హనుమాన్.. నిన్నూ వదల్లేదు..!

హనుమాన్ జయంతి బిజెపి, భజరంగ్ దళ్ కార్యకర్తలకు కలిసి వచ్చింది. ఎన్నికల వేళ మొదటిసారి తిరుపతిలో నిర్వహించిన ప్రదర్శన కొత్తగా కనిపించింది.

Update: 2024-04-23 16:01 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: "అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు" ఈ సూత్రాన్ని బిజెపి దాని అనుబంధ సంఘాలు చక్కగా వినియోగించుకుంటున్నాయి. "మతం పేరిట, దేవుడు పేరిట చేసే రాజకీయాలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి" అనేది బిజెపిపై ఉన్న అభియోగం. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం జరుగుతుండగానే.. తిరుపతిలో మంగళవారం రాత్రి కాషాయ జెండాల రెపరెపల మధ్య నిర్వహించిన భారీ ప్రదర్శనలో జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం ద్వారా బిజెపి, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్.. హనుమాన్ జయంతిని కూడా చక్కగా వాడుకున్న వాతావరణం కనిపించింది.

తిరుపతి ఆధ్యాత్మిక నగరం. ఈ ప్రదేశంలో నిత్యం స్వామి వారు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అదే క్రమంలో మంగళవారం హనుమాన్ జయంతి నేపథ్యంలో నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు తిరుమలలోని జపాలి ఆంజనేయస్వామి సన్నిధిలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సాధారణంగా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది. అదే రోజు హనుమాన్ జయంతి కావడం కూడా భక్తుల రద్దీ పెరగడానికి ఆస్కారం కలిగింది. ఇది సర్వసాధారణమే...


ఈ ఏడాదే ఎందుకు..?

తిరుపతి నగర చరిత్రలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ప్రదర్శనలు నిర్వహించిన దాఖలాలు లేవనేది స్థానికులు చెప్పే మాట. మంగళవారం రాత్రి మాత్రం కపిల తీర్థం రోడ్డులో డీజే మ్యూజిక్ మధ్య జైశ్రీరామ్ నినాదాలు మిన్నంటుతుండగా, బిజెపి నాయకులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ స్థాయిలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జి భాను ప్రకాష్ రెడ్డి, నగర నాయకుడు సామాజి శ్రీనివాస్ తో పాటు అనేకమంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త అయిన యువతి, యువకులు కాషాయ జెండాలు చేతబట్టి నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిజెపి నాయకులు వాహనం వెనుక పాదయాత్రగా వస్తువు అందరికీ అభివాదం చేస్తూ కనిపించారు.

ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వస్తుంది.. వెళుతుంది.. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఈ తరహాలో బిజెపి లేదా ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ శ్రేణులు ప్రదర్శన నిర్వహించిన దాఖలాలు లేవు. మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రదర్శన ద్వారా స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. ముందస్తు అనుమతితో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తుండగా, ఆ శాఖ అధికారులు ఈ ప్రదర్శనను పరిరక్షణ బందోబస్తు కల్పించారు. ఇదిలా ఉండగా..

కలిసి వచ్చిన జయంతి..

ప్రస్తుతం ఎన్నికల వాతావరణం సందడిగా ఉంది. తిరుపతి ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా వెలగపల్లి ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. టిడిపి జనసేన పార్టీ కూటమిలో బిజెపి భాగస్వామిగా ఉంది. జనసేన నుంచి తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. మూడు పార్టీల నాయకులు బిజెపి ఎంపీ అభ్యర్థి, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి కోసం ముమ్మరంగా పగలు ప్రచారంలో ఉంటున్నారు. ఎన్నికల వేళ అనుకోని విధంగా దేవుడు కరుణించినట్లు హనుమాన్ జయంతి రావడం, ఈ అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే రీతిలో ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని వాహనంపై ప్రదర్శించి, చేతిలో ఖడ్గాలను పోలిన వస్తువులు ధరించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల వేళ నిర్వహించిన ప్రదర్శన చర్చకు ఆస్కారం కల్పించింది. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి నాడు బిజెపి దాని అనుబంధ సంఘాలు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఏడాది మాత్రమే డీజే సౌండ్ మధ్య జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తిస్తుండగా నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేకంగా కనిపించింది.

Tags:    

Similar News