ఆంధ్ర కోస్తా తీరాల్లో హంప్ బ్యాక్ డాల్ఫిన్స్
డాల్ఫిన్స్ మనుషులతో ఎంతో స్నేహ పూర్వకంగా ఉండటం చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో డాల్ఫిన్స్ ఎక్కువగా ఉన్నాయి.;
ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు (ఇండియన్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు) సాధారణంగా తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ డాల్ఫిన్లు తీరం సమీపంలోని తక్కువ లోతు గల నీటిలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద డాల్ఫిన్స్ ఇటీవల కనిపిస్తున్నాయి. విశాఖపట్నం, బాపట్లలోని సూర్యలంక, కాకినాడ బీచ్ లో ఈ డాల్ఫిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. విజయవాడ నేచర్ క్లబ్ డాక్టర్ కిశోర్ హంసల దీవి వద్ద రెండు డాల్ఫిన్స్ తిరుగుతుండగా తన కెమెతో క్లిక్ మనిపించారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో..
ఇవి ఎక్కువగా ఉదయం సూర్యోదయం తర్వాత, సాయంత్రం సూర్యాస్తమయం ముందు సమయంలో చురుకుగా తిరుగుతూ ఉంటాయి. ఈ సమయాల్లో సముద్రపు నీరు వాటికి అనుకూలమైన టెంపరేచర్ (temperature) తో ఉంటుంది. ఆహారం లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట నీటి ప్రవాహం (High tide) సమయంలో చిన్న చేపలు, ఇతర ఆహారం తీర ప్రాంతానికి చేరుతుంది. అందువల్ల డాల్ఫిన్లు ఆ ప్రాంతాలలో కనిపిస్తాయి.
ఇది పిల్లలను కనే సమయం
తీరప్రాంత ప్రవాహ మార్పు సమయంలో (Tidal transitions) వీటి కదలికలు అధికంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతాలలో డాల్ఫిన్ల చురుకైన కదలికలు కనిపిస్తాయి. ఈ కాలం ఇవి పిల్లలను కంటాయి. (breeding season) పిల్లలను కన్న తరువాత కొద్ది రోజులు ఆప్రాంతంలోనే ఎక్కువ రోజులు ఉంటాయి. ఒక్క డాల్ఫిన్ ఒక్క పిల్లను మాత్రమే కంటుంది. అప్పుడప్పుడూ కమల పిల్లలను కూడా కంటుంది. గర్భం దాల్చి ప్రసవించటానికి పది నెలల కాలం పడుతుంది. డాల్ఫిన్స్ రకాలను బట్టి ఇంకా ఎక్కవ సమయం కూడా పడుతుంది.
ముఖ్యమైన ప్రాంతాలు
ఆంధ్ర కోస్తా తీరంలో ఎక్కువగా హంప్ బ్యాక్ డాల్ఫిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి సముద్ర తీరానికి దగ్గరగా ఉండే మాంగ్రోవ్ అడవుల్లో డాల్ఫిన్లు సులభంగా కనిపిస్తాయి. కాకినాడ తీరప్రాంత సమీపంలోని తేలికపాటి నీటిలో వీటి సంచారం ఉంటుంది. విశాఖపట్నం తీర ప్రాంతంలో ప్రత్యేకించి సముద్రపు క్రూజ్ సమయంలో వీటిని చూడవచ్చు.
మాంగ్రోవ్ అడవులు
ఇవి తీర ప్రాంతాలలో ఉండే ప్రత్యేకమైన ఎకోసిస్టమ్‌లుగా చెప్పవచ్చు. ఇవి ముఖ్యంగా ఉప్పు నీరు, తీపి నీటి కలయిక ఉండే ప్రాంతాల్లో (నదుల నీరు సముద్రాల్లో కలిసే ప్రాంతాలు) ముళ్ల పొదలు ఉంటాయి. ఈ పొదలు ప్రత్యేకమైన మొక్కల సమూహంతో ఏర్పడతాయి. మాంగ్రోవ్ చెట్లు అధిక ఉప్పును తట్టుకుని నీటిలో తేమ ఎక్కువగా ఉండే మట్టిలో పెరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ అడవుల్లో డాల్ఫిన్స్ ఉండేందుకు, పిల్లలను పెంచేందుకు ఇష్టపడతాయి. ఇక్కడ ఏర్పడే ఈ చెట్లు మంచి ఆరోగ్యాన్ని సముద్రంలోని జీవరాసులకు ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనుషులతో సంబంధం
హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు మనుషులను ఎక్కువగా దగ్గరకు రానివ్వవు, కానీ కొన్నిసార్లు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాయి. తీరప్రాంతాలలో మత్స్యకారులు ఎక్కువగా చేపలు పట్టేందుకు బోట్లు ఉపయోగించడం ప్రమాదాలకు అప్పుడప్పుడు గురవుతున్నాయి. సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు వీటికి హాని కలిగిస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం
హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు నీటిలో పైకి కిందికి అద్భుతంగా కదులుతూ, శరీరాన్ని పైకి ఎత్తి గాలిలో రింగులు చేయడం వంటి వినోదభరిత ప్రదర్శనలు చేస్తాయి. డాల్ఫిన్లు అధికంగా సామాజిక ప్రాణులు. గుంపులుగా జీవిస్తాయి.
శాస్త్రీయ వివరాలు
హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు సౌసా జీనస్ (Sousa genus) లోకి వస్తాయి. వీటిని నాలుగు ప్రధాన జాతులుగా గుర్తించారు. ఇండో-పసిఫిక్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్ (Sousa chinensis), ఇండియన్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్ (Sousa plumbea), అట్లాంటిక్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్ (Sousa teuszii), ఆస్ట్రలియాన్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్ (Sousa sahulensis)
హంప్ ఆకారం
వీటి పేరుకు కారణమైనది వీటి వెనుక భాగంలో (dorsal fin కింద) ఉండే హంప్. అందువల్ల వీటికి ఈ పేరు వచ్చింది. చిన్న వయస్సులో ఇవి బూడిద రంగులో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ తెల్లటి మచ్చలు రావడం లేదా కొంచెం తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది. సుమారు 2.5 మీటర్ల (8-9 అడుగుల) పొడవు ఉంటాయి. 250 కిలోల వరకు బరువు ఉంటుంది. వీటి ప్రధాన ఆహారం చేపలు, చిన్న క్రస్టేసియన్స్ (shrimps, crabs) వంటివి తింటాయి. పొడవాటి తీరప్రాంత సముద్ర జీవులను తింటాయి.
బాటిల్‌నోస్ డాల్ఫిన్లు
అత్యంత ప్రసిద్ధమైన జాతి. సాధారణంగా మానవులతో ఆడుకుంటాయి. శిక్షణ పొందే సామర్థ్యం కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. డాల్ఫిన్లు శబ్ద సంకేతాలు, శరీర భాష ద్వారా మనుషులతో సంప్రదింపులు జరుపుతాయి. ప్రమాదం నుంచి మనుషులను రక్షించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతంలో లేవు.
తీరం దగ్గరకు వచ్చేవి హంప్ బ్యాక్ డాల్ఫిన్స్
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో తీరం దగ్గరకు వచ్చి కనిపించే హంప్ బ్యాక్ డాల్ఫిన్ లు మాత్రమే. మిగిలినవి ఉన్నా లోతైన ప్రాంతంలో ఉంటాయి. వీటి గురించి అధ్యయనం చేసే వారు, పట్టించుకునే వారు లేరు. మాకు అవి రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాయని ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ లీడర్ ప్రణవ్ తెలిపారు. వీరు విశాఖపట్నంలో ఉంటారు. సీతాకాలంలో స్పిన్నర్ డాల్ఫిన్ లు విశాఖ తీరంలో కనిపిస్తాయన్నారు. తిమింగలాలు దెబ్బలు తగిలి, చనిపోయి నప్పుడు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొస్తాయని, అప్పుడు వాటి వివరాలు సేకరించి అటవీ శాఖకు తెలియజేస్తామన్నారు.