కాపుల్ని ఆకట్టుకోవడంలో జగన్ వ్యూహం ఫెయిలైందా?

ప్రస్తుతం ఏపీలో సాగుతున్న చర్చను బట్టి చూస్తుంటే కాపుల్ని ఆకట్టుకునే విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారని, ఆయన వ్యూహం దెబ్బతిందని వైసీపీ వర్గాలే వాపోతున్నాయి.

Update: 2024-05-07 09:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఆరోపణలకు అంతే లేకుండా పోయింది. మండుటెండలో ప్రచారం చేస్తున్న పార్టీ నేతలు ఆయా వర్గాలను తమవైపు ఆకట్టుకునేందుకు ఏవేవో ప్లాన్లు వేస్తున్నారు. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా కులాల చుట్టూతా సాగుతోంది. పార్టీల నాయకత్వాన్ని బట్టి, వారు అనుసరిస్తున్న విధానాలను బట్టి కాకుండా ఓటర్లు తమ వర్గ నాయకులవైపే మొగ్గు చూపుతున్నారన్నది ఓ అంచనా. ఏపీలో ఇప్పుడు చర్చంతా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు పడతాయనే దానిపై ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 15.3 శాతంగా ఉన్న కాపు సామాజికవర్గ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మరోవైపు జనసేన తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న చర్చను బట్టి చూస్తుంటే కాపుల్ని ఆకట్టుకునే విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారని, ఆయన వ్యూహం దెబ్బతిందని వైసీపీ వర్గాలే వాపోతున్నాయి.


ఐదేళ్లలో కాపులెందుకు వ్యతిరేకమయ్యారు?

2019 ఎన్నికల్లో కాపుల్లో ఎక్కువ భాగం వైసీపీకే మద్దతు ఇచ్చారు. రిజర్వేషన్లు తన చేతిలో లేవని స్పష్టంగా తూర్పుగోదావరి జిల్లాలో చెప్పినా కాపులు వైసీపీ వైపే మొగ్గుచూపారు. ఆయనకు అధికారం కట్టబెట్టడంలో ముందున్నారనే చెప్పాలి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో కాపులు జగన్ పై ఒకింత అసహనంతో ఉన్నారని కాపు సామాజిక వర్గాల నేతలు చెబుతున్నారు. మరి జగన్ వ్యూహం ఎక్కడ దెబ్బతిన్నట్టు అనేది చర్చనీయాంశంగా ఉంది.
బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓట్లు ఎన్నికల్లో కీలకం. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నడిపిన ముద్రగడ పద్మనాభంను తమవైపు తిప్పుకున్నా కాపులు మాత్రం జగన్ పై రుసరుసలాడుతూనే ఉన్నారని చెబుతున్నారు. పేరు రాయడానికి ఇష్టపడని ఓ కాపు నాయకుడు చెప్పిన వివరాల ప్రకారం...
కాపులు జనసేన వైపు పోకుండా ఉండేందుకు ముందుగా జగన్.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్ ఏ ప్రకటన చేసినా ముందుగా ఓ నలుగురైదుగురు కాపు నేతలు అంబటిరాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ లేదా కురసాల కన్నబాబు దాడి చేసేవారు. మాటల యుద్ధం మొదలు పెట్టేవారు. రెచ్చగొట్టే తరహాలో మాట్లాడేవారు. హాస్యం పేరిట ఎగతాళి, వెటకారం చేసేవారు. ఇందులో ప్రధానంగా టార్గెట్ పవన్ కల్యాణే. కాపుల పరువు తీస్తున్నారని ఒకరు, పవన్ అసలు కాపే కాదని మరొకరు.. ఇలా రకరకాలుగా మాట్లాడి కాపుల్ని దూరం చేసేందుకు ప్రయత్నం చేసేవారు. కొంతకాలం ఈ విమర్శలను కాపులు ఎంజాయ్ చేసినా ఆ తర్వాత ఈ విమర్శల వెనకున్న పరమార్థాన్ని కాపు యువత పసిగట్టి తిప్పికొట్టడం మొదలుపెట్టింది.

ముఖ్యమంత్రివైఎస్ జగన్ తన వ్యూహంలో భాగంగానే కాపుల రిజర్వేషన్లపై మాట్లాడకుండా మౌనం దాల్చేవారు. కాపు కార్పొరేషన్ కి ప్రతిఏటా ఇస్తానన్న రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం, పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలు ప్రత్యేకించి ఆయన పెళ్లిళ్ల వ్యవహారాన్ని మంత్రులు పదేపదే ప్రస్తావించడాన్ని కాపుల్ని గాయపరిచాయనే చెప్పాలి. ఎప్పుడో జరిగిపోయిన పవన్ పెళ్లిళ్ల వ్యవహారాన్ని జగన్ ప్రస్తావించడాన్ని కాపులు చీదరించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసి పెళ్లిళ్ల వ్యవహారాన్ని బహిరంగ సభల్లో ప్రస్తావించడాన్ని చాలామంది ఇతర పార్టీల వారికి కూడా నచ్చలేదు. ఇటీవల టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి నేరుగా జగన్ కు సంధించిన ప్రశ్నలు చాలామందిని ఆలోచనలో పడేశాయి. జగన్ మోహన్ రెడ్డి తాతకు, వాళ్ల ముత్తాతకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో, అవినాశ్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ కుటుంబానికి మధ్య తగవు ఎందుకు వచ్చిందో అందరికీ తెలియందా అని ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి జగన్ పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల మాట ఎత్తడం మానేశారు.
ఇక రాజకీయానికి వస్తే జనసేన, టీడీపీ పొత్తు కుదరకుండా చూడాలన్నది వైసీపీ వ్యూహాం. ఇది చాలా కాలం కొనసాగింది. చంద్రబాబు అరెస్ట్ తో దానికి పుల్ స్టాప్ పడింది. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ జరిగిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించినపుడు వైసీపీ నేతలు ప్రత్యేకించి కాపు మంత్రులు తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ను నానామాటలన్నారు. పొత్తును మానసికంగా అంగీకరించని వారు సైతం వైసీపీ తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
పొత్తు కుదిరిన తర్వాత అది బీటలు వారుతుందని వైసీపీ భావించింది. పొత్తుతో జనసేన శ్రేణుల్లో తీవ్రంగా అసమ్మతి వ్యక్తమవుతుందని అంచనా వేసింది. సీట్ల పంపిణీ తర్వాతనైనా జనసేన ముక్కచెక్కలవుతుందనుకుంది. సీట్ల పంపిణీ సమయంలో చిటపటలు బయలుదేరినా విజయవాడలో సీటు ఆశించి భంగపడిన పోతిన వెంకట మహేశ్ తప్ప మరే ప్రముఖుడూ బయటకు పోలేదు. అయితే పోతిన మహేశ్ వైసీపీ కోవర్ట్ అంటూ జనసేన తిప్పికొట్టింది. కాపుల ఓట్లు తమకు అవసరం లేదన్నట్టు పదేపదే సీఎం జగన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు కూడా కాపు సామాజికవర్గం దూరం కావడానికి కారణమైంది.
టీడీపీ సఫలమైందా?
ఇదే సమయంలో టీడీపీ పవన్ కల్యాణ్ ను నమ్మికైన మిత్రునిగా ప్రకటించింది. తనను వదిలిపెట్టకుండా ముందుకు సాగింది. జనసేనకున్న వాస్తవ బలాన్ని వివరించి చెప్పడంతో పాటు ప్రభుత్వం అంటూ వస్తే అనేక పదవులు వస్తాయని, జనసేనలో సీట్లు త్యాగం చేసిన వారిని ఆదుకోవచ్చని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ ను పార్లమెంటుకు పంపితే బాగుంటుందన్న ఆలోచన కూడా చేసింది. కాని అందుకు పవన్ అంగీకరించలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారు.
ఏపీలో పవన్ కల్యాణ్ కి ఏ పదవి వస్తుందో ఇప్పటికే కాపుల్లో స్పష్టమైంది. జగన్ కు వ్యతిరేకంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి కాపులు వచ్చినట్టు భావిస్తున్నారు. కాపుల్ని అనావసరం కెలికి కంపు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ ను తిట్టేకొద్ది కాపులు కాకలు తీరారు. తమను ఓ మూలకు నెట్టివేశారన్న భావనతో ఉన్న కాపులు వైసీపీకి వ్యతిరేకులుగా మారారని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ కన్నా వైసీపీతోనే ఎక్కువ ముప్పు ఉందని భావిస్తున్న కాపులు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులుగా ఉండే కమ్మసామాజికవర్గంతో కలిసి మెలిసి పని చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఫలితంగానే ముద్రగడ పద్మనాభం కుమార్తె అయినా, వంగావీటి రంగా కుమారుడు రాథా అయినా, అంబటి రాంబాబు అల్లుడైనా, చేగొండి హరిరామ జోగయ్య కుటుంబసభ్యులైనా ముక్తకంఠంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కే జై కొడుతున్నారు. ఇప్పుడిదే వైసీపీకి కంపరంగా మారింది.
Tags:    

Similar News