సరిహద్దు ప్రాంతమనే జగ్గయ్యపేటను సీసీ కెమెరాలతో నింపేశారా?

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 71 గ్రామలలో 529 కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా ఎందుకు ముందు దీన్ని ఎంపిక చేశారు?;

Update: 2025-03-31 09:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తొలి నియోజకవర్గంగా జగ్గయ్యపేట నిలిచింది. నియోజకవర్గంలోని 71 గ్రామలలో 4 చొప్పున మొత్తం 529 కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కృషి వెనుక జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) శ్రమ, పట్టుదల ఉందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా ఒక్క జగ్గయ్యపేటనే ఎందుకు ముందు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది.

జగ్గయ్యపేట నియోజకవర్గంలోన 71 గ్రామాలలో మొత్తం 529 కెమెరాలు ఏర్పాటు అయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ, చట్టపరమైన చర్యల అమలు కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ నేతృత్వం వహించారు. దాతల నుంచి విరాళాలు సేకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు వంటి వ్యూహాత్మక స్థలాలలో ఇవి ఏర్పాటు అయ్యాయి. హోం మంత్రి అనితా ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ కార్యక్రమం బాగా తోడ్పడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కెమెరాల ప్రాజెక్టును విస్తరించాలని భావిస్తున్నారు సంఘ వ్యతిరేక చర్యలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి కఠినమైన శిక్షలు విధించేందుకు కూడా ఈ నిఘానేత్రాలు పని చేస్తాయి.
సీసీ కెమెరాల వల్ల ప్రయోజనం ఏమిటీ, ఎందుకు
ఈ కెమెరాలు పెట్టడం వల్ల ప్రయోజనాలేమిటో ఓసారి చూద్దాం.. సీసీ కెమెరాలు ముఖ్యమైన స్థలాల్లో అమర్చడం వల్ల నేరాలను నివారించవచ్చు. నగరాలలో లేదా గ్రామాలలో ప్రజలకు భద్రత కల్పిస్తాయి. పోలీసులకు సులభంగా ఆధారాలు అందిస్తాయి. సీసీ కెమెరాలు వాటి రికార్డింగ్ ద్వారా నేరం జరిగినప్పుడు పోలీసులకు ఆధారాలను అందిస్తాయి.
పబ్లిక్ డ్రైవింగ్‌ను మెరుగుపరుస్తుంది: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా వాహనదారులు మెలగడం, వేగం దాటకపోవడం వంటి విషయాలను సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తాయి, దీన్తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.
ఆపరేషన్ "సేఫ్ సిటీ" కింద ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడం: సీసీ కెమెరాలు ప్రభుత్వ భద్రతా ప్రాజెక్టులకు సహాయపడతాయి. ఇది మహిళల, పిల్లల భద్రతను పెంచేలా పనిచేస్తుంది.
ఏదైనా వివాదం లేదా గొడవ జరుగితే, సీసీ కెమెరాల రికార్డింగ్ ఆధారంగా కారణాలు ఏమిటో, దోషులెవరో నిర్ధారించుకోవచ్చు. సీసీ కెమెరాలు స్థానిక ప్రాంతాల్లో అమర్చినప్పుడు, అవి మహిళలు, చిన్న పిల్లలపై జరిగే హింసను తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ సీసీ కెమెరాలు మొత్తం ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు మరియు చట్టపరమైన చర్యలను సమర్థంగా అమలు చేసేందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఈ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు..
జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని సీసీ కెమెరాల ప్రాజెక్టు కోసం తొలుత ఎంచుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉండవచ్చు.
వ్యూహాత్మకంగా జగ్గయ్యపేట నియోజకవర్గం కీలకస్థానంలో ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల సరిహద్దు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. రెండు రాష్ట్రాల చెక్ పోస్టులు ఇక్కడే ఉంటాయి. మార్కెటింగ్ శాఖల తనికీ కేంద్రాలు ఇక్కడే ఉంటాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి కుటుంబానికి ఒకరు చొప్పునైనా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంటుంటారు. అంతర్రాష్ట్ర రవాణా చెకింగ్ కేంద్రాలు సైతం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
ఇక హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే). విజయవాడ, హైదరాబాదును కలుపుతుంది. 181 కి.మీ. నాలుగు లైన్ల జాతీయరహదారిని ఆరు లైన్లుగా మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏనేరం జరిగినా తప్పించుకునేందుకు ముందుగా నేరస్ధులు హైదరాబాద్ చేరుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రాజకీయ నాయకుడికి హైదరాబాదులో నివాసాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. చాలమంది వ్యాపారాలు కూడా హైదరాబాదులోనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు కూడా ఈ రహదారి మీదుగానే రవాణా అవుతున్నట్టు గుర్తించారు. చాలా సందర్భాలలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దే పట్టుబడ్డాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయి సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకువచ్చినట్టు సమాచారం.
వ్యూహాత్మకంగా కీలకమైన ఈ నియోజకవర్గంపై దృష్టి సారిస్తే నేరాల తీవ్రత, నిందితుల పట్టివేత సులభం అవుతుందని పోలీసు వర్గాలు కూడా భావించినట్టు ఓ అధికారి చెప్పారు. ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారనే దాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టడానికి వీలవుతుందని ఆ అధికారి వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా అమలైతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరింపజేసే అవకాశం ఉంది. బహుశా రాష్ట్ర హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గాన్ని త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంపిక చేసినట్టు తెలిసింది.
Tags:    

Similar News