డ్రై ఈస్ట్‌ను కోకైన్ పౌడర్‌గా ఎలా మారుస్తారంటే...

సినిమాలు చూసి స్మగ్లింగ్ చేస్తారో… స్మగ్లర్లను చూసి సినిమాలు తీస్తారో తెలియదు గానీ... విశాఖ పోర్ట్‌లో దొరికిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం సినిమాను తలపిస్తోంది.

Update: 2024-03-23 12:56 GMT
Source: Twitter

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిమెంట్‌లో కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్ పౌడర్ మిక్స్ చేశారు. ఆ పౌడర్‌తో వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా వీటిని దేశాలు దాటించాలనుకున్నారు. నార్కోటిక్ అధికారులకు వచ్చిన కీలక సమాచారం ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. తొలుత వారికి ఎటువంటి అనుమానం రాకపోయినా... పక్కనే ఉన్న కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ ఫార్ములాను బ్రేక్ అవుట్ చేసి కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టిస్తారు. ఇదేదో ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉంది కదా... సూర్య హీరోగా నటించిన వీడొక్కడే సినిమాలోని సన్నివేశం... అచ్చం దానిని పోలిన సన్నివేశం విశాఖ పోర్టులో చోటు చేసుకుంది. న్యూట్రిషన్ పౌడర్‌లో మిక్స్ చేసిన డ్రగ్ పౌడర్ పెద్ద ఎత్తున బయటపడింది.

రొయ్యల మేతను ఎందుకు సీజ్ చేశారు...

విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్ కంటైనర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. విశాఖ పోర్టుకు చేరిన డ్రగ్స్ కంటైనర్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అందులో 25 వేల కేజీల డ్రై-ఈస్ట్ పౌడర్ ఉంది. ఈ పౌడర్‌ను పశువులు, కోళ్లు, రొయ్యలు, చేపల మేతగా వాడుతుంటారు. అయితే సీబీఐ అధికారులు ఈ పౌడర్‌ను ఎందుకు సీజ్ చేశారు. ఈ న్యూట్రిషన్ పౌడర్లో కొకైన్ డ్రగ్ పౌడర్ మిక్స్ అయి ఉందని ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో సీబీఐ అధికారుల బృందం ఆపరేషన్ గరుడ నిర్వహించి డ్రగ్ మిక్స్‌డ్ డ్రై-ఈస్ట్‌ను స్వాధీనపరచుకుంది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ కంటైనర్‌లోని సరుకు కాకినాడకు చెందిన సంధ్య ఆక్వా కంపెనీ పేరు మీద బుక్ అయ్యి ఉండడంతో ఆ కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అంతా కెమికల్ ఫార్ములాయే....

అంతర్జాతీయ డ్రగ్ మాఫియాలు... మాదకద్రవ్యాల రవాణాలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎవరూ పసికట్టని రీతిలో డ్రగ్స్‌ను పకడ్బందీగా రవాణా చేస్తున్నాయి. ఇంటర్‌పోల్ సమాచారంతో ఈ గుట్టురట్టయింది. కెమికల్ ఫార్ములా ఉపయోగించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పెద్ద మొత్తంలో విశాఖ నగరానికి చేరుకున్న డ్రై-ఈస్ట్ పౌడర్ కూడా ఓ ఫార్ములా ప్రకారం తయారైనదే... 'డ్రై-ఈస్ట్ అనేది ఓ ఫంగస్. దీనిలోని నీటి శాతాన్ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ (70°c)వద్ద వేడి చేసి తొలగిస్తారు. దీంతో ఈ ఫంగస్ గుళికల మాదిరిగా ఏర్పడుతుంది. దీనిని పౌడర్‌గా మార్చి వైన్, రొట్టెల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. డ్రై-ఈస్ట్ హై న్యూట్రిషన్ ఫుడ్ కావడంతో చేపలు, రొయ్యలకు మేతగా ఉపయోగిస్తారు. చూడ్డానికి తెల్లగా ఉండే ఈ పౌడర్‌లో ఎలాంటి డ్రగ్ పౌడర్ కలిపినా అనుమానం రాదు' అని ఆంధ్ర యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సిద్దయ్య.. ‘ది ఫెడరల్ న్యూస్’ ప్రతినిధికి తెలిపారు. దీనిని తిరిగి వేరు చేయాలంటే కెమికల్ ఫార్ములా ఉపయోగించాల్సి ఉందని ఆయన అన్నారు. 'గోరువెచ్చని నీటిలో సోడియం హైడ్రాక్సైడ్ వేసి ఈ పౌడర్‌ను అందులో మిక్స్ చేయాలి. దీంతో డ్రై-ఈస్ట్ పౌడర్‌గా అడుక్కుచేరగా... డ్రగ్ పౌడర్ గడ్డలుగా పైకి తేలుతుంది. బహుశా ఈ ఫార్మాట్‌నే స్మగ్లర్లు ఉపయోగించి ఉండవచ్చు' అని ప్రొఫెసర్ సిద్దయ్య అనుమానం వ్యక్తం చేశారు.

తేలనున్న డ్రగ్ బండారం...

బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన కంటైనర్‌లోని పౌడర్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందానికి ఇప్పటివరకు కీలకమైన ఆధారాలు లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. సంధ్య ఆక్వా కంపెనీతో పాటు అనుబంధ సంస్థల కార్యాలయాల్లో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ డ్రగ్ వ్యవహారంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుంది. డ్రై-ఈస్ట్ పౌడర్‌లో కొకైన్ పౌడర్ మిక్స్ అయిందా.. లేదా.. అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ మిక్స్ అయి ఉంటే కెమికల్ ఫార్ములా ద్వారా దానిని వేరుచేసి విలువ కడతారు. ఏది ఏమైనా కేసులో సీబీఐ అధికారులు మరింత పురోగతి సాధించాలి అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తొందరగా రావాల్సి ఉంది.



Tags:    

Similar News