విధ్వంసం పునాదుల నుంచే అమరావతిని వికసింపజేస్తానన్న చంద్రబాబు
వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి.. రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందన్నారు చంద్రబాబు నాయుడు;
By : The Federal
Update: 2025-04-28 00:45 GMT
అమరావతిని విధ్వంసం చేసిందెవరో వికసింపజేస్తున్నదెవరో ప్రజలు ఆలోచించాలంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి.. రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు.. రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు.
‘ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసింది. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి.. ఒక అద్భుత రాజధానిని నిర్మించి, విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నాం’ అని ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ‘గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసింది. అయితే అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది. గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను.. కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించి.. నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పారు.
నాది అని గర్వపడేలా చేస్తా..
"ఆంధ్రప్రదేశ్ నాది, అమరావతి నా రాజధాని ప్రజలు గర్వపడేలా చేస్తా.. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తితో ఉన్నారు.. పలు సూచనలూ చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్.. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుంది. ప్రజారాజధాని అనే ఆంధ్రుల స్వప్నాన్ని కుట్రలు, కుతంత్రాలతో ఎవరూ దెబ్బతీయలేరని చెప్పేందుకే.. మళ్లీ దేశం అంతా గుర్తించేలా అమరావతి పనులను ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభింపజేస్తున్నాం" అని అన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు...
ప్రధానమంత్రి వచ్చే సభ సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలి అని చంద్రబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ‘ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలి. భద్రతాపరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకోవాలి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది. వారంతా సభకు రావాలని భావిస్తారు. రవాణా సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు వారికి సూచనలు, ప్రకటనలు చేయాలి. వారికి ఇబ్బంది కలగకుండా చూడాలి’ అని సూచించారు.
మే 2వ తేదీ సాయంత్రం వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ బహిరంగ సభ జరుగుతుంది. సుమారు లక్ష కోట్ల రూపాయల పనులకు ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు, పునఃప్రారంభ కార్యక్రమాలు చేపడతారు.