ఈ ఐఎఎస్ ఆఫీసర్ చూడండి, చివరికెలా నిష్క్రమించాడో...
కొందరు ఐఎఎస్ ఆఫీసర్లను ప్రజల గుండెల్లో భద్రపరుచుకుంటారు. ప్రజల పక్షాన ఉన్నందుకు. మరికొందరిని కూడా ప్రజలు మర్చిపోరు. ఎందుకు? వాళ్లు ప్రజల మీద గురిపెట్టినందుకు...
(కందారపు మురళి)
దివంగత ఎస్ ఆర్ శంకరన్ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు చెబితే అప్రయత్నంగా ప్రజల చేతులు జోడించబడతాయి.
నిరాడంబరతకు, నిస్వార్థానికి చిరునామాగా ఆయన జీవితం సాగింది. పేదలకు ఇచ్చే అసైన్డ్ భూములు అమ్మటానికి కానీ, కొనటానికి కానీ ఎవరికీ అధికారం ఉండకూడదని చట్టం చేయించిన వ్యక్తి ఎస్ ఆర్ శంకరన్. ఆ చట్టానికి తూట్లు పొడిచిన వ్యక్తి జవహర్ రెడ్డి.
మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పేరు చెబితే దళిత సమస్యలపై ఆయన చేసిన కృషి కళ్ల ముందు కదలాడుతుంది. కొప్పుల రాజు పేరు గుర్తొస్తే నెల్లూరు జిల్లాలో అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక పోరాటం గుర్తుకొస్తాయి. మరో ఐఏఎస్ అధికారి గోపాలరావు పేరు వినిపిస్తే ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ గుర్తుకొస్తుంది.
జవహర్ రెడ్డి పేరు చెబితే లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అధికార పార్టీ నాయకులకు అక్రమంగా కట్టబెట్టిన తీరు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం అత్యంత శక్తివంతులైన, నిజాయితీపరులైన అధికారుల్ని చూసింది. ఇదే సమయంలో జవహర్ రెడ్డి లాంటి అత్యంత వివాదాస్పదులు కూడా ఉండటాన్ని ప్రజాస్వామిక వాదులు జీర్ణించుకోలేకున్నారు.
ఐఏఎస్ అన్నది కొందరి 'డ్రీమ్' ఎన్నో అద్భుతాలు చేయవచ్చని, ప్రజలకు సాయం చేయడానికి ఇది ఓ సాధనమని భావించి లక్షల మంది ఐఏఎస్ లుగా కావటానికి ఎంతో కృషి చేస్తున్నారు. జవహర్ రెడ్డి లాంటి అధికారుల తీరు కారణంగా ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.
స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశాలు ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలో కొందరు అధికార పార్టీలకి 'చెంచాలు'గా తయారై వారి అడుగులకు మడుగులు వత్తుతూ దిగజారి వ్యవహరించటం దారుణం.
గతంలో పలు సందర్భాలలో సీనియర్ అధికారులుగా పనిచేసి రిటైరైన వారు ముఖ్యమంత్రుల నిర్ణయాలు సైతం సరైనవి కావని మార్చుకోమని సలహాలు ఇచ్చిన ఘటనలు తెలుగు ప్రజలకు తెలుసు.
శక్తివంతమైన స్థానంలో ఉండి పాలకులు చేస్తున్నది తీవ్రమైన తప్పులు, నేరాలు అని తెలిసినా వాటికి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న తీరు అమానుషం.
సాధారణ ప్రజలు, కూలీ, నాలి చేసుకుని బ్రతికే వారు ఇచ్చే పన్నుల నుంచి లక్షల రూపాయలు వెచ్చిస్తుంటేనే వీరు ఐఎఎస్ లుగా తయారు అవుతున్నారు. ప్రజలకు వీరు తిరిగి ఇస్తున్నది ఏమిటి?
ఈ వాస్తవాన్ని ఇలాంటి అధికారులు విస్మరించి ప్రజా వ్యతిరేకులుగా మారిపోవడమే నేడు తీవ్ర విషాదం.
వాస్తవంగా జవహర్ రెడ్డి టీటీడీ ఇఓ అయ్యేంతవరకు వివాదాలకు అతీతంగా ప్రజానుకూల అధికారి గానే కనబడ్డారు.
2021 వ సంవత్సరంలో టీటీడీ ఇఓ గా ఉన్న జవహర్ రెడ్డి .... అప్పటివరకు కరోనా తో అల్లాడిపోయిన జనం అప్పుడప్పుడే సాధారణ స్థితికి రావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వరదలు, భారీ వర్షాలు వచ్చి పడ్డాయి. ఊరంతా బురదమయం అయింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.
అలాంటి సమయంలో
తిరుమల కొండని పరిశుభ్రంగా, పచ్చదనంతో కాపాడుతున్న కాంట్రాక్టు కార్మికులు తమకు సాయం చేయమని కోరుతూ జవహర్ రెడ్డిని అర్థించారు.
వస్తున్న జీతం సరిపోవటం లేదని ధరలు విపరీతంగా పెరిగాయని, కాంట్రాక్టర్ల వేధింపులు భరించలేకున్నామని తమకు సాయం చేయమని కోరుతూ బోరున విలపించారు.
జవహర్ రెడ్డి కానీ, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం స్పందించలేదు.
విధి లేని పరిస్థితుల్లో తిరుమల కొండ మీద పనిచేసే కార్మికులు 2021 అక్టోబర్ నెల చివరి నుంచి నవంబర్ వరకు 14 రోజులపాటు నిరంతరాయంగా వర్షంలో, బురదలో తడుస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఐదు వేల మందికి పైగా కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా తమకు న్యాయం చేయమని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు.
వీరి పట్ల జవహర్ రెడ్డి ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారు.
14 రోజుల తరువాత కనీసం వీరితో సంప్రదింపులు కూడా జరపకుండా, వారి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకుండా, పోలీసులను ఉసిగొల్పి, భారీ లాఠీచార్జి చేయించారు. కార్మిక నాయకులు, కార్మికులపై కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారు.
ఈ నిరసనకు నాయకత్వం వహించిన ఒక్కో కార్మికుడి పై రోజుకు ఒక కేసు చొప్పున 14 కేసులు పెట్టి, అదనంగా 'టిటిడి పై కుట్ర' చేశారని మరో కేసు పెట్టారు.
నోరులేని కూలీలపై 15 కేసులు పెట్టి నేటికీ కోర్టుల చుట్టూ తిరగటానికి జవహర్ రెడ్డి కారకులయ్యారు.
టీటీడీ అటవీ విభాగంలో 362 మంది కార్మికులు పనిచేస్తుంటే నాటి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారని 162 మంది జూనియర్లను పర్మినెంట్ చేసి రెండు వందల మంది సీనియర్లకు ద్రోహం చేశారు.
అప్పటికే వీరికి ఉన్న 'టైం స్కేల్' వేతనాలను కూడా తొలగించి 'లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్' లో కలిపి వేధింపులకు గురి చేశారు.
'సిఐటియు' ఆధ్వర్యంలో యూనియన్ కలిగి ఉండటమే వీరు చేసిన నేరం.
58 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో 38 నెలల పాటు ఈ రెండు వందల మంది కార్మికులు టిటిడి కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేశారంటే ఎంతటి తీవ్రమైన ద్రోహానికి జవహర్ రెడ్డి పాల్పడ్డారో అర్థం అవుతుంది.
చివరకు టిటిడి ఛైర్మన్ గా భాధ్యతలు చేపట్టిన తరువాత కరుణాకర్ రెడ్డి జోక్యంతో వీరి సమస్య పరిష్కరించబడింది.
అయినప్పటికీ వీరికి సంపూర్ణ న్యాయం నేటికీ జరగలేదు. ప్రస్తుతం ఈ సమస్య కోర్టుల్లో నలుగుతోంది.
శక్తివంతమైన స్థానాల్లో ఉన్న ఐఏఎస్ లు జవహర్ రెడ్డిలా అయ్యా... ఎస్ లుగా మారకుండా, బంధుప్రీతిని చూపకుండా వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది.
జవహర్ రెడ్డి తనకున్న అధికారాలతో ఈ ఐదేళ్లలో చెలరేగిపోయారు. అనేక వివాదాలకు కేంద్రంగా మారారు. మన్యంలో కుమారుడు మైనింగ్ దందా చేయడానికి తోడ్పడ్డారని, విశాఖ భూముల స్కామ్ లో వీరి హస్తం ఉందని, జిఓ 596 కింద నిషేధిత భూముల జాబితా నుంచి నాలుగు లక్షల ఎకరాలు తొలగించి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారని, ఎన్నికల సమయంలో అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించారని తీవ్రమైన ఆరోపణలను మూటగట్టుకున్నారు.
అత్యంత అవమానకర రీతిలో ఆఖరికి నూతన ప్రభుత్వ పెద్దలు జవహర్ రెడ్డి మొహం కూడా చూడటానికి ఇష్టపడక, బలవంతంగా ఇంటికి పంపి, సెలవులోనే ఉంటూ ఈరోజు రిటైర్ అవుతున్న జవహర్ రెడ్డి ... ఇక శేష జీవితాన్నయినా ప్రజానుకూలంగా మార్చుకోమని సలహా ఇవ్వటం తప్ప ఏం చేయగలం ....
కొత్త ప్రభుత్వం ఏర్పడే ముందు జూన్ ఆరవ తేదీ జవహర్ రెడ్డి శెలవు మీద వెళ్లాడు. జూన్ పన్నెండున కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చేదాకా కూడా పదవిలో ఉండలేని పరిస్థితి ఆయన తెచ్చుకున్నారు.
( కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి. ఇందులో వ్యక్తం చేసిన వన్నీ ఆయన వ్యక్తి గత అభిప్రాయాలు)