తురకపాలెం మృత్యుఘోష: హుటాహుటిన హైదరాబాద్ శాస్త్రవేత్తల రాక

మట్టినమూనాలు సేకరణ, హైదరాబాద్ లో పరీక్షలు;

Update: 2025-09-08 12:39 GMT
గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామానికి హైదరాబాద్ శాస్త్రవేత్తలు చేరుకున్నారు. గ్రామంలో ఓ వ్యక్తికి ‘మెలియాయిడోసిస్‌’ పాజిటివ్‌గా తేలడంతో పరీక్షలు మొదలుపెట్టారు. శాస్త్రవేత్తల బృందం ఆ గ్రామం అంతటినీ పరిశీలించింది. హైదరాబాద్‌ శ్రీబయోటెక్‌ నుంచి ముగ్గురు శాస్త్రవేత్తలు వచ్చారు. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించారు. వాటిని హైదరాబాద్‌ తీసుకెళ్లి పరీక్షలు చేయనున్నారు. పరీక్షల అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు తురకపాలెంలో నమూనాలు సేకరిస్తున్నట్లు ఐసీఏఆర్ శాస్త్రవేత్త రంజిత్ కుమార్ తెలిపారు. ‘గ్రామంలో నీరు, మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లో అధునాతన సాంకేతిక పద్ధతుల్లో ప్రయోగశాలలో ఈ పరీక్షలు చేస్తాం. మట్టిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ ఇతర సూక్ష్మజీవులను గుర్తించేందుకు 48 నుంచి 72 గంటల సమయం పడుతుంది. పూర్తిస్థాయి జన్యుపరమైన పరీక్షల కోసం 25 రోజులు సమయం వేచి ఉండాలి. పరీక్షల అనంతరం నివేదికను అధికారులకు అందిస్తాం’’ అని ఆయన తెలిపారు.
గుంటూరు జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న తురకపాలానికి చెందిన ఆరుగురిలో ఒకరికి ‘మెలియాయిడోసిస్‌’ పాజిటివ్‌గా తేలింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని సేకరించి పరీక్షకు పంపించగా ఈ వ్యాధి నిర్ధారణ అయిందని గుంటూరు కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
మరో పరీక్ష కోసం ఎడమ మోకాలికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేసినట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇదివరకే పాజిటివ్‌గా తేలిన మరొక రోగి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. తురకపాలెంలో 72 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా నలుగురిలో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు గుర్తించామని అధికారులు ప్రకటించారు.
తురకపాలెం గ్రామంలో 8 నెలల కాలంలో సుమారు 40 మంది మరణించారు. వీరు ఎందుకు మరణిస్తున్నారో అర్థం కాక జనం బెంబేలెత్తిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైద్యాధికారులు నిరంతరం నిఘా పెట్టారు. ఊళ్లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం ఆ గ్రామానికి వచ్చింది.
Tags:    

Similar News