ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా తొలి తెలుగు శాస్త్రవేత్త
భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1905లో దీని ప్రస్థానం ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటి వరకు డైరెక్టుర్లుగా పని చేసిన వారిలో తెలుగు వారు లేరు.;
దేశంలోనే కాకుండా, అంతర్జాతీంగా కూడా ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ)కు మొదటి సారిగా ఓ తెలుగు శాస్త్ర వేత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ చరిత్రలో డైరెక్టర్ అయిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయనే చెరుకుపల్లి శ్రీనివాసరావు. చెరుకుపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ పరిశోధన రంగంలో విశేష అనుభవం కలిగిన శాస్త్రవేత్త. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో దాదాపు 300లకుపైగా పరిశోధన పత్రాలను సమర్పించారు. నేషనల్, ఇంటర్‌నేషనల్ జర్నల్స్‌లో కూడా ఆయన పరిశోధన పత్రాలు అచ్చయ్యాయి. ఐఏఆర్‌ఐలో వివిధ హోదాల్లో పని చేసిన శ్రీనివాసరావు 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పని చేస్తూ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేసిన శ్రీనివాసరావు అంతర్జాతీయంగాను మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్తగా శ్రీనివాసరావుకు మంచి పేరు ఉంది. వాతావరణ మార్పులపై ఇంటర్‌నేషనల్ లెవల్లో జరిగిన అనేక సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. అనేక విధాన పరమైన నిర్ణయాల్లోను కీలక పాత్ర పోషించారు.