ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య తన బాడీ ల్యాంగ్వేజ్‌ని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒకే విధంగానే ఉండేవారు. ఎవరైన పెద్దలు వచ్చి తనను కలిసినప్పుడు కానీ, ఆప్తులు, వ్యాపార వేత్తలు భేటీ అయినప్పుడు కానీ ఉప్పొంగి పోవడం, భావోద్వేగాలకు లోను కావడం కానీ చేసే వారు కాదు. ప్రేమ ఆప్యాయతలు పొంగి పొర్లినా వాటిని హృదయంలోనే పెట్టుకొని నవ్వుతూ పలకరించే వారు. షేక్ హ్యండ్ ఇచ్చేవారు. లేదంటే రెండు చేతులెత్తి దండం పెట్టేవారు. కానీ ఈ మధ్య వాటికి భిన్నంగా ఉంటున్నారు. తన బాడీ ల్యాంగ్వేజ్‌ని మార్చుకున్నారు. కరచాలనాలతో పాటు ఆలింగనాలతో వారి పట్ల తన ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల నుంచే ఈ రకమైన పలకరింపును సీఎం చంద్రబాబు అలవర్చుకున్నారేమో. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు ఆప్త మిత్రుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతోనే ఇది మొదలైంది. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టైన నాటి నుంచి బీజేపీతో పొత్తులు కుదుర్చుకోవడంలోను, ఎలాంటి మనస్పర్థలు, భేదాభిప్రాయాలకు తావు లేకుండా సీట్లను సర్థుబాటు చేసుకోవడంలోను, తద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలోను కీలక భూమిక పోషించి, ఇచ్చిన మాటకు కట్టబడి ఉండటంతో పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబుకు అపారమైన ప్రేమ, ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకోవడం ద్వారా తన మనసులోని ప్రేమ, ఆప్యాయతలను, గౌరవ మర్యాదలను పవన్ కళ్యాణ్‌ను తెలియజేస్తున్నారు. నాటి నుంచి వారిద్దరు ఎక్కడ భేటీ అయిన కరచాలనాలు చేసుకోవడం, పూల బొకేలను ఇచ్చి పుచ్చుకోవడం, రెండు చేతులతో నమస్కారాలు చేసుకోవడంతో పాటుగా ఆత్మీయ ఆలింగనం చేసుకొని పరస్పరం గౌరవించుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడి, బంపర్ మెజారిటీ సాధించిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా తన చంద్రబాబు తన భావోద్వేగాలను బయట పెట్టారు. ఎన్నికల్లో గెలవడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం చంద్రబాబుకు కొత్తేమి కాదు. ఇది వరకు ఆ అనుభవాలను కూడా చూశారు. ఆనందించారు. అయితే ఈ సారి మాత్రం పరిస్థితులు మాత్రం భిన్నం. తొలి సారి గెలిచినప్పుడు హద్దుల్లేని ఆనందాలు వెల్లువెత్తుతాయో, జీవితంలో ఎప్పుడు చూడని విజయాన్ని అందుకున్నప్పుడు ఎలాంటి సంతోషం కమ్ముకుంటుందో, అంతకంటే ఎక్కువు మోతాదులో చంద్రబాబుకు తనలోని సంతోషం కట్టలు తెంచుకుంది. ఏడు పదుల వయసు మీరిన చంద్రబాబు తొలి సారి పాలిటిక్స్‌లో విజయం సాధించిన నాయకుడిలా మారారు.
అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం, నాలుగో సారి ముఖ్యమంత్రి అవుతున్నాననే భావనలో తన ఆనందాన్ని ఆపుకోలేక పోయారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేక పోయారు. వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే జూనియర్ అయినా, ఇగోను పక్కన పెట్టి మోదీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెనుకాడ లేదు. ఆనంద భాష్పాలు రాల్చుకుంటూ మోదీని ఆలింగనం చేసుకొని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ క్షణంలో చంద్రబాబు ఒక చిన్న పల్లాడై పోయారు. ఆ దృశ్యం చూసిన వారు ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోయారు. బహుశా తనను కష్ట కాలంలో మేమున్నామనే భరోసా ఇవ్వడం కావచ్చు. జైలు నుంచి బయటకు తీసుకొచ్చారనేది కావచ్చు. వారిద్దరిని తన ఆత్మీయులు అనుకున్నారేమో. అందుకే వారిని ఆత్మీయ ఆలింగనం చేసుకొని వారి పట్ల తనకున్న గౌరవ, మర్యాదలను వ్యక్తం చేసినట్లున్నారు.
శనివారం కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకొని వారి మధ్య ఉన్న అనుబంధం, అనురాగాన్ని పరస్పరం వ్యక్తం చేసుకున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం ఈ నాటిది కాదు. దాదాపు 18 ఏళ్లుగా వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే కాబోలు భేటీ అనంతరం కారు వరకు వచ్చి మరీ యూసఫ్ ఆలీని సీఎం చంద్రబాబు సాగనంపారు.
గత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సంస్థలు పెట్టేందుకు లులు గ్రూపు ఆసక్తి కనబరిచింది. దాదాపు రూ. 2,200 కోట్ల పెట్టుబడితో విశాఖలో భారీ షాపింగ్ మాల్, ఐదు వేల సీట్ల సామర్థ్యంతో ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్స్‌తో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు, దీంతో 10వేల మందికి ఉపాధి కల్పించేందుకు 2018లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కోసం 13.83 ఎకరాల భూమిని లులు గ్రూపునకు కేటాయించారు. నిర్మాణాల కోసం డిజైన్లు కూడా తయారు చేయడంతో పాటు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేశారు. తర్వాత ప్రభుత్వం మారి పోయింది. వైఎస్‌ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవన్నీ వర్క్‌వుట్ కాలేదు. తాజాగా ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లులు గ్రూపు తిరిగి అమరావతిలో అడుగు పెట్టింది.