చంద్రబాబుకు కూడా ఏమైనా డబ్బులు అందాయా : షర్మిల ధ్వజం
చంద్రబాబు నిర్ణయాలను జగన్ రద్దు చేశారు. మరి జగన్ నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదు.
By : The Federal
Update: 2024-12-04 13:35 GMT
విద్యుత్ ఒప్పందాల్లో ఆదానీ నుంచి చంద్రబాబుకు కూడా ఏమైనా డబ్బులు అందాయా అని ఏపీ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిలా ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్తోంది. జగన్ అయితే నా పేరు ఎక్కడైనా ఉందా తెలివిగా మాట్లాడుతున్నారు. 2021లో అప్పటి సీఎం అంటే జగన్ కాక మరెవరు? అని ఎద్దేవా చేశారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్‌లో బుధవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ జగన్‌పైన, చంద్రబాబుపైన విమర్శలు ఎక్కు పెట్టారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళ చేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. కోర్టుకు సైతం వెళ్లారు. మరి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. మరి ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అదానీకి చంద్రబాబు భయపడుతున్నారా? చంద్రబాబు ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? లాంగ్ టర్మ్ డీల్ చేయకూడదని తెలిసినా జగన్ ఎందుకు అమలు చేశారు? జగన్, అదానీ మధ్య ఒప్పందం ఎందుకు రద్దు చేయరు? చంద్రబాబుకు కూడా ఏమైనా డబ్బులు అందాయా? అని షర్మిల నిలదీశారు. చంద్రబాబు ఒప్పందాలను జగన్ చాలా తేలిగ్గా రద్దు చేశారు. మరి జగన్ ఒప్పందాలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదు? అని ప్రశ్నించారు. ఈనెల నుంచే ఈ విద్యుత్ భారాలు ప్రజలపై మోపారు. అక్రమాలన్ని స్పష్టంగా తెలిసినా చంద్రబాబు స్పందించరా? ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకుని అదానీ, జగన్ మధ్య ఒప్పందాలు రద్దుచేయాలి. ఈ మేరకు సెంట్రల్ ఈఆర్‌సీకీ లేఖ రాస్తున్నామని వెల్లడించారు.