ఏపీ రైతులకు అలర్ట్... కిసాన్ యోజన నిధుల విడుదల రేపే
పీఎం కిసాన్ యోజన పథకం- అన్నదాతా సుఖీభవ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదు సాయం నవంబర్ 19న రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.
By : The Federal
Update: 2025-11-18 04:00 GMT
పీఎం కిసాన్ యోజన పథకం- అన్నదాతా సుఖీభవ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదు సాయం నవంబర్ 19న రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకం ఇది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు జమ చేస్తుంది.
ఈ ఏడాదికి ఇస్తున్న చివరి విడత సాయం ఇది. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 21 సార్లు డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసింది. అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్ష్ ఫర్ ప్రాతిపదికన మూడు సమాన వాయిదాలుగా రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు రైతులు ఎదురుచూస్తున్న 21వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా రూ.3,174 కోట్లు విడుదలయ్యాయి. రెండు విడతల్లో కలిపి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో(ఆర్‌ఎస్‌కే) ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ‘రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా.. వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం ప్రసారం చేయాలి. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెట్ సౌకర్యాల పెంపు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఆహారశుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి’ అని సూచించారు.
రైతులకు ముందే మెసేజ్‌లు- అచ్చెన్నాయుడు
పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు నవంబర్ 18నే మెసేజ్‌లు పంపాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.