తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ప్రారంభం అయ్యాయి. ఈ రోజు రాత్రి చిన్నశేషవాహనంపై పద్మావతీ అమ్మవారు మాడవీధుల్లో విహరిస్తూ, యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ఆదివారం రాత్రి అంకురార్పణ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం సాయంత్రం అమ్మవారి ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
అంకురార్పణ అంటే..
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కార్తీకమాస బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం తరువాత ఆలయ మాడవీధుల్లో సేవాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత అంకురార్పణ చేశారు. భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేశారు. మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి, అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరించారు.
అంకురార్పణ కార్యక్రమంలో అమ్మవారి ఆలయం వద్ద ఉన్న శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప (మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్ర సమర్పణ చేశారు. భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో కేవి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అధికారులు పాల్గొన్నారు.
"దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. రోజూ పది వేల మందికి అన్నప్రసాదాలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేశామన్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయించినట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం తోపాటు పరిసర ప్రాంతాలన్నీ బ్రహ్మెత్సవ కళ సంతరించుకున్నాయి. ఆలయం, పద్మపుష్కరిణి, శుక్రవారపు తోట తోపాటు రహదారులన్నీదేవతామూర్తుల విద్యుద్దీపాల అలంకరణ కనువిందు చేస్తోంది.
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 20వ తేదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. అమ్మవారి దర్శనం తరువాత రాష్ట్రపతి తిరుమలకు వెళతారు. ఆ రోజు రాత్రికి తిరుమలలో బస చేస్తారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.
అమ్మవారి బ్రహ్మెత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. బ్రహ్మత్సవాలకు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఘనంగా స్వాగతించి, దర్శన ఏర్పాట్లు చేయాలని, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అన్న చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ నాయుడు తెలిపారు.
వాహన సేవలు ఇలా..
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల వివరాలు కూడా ప్రకటించారు. రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఆ సమయంలో పద్మావతీ అమ్మవారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
18-11-2025 (మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
19-11-2025 (బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
23-11-2025 (ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-11-2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
నవంబర్ 26న పుష్పయాగం నిర్వహిస్తారు.
మరో తమిళనాడుగా తిరుచానూరు..
ఇది పద్మపుష్కరిణి అమ్మవారి బ్రహ్మత్సవాల ముగింపు రోజు ఈ నెల 25 వ తేదీ భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలిస్తారు. హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మంది యాత్రికులు వేచి ఉండే అకాశం ఉంటుంది. దీనికి తగినట్లు భత్రతా ఏర్పాట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ తెలిపారు.
పంచమీతీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగానే యాత్రికులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లు భద్రత, అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు తరలిరావడం ప్రత్యేకత. వారికి మించి తమిళనాడు నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. బ్రహ్మోత్సవాల ముగింపు రోజు అమ్మవారి ఆలయం సమీపంలో పద్మపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇసుక వేస్తే రాలనంతగా యాత్రికులు హాజరు కావడం ఓ ప్రత్యేకత. అమ్మవారి వాహనసేవలో పాల్గొనడం అనడం కంటే, పల్లకీమోయడానికి తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయం నుంచి శ్రీవైష్ణవులు ప్రత్యేకంగా తరలి వస్తారు. వివిధ స్థాయిల్లో ఉన్నతోద్యోగాలు చేసే వారంతా సెలవు తీసుకుని శ్రీరంగం నుంచి వచ్చే వారంతా బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు తిరుచానూరులో ఉంటూ రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారి ఆశీనులయ్యే పల్లకీమోయడంలో కీలకంగా వ్యవహరిస్తారు.
తిరుచానూరు బ్రహ్మత్సవాల్లో కీలకమైన పంచమీతీర్ధం రోజు తిరుమల నుంచి భారీ ప్రదర్శనతో పద్మావతీ అమ్మవారికి ఏనుగులపై సారె తీసుకుని వచ్చి, సమర్పిస్తారు. దీనికోసం పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్ తెలిపారు.
బ్రహ్మత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టీటీడీ యంత్రాంగం, భద్రత అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి. వీరబ్రహ్మం, సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఈ పాటికే అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా యంత్రాంగానికి బాధ్యతలు వికేంద్రీకరించారు. తిరుమల తరహాలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చెప్పారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళా పోలీసులను కూడా భద్రతా విధుల్లో నియమిస్తున్నట్లు తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించే దిశగా ఏర్పాట్లు చేశామని ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు.