రాజకీయ రంగంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఎన్నికల రంగంలో గెలుపు, ఓటములు సహజం. ప్రజల తీర్పును గౌరవించాలి. గెలుపు ఓటములను హుందాగా స్వీకరించాలి. ప్రజల పక్షాన నిలబడాలి. వారి మద్దతును కూడగట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఇదే. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఆ విధంగా కనిపించ లేదు. ప్రజలు కావాలని తమను ఓడించినట్లు, ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేశారని అన్న రీతిలోనే ఉన్నాయి. ఎంతో మేలు చేసిన అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత మాట్లాడటం పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా లేవనే విమర్శలు వినిపించాయి. ఇలాంటి మాటలు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను ఇంకా విషాదంలోకి నెట్టేవిగా ఉన్నాయనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది.
ఎన్నికల్లో గెలుపు, ఓటములపై ఎవరికి ఉండాల్సిన అంచనాలు వారికి ఉంటాయి. అలా ఉండటంలో తప్పు లేదు. కానీ అవి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలి. వాస్తవికతను తెలిపేవిగా ఉండాలి. కానీ ఓవర్ కాన్‌ఫెడెన్స్‌తో వైఎస్‌ఆర్‌సీపీ, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారనే టాక్ కూడా ఉంది. తామే గెలుస్తున్నామని, గతంలో కంటే ఎక్కువ సీట్లల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని, రెండో సారి కూడా మనమే అధికారంలోకి రాబోతున్నామని స్వయంగా అప్పటికీ ఇంకా సీఎం స్థానంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఇక నేతలు, కార్యకర్తల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. దీంతో ఆ పార్టీ పెద్దలు ఏకంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విషయాలను కూడా వెల్లడించేశారు. విశాఖపట్నంలో రెండో సారి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమణ స్వీకారం చేస్తారని, డేట్లు, ముహూర్థంతో సహా వెల్లడించారు ఆ పార్టీ పెద్దలు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి.
ఫలితాలు వెలువడంతో సీన్ రివర్స్ అయింది. ఊహించని రీతిలో రిజల్ట్ వచ్చింది. తమ పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. దీంతో అటు జగన్‌తో పాటు ఆయన పార్టీ నేతలు, శ్రేణుల్లో నోటి మాట పడి పోయింది. ఒక పక్క తామే గెలుస్తామని, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఎక్కడ చేస్తామనే వివరాలు వెల్లడించి డంబాలకు పోవడంతో.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలకు ముఖం చూపించలేని స్థితిలోకి నెట్టబడ్డారు. అవమాన భారంతో కుంగి పోయి నాలుగు గోడలకే పరిమితమయ్యారు. బయటకు వస్తే ఎవరు ఏమి మాట్లాడతారో, వారికి ఏమని సమధానం చెప్పాలనే అవమానంతో నలిగి పోయారు. ఇదంతా వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు చేసుకున్న స్వయంకృతపారధమేని, నేల విడిచి సాము చేసినట్లుగా గొప్పలకు పోవడం ఎందుకు, ఫలితాలు వచ్చిన తర్వాత నాలుగు గోడలకు పరిమితం కావడం ఎందుకు అనే చర్చ అటు ఆ పార్టీకి చెందిన కొంత మంది శ్రేణుల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లో ఉంది.
అక్కడక్కడ అడపా దడపా నేతలు మాట్లాడుతున్నా.. ఫలితాలు వెలువడిన తర్వాత నెల రోజులకు గానీ జగన్ మోహన్‌రెడ్డి బయటకు అడుగు పెట్ట లేదు. తొలి సారిగా మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ శ్రేణులు ఇప్పటికైనా ఓటమి అవమాన భారం నుంచి బయట పడినట్టేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.