హైదరాబాద్ విమాన ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
రేణిగుంట గగనతలంలో 45 నిమిషాల పాటు తీవ్ర ఉత్కంఠ!;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-21 07:00 GMT
సాంకేతిక లోపాల కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో విమాన ప్రయాణికులు ఆందోళన గురవుతున్నారు.
తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం వద్ద సోమవారం అదే అనుభవం ప్రయాణికులకు ఎదురైంది. విమాన ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. దాదాపు 40 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన విమానం తిరిగి రేణిగుంట విమానాశ్రయంలోనే ల్యాండ్ అయింది. గాలిలో విమానం చెక్కలు కొట్టే సమయంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్లు సురక్షితంగా తిరిగి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానం సోమవారం ఉదయం బయలుదేరింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికి విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రేణిగుంట ఎయిర్పోర్ట్ గగనతలంలోని సుమారు 45 నిమిషాల పాటు చక్కర్లు కొట్టించిన పైలెట్లు విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత హైదరాబాద్ తిరిగి బయలుదేరిన ప్రయాణికుల తో పాటు ఇంకొందరు ప్రముఖులు కూడా ఉన్నట్టు సమాచారం. రేణిగుంట విమానాశ్రయం గగనతలంపైనే విమానం చెక్కర్లు కొడుతుండడం గ్రహించిన ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు.
విమానాశ్రయం చేకప్ తీసుకున్న కొద్దిసేపటికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఏసీలు పనిచేయడం లేదని పైలెట్లు గుర్తించారు. దీంతో మళ్లీ ల్యాండింగ్ చేయడానికి వీలుగా ఇంధనం ఖర్చు చేయడానికి గాలిలోనే విమానాన్ని చక్కర్లు కొట్టించినట్లు చెబుతుంటే, ల్యాండింగ్ కు అనుమతి కోసం కొన్ని నిమిషాల పాటు గగనతలంలోనే విహరించిందనే వ్యాఖ్యాలు కూడా వినిపిస్తున్నాయి. 45 నిమిషాల పాటు గాలిన తిరుగిన విమానాన్ని తిరిగి రేణిగుంట విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక
రేణిగుంట విమానాశ్రయంలోనే తిరిగి ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని సమాచారం. దీంతో ఎయిర్పోర్టులోని ఇండిగో విమానయాన సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఫ్లైట్ చార్జీలు తిరిగి చెల్లించకపోవడం, ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయని స్థితిలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రయాణికులకు నచ్చ చెప్పలేక ఇండిగో విమానయాన సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు.
రేణిగుంట విమానాశ్రయంలో ఈ తరహా సంఘటన జరగడం ఇది మొదటిది కాదు. చివరిది కాదు. గతంలో కూడా ఇదే తరహా అనుభవాలు ప్రయాణికులకు ఎదురయ్యాయి. విమానయాన సంస్థలు ప్రయాణికులకు చార్జీలు తిరిగి చెల్లించే అవకాశం ఇక్కడ లేకపోవడం, ప్రత్యామ్నాయ విమాన సర్వీసును నడపడానికి కుదరని స్థితిలో ఇబ్బందులు తప్పడం లేదు.