అట్టుడుకుతున్న అనంతపురం
అనంతపురం టీడీపీ అసంతృప్తి భగ్గుమంది. దగ్గుబాటి, ప్రభాకర్ అనుచర వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పొత్తు రాజకీయాలతో చెలరేగిన అసమ్మతితో అనంతపురం టీడీపీ అట్టుడుకుతోంది. అర్బన్ టీడీపీ ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అయితే అనంతపురం అర్బన్ సీటును టీడీపీ దగ్గుబాటి ప్రసాద రావుకు కట్టబెట్టింది. దీంతో భంగపాటుకు గురైనా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన అనుచర వర్గంతో గుత్తి రోడ్డులోని కనకదాసు విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రసాద రావుకు అక్కడి చేరుకున్నారు. ఆయనను చూసిన వెంటనే గో బ్యాక్ ప్రసాద రావు అంటూ ప్రభాకర్ అనుచరులు నినాదాలు చేశారు. అంతేకాకుండా ప్రసాద రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఈ వివాదాన్ని సద్దుమణిగించారు.