మత సామరస్యాన్ని కాపాడుతా..ముస్లిం మైనారిటీలను పైకి తెస్తా
గత 40 సంవత్సరాలుగా తాను కూడా రంజాన్ మాసంలో భాగస్వామ్యం అవుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2025-03-27 15:55 GMT
ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యాన్ని కాపాడుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక వైపు మత సామరస్యాన్ని కాపాడుతూనే మరో వైపు ముస్లిం మైనారిటీలను అన్ని విధాల పైకి తెస్తానని సీఎం స్పష్టం చేశారు. రంజాన్ మాసం సందర్భంగా గురువారం సాయంత్రం విజయవాడలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందన్నారు. పేదలతో తాను ఉండాలనేదే తన జీవితాశయమని, నూటికి నూరు శాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని, దీని కోసం ప్రత్యేకంగా పీ4ను మార్చి నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పవిత్ర ఖురాన్‌ను చదవడం, ఇతరులకు సహాయం చేయడం చేస్తుంటారని అన్నారు. ధనవంతులు పేదలకు సాయం చేయడం వంటి మంచి పనులను పవిత్ర ఖురాన్ నేర్పించిన మంచి గుణమన్నారు. పేదరికంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా డెవలప్ చేస్తానని, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక దృషి సారిస్తానని ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. ముస్లింలకు సంబంధించిన ఉర్దూ భాషను రెండో లాంగ్వేజీగా గుర్తించడంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతూనే వచ్చామన్నారు. గత 40 సంవత్సరాలుగా తాను కూడా రంజాన్ మాసంలో భాగస్వామ్యం అవుతున్నానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా తమ హయాంలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌తో పాటు కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. దీంతో పాటుగా అదే హైదరాబాద్, కర్నూలులో హజ్ హౌస్‌లను నిర్మించి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రంజాస్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందించామన్నారు. ఇమామ్‌లు, మౌజమ్‌లను ఆదుకుంది కూడా తమ ప్రభుత్వమే అని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో గతంలో కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,300 కోట్లు అదనంగా మైనారిటీల వర్గాలకు కేటాయించినట్లు వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమ శిక్షణ, దాతృత్వంతో పాటు ధార్మిక చింతన కూడికే రంజాన్ మాసమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.