చంద్రబాబు ఇండస్ట్రియల్ సేప్టీ కమిటీలో అనుభవజ్ఞులేరీ: ఇఎఎస్ శర్మ ప్రశ్న

విశాఖ పరిశ్రమల ప్రమాదాల మీద హైలెవెల్ కమిటీ వేశారు. కాన్నీ ఒక్కరైన అనుభవజ్ఞలుండాలిగా

Update: 2024-09-20 04:59 GMT


అచ్యుతాపురం SEZ ప్రమాదంతో పాటు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు 13-9-2024 న GOMs No. 51 ద్వారా నియమించిన హైలెవెల్ కమిటీలో అనుభవజ్ఞులెవరూ లేని విషయాన్ని మాజీ ఐఎఎస్ అధికారి డా. ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువచ్చారు. ఇండస్ట్రియల్ ప్రమాదాలలో, ముఖ్యంగా రసాయన పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలను అర్థం చేసుకునేందుకు సంబంధిత రంగంలోని నిపుణలు లేకపోతే కమిటీ వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరదని ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.

ఆగస్టులో విశాఖ సమీపంలోని అచ్యుతాపురం SEZ లో ఈసైన్సు (EScience) యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ముప్ఫై మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి ముఖ్యమంత్రి బాధితులకు పెద్ద ఎత్తున పరిహారం ప్రకటించారు. అయితే, ఆయన వైజాగ్ నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే పక్కనే ఉన్న ఫార్మాసిటీ లో, సినర్జీస్ (Synergies) యూనిట్ లో ఇంకొక ప్రమాదం జరిగి, నలుగురు కార్మికులు గాయపడ్డారు. చంద్రబాబు తక్షణ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాల తప్పిదాలు ఎలా ప్రమాదాలకు దారితీస్తున్నాయో ఆయన లేఖలో వివరించారు.



చంద్రబాబు నాయుడు (ఎడమ), డాక్టర్ ఇఎఎస్ శర్మ


 “గత ప్రభుత్వాల కాలంలోనే కాకుండా, అంతకు ముందు అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం కాలంలో, అంతకు ముందున్న ప్రభుత్వాల పాలనలో కూడా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో, పరిశ్రమలు నిర్మించి, ప్రజల వద్ద నుంచి లాభాలు గణిస్తూ, అక్కడ పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో , పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం, కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానులకు ఉన్న అన్యోన్య సంబంధాలే అని అందరికీ తెలిసిన విషయం.

“అటువంటి పరిశ్రమల్లో, ప్రమాదాల వలన, ప్రజల ప్రాణాలకు హాని కలగడమే కాకుండా, ఆ యూనిట్లు వెదజలుతున్న కాలుష్యం కారణంగా, ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతున్నది.

శ్రీకాకుళం దగ్గర, పైడి భీమవరం లో పని చేస్తున్న రసాయన పరిశ్రమలలో, వైజాగ్ లో ఉన్న LG పాలిమర్స్ లో, పరవాడ ఫార్మాసిటీ లో, నక్కపల్లి దగ్గర హెటిరో డ్రగ్స్ యూనిట్ లో, పాయకరావుపేట దగ్గర డెక్కన్ కెమికల్, అచ్యుతాపురం SEZ లో ఉన్న యూనిట్లలో, నిరంతరం జరుగుతున్న ప్రమాదాలు చూస్తే, పరిశ్రమల యాజమాన్యాల నేర చరిత్ర గురించి, వారి మీద చర్యలు తీసుకోని అధికారుల నిర్లక్ష్యం గురించి అర్థమవుతుంది,” అని డాక్టర్ శర్మ అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నియమించిన హైలెవెల్ కమిటి లో అనుభవజ్ఞలు లేని విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


లేఖ లోని వివరాలు :

“ఆ కమిటీ లో మెంబర్లు గా, 11 మంది అధికారులు ఉన్నారు. వారిలో రసాయన పరిశ్రమలలో ప్రపంచ స్థాయి safety protocols మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్న అధికారులు ఎవరూ లేరు. అదే కాకుండా, మన రాష్ట్రంలో, గత పది సంవత్సరాలలో, 40 కి పైగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం దృష్టిలో పెట్టుకుంటే, రాష్ట్ర పరిశ్రమల, కార్మిక సంక్షేమ విభాగాల్లో పనిచేస్తున్న పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని గుర్తించాలి. కమిటీలో, IIT (Chennai), IIT (Tirupati) ప్రతినిధులు, Niti Aayog ప్రతినిధులు ఉన్నారు, కాని వారికి కూడా safety protocols మీద hands-on అనుభవం లేదు.

ఆశ్చర్యకరమైన విషయం, కమిటీలో ఐదు మందికి మీదుగా, ఏ పరిశ్రమల్లో ప్రమాదాలు నిరంతరం జరుగుతున్నాయో, అటువంటి పరిశ్రమల ప్రతినిధులను మెంబర్లు గా చేర్చడం. అటువంటి వారు మెంబర్లు గా ఉన్న కమిటీ ఇచ్చిన సలహాల మీద ప్రజలకు గాని, ప్రభుత్వానికి గాని, నమ్మకం ఎలాగ కలుగుతుంది? ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరగవని గారంటీ ఎలాగ ఉంటుంది?

GOMs No. 51 ద్వారా నియమించబడిన కమిటీ బాధ్యత, అచ్యుతాపురం SEZ లో జరిగిన ప్రమాదం, అదేకాకుండా, కొన్ని రోజుల తర్వాత ఫార్మాసిటీ లో Synergies Active Ingredients లో జరిగిన ప్రమాదం విషయానికి మాత్రమే పరిమితించబడింది. నా 24-8-2024 లేఖలో మీ దృష్టికి తీసుకు వచ్చిన మిగిలిన ప్రమాదాల మీద జరిగిన దర్యాప్తుల విషయం గురించి GOMs No. 51 లో ప్రస్తావించబడలేదు. ఆ ప్రమాదాలకు కారణాలేమిటి? అందుకు ఎవరు బాధ్యులు? ఆ ప్రమాదాలకు సంబంధించిన FIR ల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? ఆ ప్రమాదాలలో కార్మికుల ప్రాణాలు పోయినా, పరిశ్రమల సీనియర్ అధికారులు కాని, యజమానులు కాని జైలుకు పోలేదు. ఒకే unit లో రెండు మూడు ప్రమాదాలు జరిగి, కార్మికులకు ప్రాణనష్టం కలిగినా, యాజమాన్యాల మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించాలి. అందువలనే మన రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమల యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయి.

అచ్యుతాపురం SEZ లో, ఫార్మాసిటీ లో జరిగిన ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు పోవడం, కొంతమంది గాయపడడం దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ఆ యూనిట్ ల యజమానుల మీద తత్ క్షణం కఠినమైన చర్యలు తీసుకుంటే కాని, అటువంటి ప్రమాదాలు మరే మరే జరగవనే నమ్మకం, కార్మికులలో కాని, ప్రజలలో కాని కలగదని మీరు గుర్తించాలి.

GOMs 51 ద్వారా నియమించబడిన కమిటీ లో, పరిశ్రమల ప్రతినిధులకు బదులు, ఇండస్ట్రియల్ సేఫ్టీ(industrial safety) విషయంలో పనిచేసిన అనుభవం ఉన్న ఇండిపెండెంట్ నిపుణులను చేర్చవలసిన అవసరం ఉంది. కమిటీ, అచ్యుతాపురం SEZ, ఫార్మాసిటీ ప్రమాదాలమీద నివేదిక ఇచ్చిన తరువాత, గత పది సంవత్సరాలలో, రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల విషయంలో తీసుకున్న చర్యల గురించి కూడా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించాలి.

GOMs No. 51 ద్వారా నియమించబడిన కమిటీ కి, స్టాండింగ్ కమిటీ గా, పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టే బాధ్యత ఇస్తే, పరిస్థితి కొంత మెరుగు పడే అవకాశం ఉంది.

నా 24-8-2024 లేఖలో ప్రమాదాలకు గురియైన పరిశ్రమల యాజమాన్యాల మీద తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా ప్రస్తావించాను. అటువంటి చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రంలో, మళ్లీ మళ్లీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది,” డాక్టర్ ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేశారు.


Tags:    

Similar News