ఏపీలో రాజకీయ శూన్యత ఏర్పడిందా? ఎర్రజెండాలకు మరో ఛాన్స్ వచ్చిందా!

రాష్ట్రంలో నామావశిష్టంగా ఉన్న ప్రతిపక్షం పూర్తిగా చతికిల పడుతుంది. రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. ఈ గ్యాప్ ను ఎవరు ఫిల్ చేస్తారనే చర్చ సాగుతోంది;

Update: 2025-01-26 12:02 GMT
ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ మార్పులు తిరిగి వేగం పుంజుకొనే సమయం ఆసన్నమైంది. నిన్నటి అధికార పార్టీ, నేటి ప్రతిపక్ష పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై.ఎస్.ఆర్.సి.పి) నుండి విజయ సాయిరెడ్డి అనే కీలక నాయకుడి (సంపూర్ణ) రాజకీయ నిష్క్రమణ ఆ పార్టీని సంక్షోభానికి గురిచేసింది. ఇందులో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) తెరవెనుక రాజకీయం ఉన్న సంగతి ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి వై ఎస్ ఆర్ సి పి అధినేత, మాజీ ముఖ్య మంత్రి, సుదీర్ఘ కాలంగా బెయిలుపై జైలుకు వెలుపల ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? అదేమిటో త్వరలోనే బిజెపి రాజకీయ తెరపై 70 ఎం.ఎం. సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్ లో చూపిస్తుంది. ఫలితంగా ఇప్పటికే రాష్ట్రంలో నామావశిష్టంగా ఉన్న ప్రతిపక్షం పూర్తిగా చతికిల పడుతుంది. రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. అధికార కూటమిలోని తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపిలు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం చెలాయించే స్థితిలో ఉంటాయి. అప్పుడు ఇక టిడిపిని నిర్వీర్యం చేసే వ్యూహాన్ని ఆచరణలో పెడుతుంది బిజెపి. జనసేన, బిజెపి "నువ్వూ... నేనూ... ఏకమౌదామూ..." అంటూ డ్యూయెట్ సాంగ్ మొదలౌతుంది. అధికారం హస్తగతంతో వారికి శుభం కార్డు పడుతుంది.
ప్రజలకే అసలైన కష్టాలు...
ప్రజలకు అసలైన కష్టాలు మొదలౌతాయి. ఇప్పటి వరకూ కులాల కుంపట్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇక మత ఘర్షణలకు కూడా వేదిక అవుతుంది. మనువాదం ముందుకొస్తుంది. సనాతన ధర్మం వళ్ళు విరుస్తుంది. దృశ్య మాధ్యమాల్లో, పత్రికా వార్తా కథనాల్లో ఉత్తరాది నుండి కనిపిస్తున్న దృశ్యాలు ఆంధ్రులకూ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దానిని సవాలు చేసే శక్తిగల ప్రతి పక్షం అంటూ ఉండదు. ప్రస్తుత వై ఎస్ ఆర్ సి పి స్థాయికి అప్పుడు టిడిపి పరిస్థితి దిగజారుతుంది. ఆనాడు టిడిపిని నమ్మి, మిత్రపక్షంగా నిలిచే రాజకీయ పార్టీ ఒక్కటీ మిగలదు. కాంగ్రస్ కు ఈగడ్డమీద 2014లోనే నూకలు చెల్లాయి. మరిక పాలక వర్గానికి రాజకీయ ప్రత్యామ్నాయం ఎక్కడుంటుంది?
ఏకైక ప్రత్యామ్నాయం వామపక్షాలేనా?
పాలకవర్గ పార్టీల ప్రత్యామ్నాయాలు అన్నింటినీ ఆంధ్రులు చూశారు. ఇక మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం వామపక్షాలే. చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉన్న ఆనాటి రోజుల్లోనూ లేని నేటి కాలాన ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్నది, ప్రజల కోసం నిలబడుతున్నదీ కమ్యూనిస్టులే. వాళ్ళ నీతి నిజాయితీల మీద, నిబద్ధత మీద, కార్యాచరణ మీదా ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది. గౌరవం ఉంది. దానిని ఇప్పటికైనా గుర్తించి నిలుపుకోండి.
మరి ప్రజల వైముఖ్యమంతా కమ్యూనిస్టుల అనైక్యత పైనే. ప్రజలు కోరుకొనేది కమ్యూనిస్టుల ఐక్యత. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల విధాన రూపకల్పన ఉండాలి. అందుకు కమ్యూనిస్టులు అతీతులు కారు. మీ దీర్ఘకాలిక విప్లవ కార్యాచరణకు సమకాలీనంలో అందుబాటులోవున్న అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి. వర్తమాన వాస్తవికత ఆలోచనలకూ, వ్యూహాలకు, ఎత్తుగడలకు ప్రాతిపదిక కావాలి. ఈ మౌలికాంశాన్ని కామ్రేడ్స్ ఎక్కడో జారవిడుచుకొన్నారు. లేదంటే లేనిపోని కమ్యూనిస్టులకు తగని అహంభావాలకు దాసులు అవుతున్నారు. ఇదేదో కమ్యూనిస్టులకు పాఠాలు చెప్పడమో, హితబోధ చేయడమో కాదు. సామాన్య ప్రజలతో మమేకమైన సాధారణ కార్యకర్తగా, కమ్యూనిస్టుగా ప్రజలలో కమ్యూనిస్టుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని వివరించడమే నా కర్తవ్యం.
కమ్యూనిస్టు ఐక్య సంఘటన నిర్మించండి!
ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికన త్రికరణ శుద్ధిగా కమ్యూనిస్టు ఐక్య సంఘటన నిర్మించండి. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యమని స్పష్టంగా ప్రకటించండి. రాష్ట్రం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయండి. ఉద్యమించండి. రాజకీయ శూన్యతను పూరించండి. ఇప్పటివరకూ పాలక వర్గాలు డబ్బు, మద్యంను ఎరగా చూపి ప్రజలను ప్రలోభాలకు గురిచేసి వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాన్నీ దెబ్బకొట్టిన విషయాన్ని వివరించండి. కులంచిచ్చు పెట్టి మెజారిటీ బలం గల శ్రామిక, బలహీన వర్గాల మధ్య అనైఖ్యతకు నిత్యం దొహదం చేస్తున్న కుట్రల్ని రట్టు చేయండి. దారి తప్పుతున యువతను సరైన మార్గానికి తీసుకు వచ్చే కృషి చేయండి. చైతన్య పర్చండి.
"వెనుకతరములవారి వీరచరితల సిరులు
నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా !
విరిసి సుఖములు పండురా...!" అన్న ఆంధ్రనాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు, అభ్యుదక కవి, జీవిత సర్వస్వాన్నీ ప్రజా సేవకు అర్పించిన అమరజీవి పులుపుల వెంకటశివయ్యగారి కవితా సారాన్ని అందిపుచ్చుకోండి.
Tags:    

Similar News