విఆర్ఎస్ తో ముగిసిన ఆయన ఐఏఎస్ కొలువు

ఏపీలో ఆయనో వివాదాస్పద ఐఏఎస్ అధికారి. గత ప్రభుత్వంలో ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పలువురు తోటి ఐఏఎస్ లతోనూ గొడవలు వచ్చాయి.

Update: 2024-07-10 06:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పద ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ తో తన కొలువుకు ముగింపు పలికారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోడానికి ప్రధాన కారణం ఆయన చేసిన తప్పులేనని, ఆయన మనసుకు కూడా ఈ తప్పులు క్షమించరానివేనని అనిపించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎంతో మంది సివిల్స్ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి పట్టుదలతో సాధిస్తారు. ఆ అవకాశం ప్రవీణ్ ప్రకాష్ కు దక్కింది. 1994 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ ప్రకాష్, న్యూ ఢిల్లీలో రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్‌గా రెండేళ్ల పాటు పనిచేసిన తర్వాత 2019లో రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత శక్తివంతమైన సివిల్ సర్వెంట్‌గా ఉన్నారు . ఇప్పుడు ఆయన భార్య ఆ స్థానాన్ని ఆక్రమించారు. భావనా ​​సక్సేనా 1996 బ్యాచ్‌కి చెందిన IPS అధికారి.

ప్రవీణ్ ప్రకాష్ ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్. వివాదాస్పదమైన సమర్థత, నిజాయితీ గల వ్యక్తిగా కాన్పూర్ లో ఆయనతో పాటు చదువుకుని ఉద్యోగాల్లో ఉన్న పలువురు స్నేహితులు అభివర్ణించారు. అయితే ఆయనకు ఉన్నశక్తి సామర్థ్యాల గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి

ప్రజల నుంచి ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి వివాదాలు లేవు. చెడ్డ పేరు కూడా లేదు. అవినీతి పరుడనే ముద్ర కూడా లేదు. ప్రజలకు అందాల్సిన సేవలు సకాలంలో అందుతున్నాయా? లేవా? అనే విషయాలపై పర్టిక్యులర్ గా వుండేవాడని పలువురు ఉద్యోగులు చెప్పడం విశేషం. కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన కాలాల్లోనూ తప్పులను వెతికి పట్టుకోవడంలో ముందుండే వాడని, తప్పులను సమర్థిస్తూ పోతే సమాజం పాడైపోతుందనే ఆలోచన కలిగిన వాడని ఆయన మిత్రులు కొందరు చెబుతున్నారు. ఇంకా ఏడు సంవత్సరాల పాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉన్నా విఆర్ఎస్ తీసుకోవడం వెనుక మతలబు ఏమిటనే చర్చ కూడా ఏపీలో మొదలైంది.

ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీఆర్‌ఎస్‌ సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ గత నెల 25న వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన ప్రభుత్వం ఆయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ కు ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలు బడి బయట కనిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఒకసారి ప్రకటించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగింది. పలు జిల్లాల్లో కలెక్టర్ గా, మునిసిపల్ కార్పొరేషన్ లలో కమిషనర్ గా పనిచేసి వివాదాస్పదుడిగా పేరు సంపాదించారు. ఎక్కడ పనిచేసినా అక్కడ ఉద్యోగులను వేదించారని పలు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. గుంటూరులో కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడు పదిన్నర తరువాత చాలా మంది ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చారు. వారందరినీ గేటుబయటే నిలబెట్టి గేటుకు తాళం వేయించారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. అయితే ఆయన ఇటువంటి వివాదాలను పట్టించుకోలేదు. సకాలంలో ఆఫసుకు రమ్మని ఆదేశిస్తే అదికూడా వివాదాస్పదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. నిర్థాక్షిణ్యంగా ఆక్రమణలు తొలగించారు. వ్యపార వర్గాల్లో వ్యతిరేకత రాగా ప్రజల నుంచి మద్దతు వచ్చింది.

ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్‌ ప్రకాష్ స్కూళ్లను సందర్శించడం, ఉపాధ్యాయులకు చీవాట్లు పెట్టడం చేశారు. మీకు జీతాలెందుకు నేను పాఠాలు చెప్పనా అంటూ కొన్నిసార్లు ఆయన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాన్ని విద్యాశాఖలో ఉండగా సందర్శించారు. స్కూల్ బుక్స్ పంపిణీ విషయంలో లేట్ చేశారంటూ డీఈవో, ఎంఈఓ సహా మరో ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. స్కూల్ బుక్స్ పంపిణీ ఆలస్యానికి కారణం ప్రభుత్వం అయితే, తప్పు అధికారులపై నెడితే ఎలా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులు ఆందోళనలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ర్యాలీతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని ఉపాధ్యాయ సంఘాలను శాంతింపజేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ గొడవలు పడే వారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన కొన్ని జీవోలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇస్తారు. గత ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎల్ వి సుబ్రమణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనను కూడా ఓవర్టేక్ చేస్తూ కొన్ని జీవోలు పొలిటికల్ కార్యదర్శి హోదాలో ఇచ్చారు. తనకు తెలియకుండా జీవో ఎలా ఇస్తారంటూ వివరణ ఇవ్వాల్సిందిగా ఎల్వీ మెమో జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఏకంగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సీఎస్‌‌గా వచ్చిన నీలం సాహ్ని ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడంతో ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అనంతరం సీఎస్‌ గా వచ్చిన ఆదిత్యనాథ్‌ దాస్‌కు ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి నచ్చలేదు. దీనిపై ఆయన కొన్ని సందర్భాల్లో అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో జగన్‌ కూడా ప్రవీణ్ ప్రకాశ్‌ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రవీణ్‌ ప్రకాష్‌ను కూటమి ప్రభుత్వం గత నెల 19న బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో, ఆయన నివాసం ఉండే విల్లా, దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ రీల్స్‌ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News