ఏపీలో ఎన్ని పెన్షన్లు (Pensions) తీసేస్తారు?
ఏపీలో త్వరలో సామాజిక పెన్షన్ లు కొన్ని తొలగించేందుకు నిర్ణయించారు. సర్వే రిపోర్టు ప్రకారం సుమారు 3 లక్షల వరకు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది అనర్హులు పెన్షనర్ లుగా ఉన్నారని ప్రభుత్వం లెక్క తేల్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఉపయోగించి ఇటీవల సర్వే నిర్వహించిన ప్రభుత్వం అనర్హులు ఉన్నారని నిర్థారించింది. మరోసారి సర్వే చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే మూడు లక్షల మంది పెన్షన్ లు తొలగించారనే చెడ్డ పేరు మూట కట్టుకోవడం కంటే వాటిని కొనసాగించడమే మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దివ్యాంగుల విషయంలో ఈ విధమైన బోగస్ పెన్షన్ లు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు సమాచారం.
కొత్త పెన్షన్ల మంజూరు పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం అసెంబ్లీలో ఒక స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అంటే మరో వారం లోపు కొత్త నిబంధనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డిసెంబరు 1 నుంచి కొత్త వారు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నందున నిబంధనలు కూడా త్వరలోనే ఇవ్వాల్సి ఉంది. మంత్రి నిబంధనలు ఇస్తామని ప్రకటించడంతో ఎటువంటి నిబంధనలు ఉంటాయనే అంశపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పెన్షన్ దారులకు సంబంధించిన విధి విధానాలు ఉన్నాయి. 50 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించినందుకు ఆ విధమైన నిబంధనలు కొత్త పెన్షన్ విధానంలో చేర్చే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
2025 జనవరి నెలలో జరిగే జన్మభూమి2 లో ఈ దరఖాస్తు పరిశీలించి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు. ఇకపై పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకోని వారికి మూడో నెలలో మొత్తం కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల వృద్ధులకు కాస్త ఊతం ఇచ్చిన వారు అవుతారని పలువురు చెబుతున్నారు.