కృష్ణా జలాల పంపిణీపై ఏపీకి ఎదురు దెబ్బ తగిలినట్టేనా?
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ఇప్పుడిప్పుడే పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు.;
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ఇప్పుడిప్పుడే పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ-2) తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం 2023లో జారీ చేసిన ఉత్తర్వులు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలు వేర్వేరని ట్రిబ్యునల్ పేర్కొంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని జలరంగ నిపుణలు కూడా స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించలేదనే విమర్శలను పక్కన బెట్టినా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 జనవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని జల నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలూ కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల గురించి పెద్దగా పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. దీని ఫలితంగా ఇప్పుడీ పరిస్థితి ఏర్పడినట్టు అభిప్రాయపడుతున్నారు.
కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది.
రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది. అయితే ఐఎస్‌ఆర్‌డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్‌పై సమర్థంగా వాదనలు వినిపించలేదన్న విమర్శలూ ఉన్నాయి. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని జలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలకులు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈలోగా- కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది.
నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టినా పాలకులు నోరు విప్పలేదు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం.. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. ఆ తర్వాత కళ్లు తెరిచిన ఏపీ పాలకులు సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది.
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఇప్పుడు తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఏవైపుకు దారి తీస్తుందో వేచి చూడాలి. కేంద్రం 2023లో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(టీఓఆర్)పై మొదట రెండు రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. తదుపరి టీఓఆర్‌పై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరుగుతాయి. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ జనవరి 16న ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మొదట బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో ఎవరి వాటా ఎంత అన్నదానిపై వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రైబ్యునల్ చేపట్టనుంది.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యతను బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 150 టీఎంసీలు నిల్వ చేసుకొని క్యారీఓవర్‌గా వినియోగించుకొనే, మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛ ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను ప్రాజెక్టులవారీగా కేటాయింపును నిర్ధారించడం, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నదానిపై రెండు రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్ ఎదుట పదేళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వాదనలు విని బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులో ఎవరి వాటా అన్నది ఎంత అన్నది తేల్చే పనిని కూడా బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కే అప్పగిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ 2023 అక్టోబరు 6న తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(టీఓఆర్) జారీ చేసింది.
దీనిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని, అయితే తమ తుది తీర్పునకు లోబడి ట్రైబ్యునల్ నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు దాఖలు చేసిన విజ్ఞప్తులు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, రెఫరెన్స్‌లను కామన్ రికార్డుగానే పరిగణించాలని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3ల కింద వాదనలను కలిపివినాలని కోరుతూ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) దాఖలు చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రధాన వాదనలు ముగించాలని, తదుపరి టీఓఆర్‌పై తాము వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉందని, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను కలిపి పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది.
రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్.. అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదట చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్ 89, సెక్షన్ 3ల ప్రకారం వాదనల్లో కొన్ని ఒకేరకమైన అంశాలున్నాయని, మరికొన్ని లేవని తాజా ఉత్తర్వులో పేర్కొంది. రెండింటిని కలిపివింటే ఒకే ఆర్డర్‌లో తీర్పు చెప్పాల్సి ఉంటుందని, ఇలా చేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ కేసు గెలిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని, అలాంటప్పుడు కలిపిఇచ్చిన ఆర్డర్‌ను విడదీయడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండింటినీ కలిపివినడం సరైంది కాదని, వేర్వేరుగా వినడమే మంచిదని అభిప్రాయపడింది. అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి టీఓఆర్ ప్రకారం మొదట వాదనలు వినడమే సరైందని అభిప్రాయపడింది. ఇందులో నీటి పంపిణీ అంశం ఉన్నందున ఇది తేలిన తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా కేటాయింపుల అంశం చేపట్టడం సరైందని పేర్కొంది. ఇప్పటివరకు రెండు వాదనలకు ఇచ్చిన సాక్ష్యాలు, రికార్డులను, సెక్షన్ 89 ప్రకారం ఇచ్చిన వాటినీ తదుపరి టీఓఆర్‌కు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పింది. సెక్షన్ 89 ప్రకారం వాదనల సమయంలో తదుపరి టీఓఆర్‌కు ఇచ్చినవి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంది. డాక్యుమెంట్లలో వేటిని పరిగణనలోకి తీసుకోవాలో, వేటిని తీసుకోకూడదో వాదనల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకొంటే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తీర్పు చెప్తూ ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు తదుపరి వాదనలు జరుగుతాయి.