడాలి.