ప్రభుత్వంలోనే పని చేశా, వైసీపీలో కాదంటున్న మాజీ ఐఏఎస్

మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్.. వైసీపీకి పనిచేస్తున్నారా..? అన్న ప్రశ్నకు 'నేను పని చేసింది వైసీపీ ప్రభుత్వంలో.. పార్టీలో కాదు..' అని ఆరోపణలకు చెక్ పెట్టారు.

Update: 2024-03-15 09:35 GMT
విజయ్ కుమార్

(తంగేటి నానాజీ, విశాఖపట్నం)

మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ వైసీపీ వ్యక్తే... వైసీపీ కోసమే పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ కోసమే బడుగు బలహీన వర్గాలను సమీకరిస్తున్నారు... అన్న ఆరోపణలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘ఐఏఎస్ అధికారిగా నేను పని చేసింది వైసీపీ ప్రభుత్వంలో.... వైసీపీ పార్టీలో కాదు... నేను సొంత పార్టీ పెట్టి అదే విషయాన్ని వైసీపీ పెద్దలకు, ప్రజలకు క్లారిటీ ఇచ్చాను’’ అన్నారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. విశాఖ వచ్చిన ఆయన ‘ది ఫెడరల్ ప్రతినిధి’తో కాసేపు ముచ్చటించారు.
బడుగు బలహీన వర్గాల ఐక్యతే లక్ష్యం...
లిబరేషన్ కాంగ్రెస్ స్థాపించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఐక్యం చేసేందుకేనని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల వాయిస్‌గా ఏర్పాటు చేసిన జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి శివ భాగ్య రావు ఆల్ తెలుగు ప్రజా పార్టీ, దాసరి చెన్నకేశవులు ప్రభుద భారత రిపబ్లికన్ పార్టీ, రాము యాదవ్ సమసమాజ పార్టీ, వీసీకే పార్టీలు ఐక్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే మరికొన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకుంటామని విజయకుమార్ స్పష్టం చేశారు.
ఉనికి కోసం...
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయి. కనీసం పార్టీకి ఒక్క సీటు చొప్పున 6 పార్టీల అధ్యక్షులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీల ఆత్మీయ సమ్మేళనం విశాఖలో జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, పార్టీల సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాల కోసం కూలంకషంగా చర్చించారు.
వేటగాడు వలవేస్తే...
విశాఖలో జరిగిన యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్‌ను ‘ది ఫెడరల్ ప్రతినిధి’ కలవగా.. ఆయన ఓ పిట్ట కథ చెప్పారు. ‘ఓ అడవిలో బోలెడు పక్షులు ఉన్నాయి... రోజు వేటగాడు వలవేసి పక్షులను పట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఒకరోజు పక్షులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఎలాగైనా వేటగాడికి బుద్ధి చెప్పాలనుకున్నాయి. ఐక్యమత్యంలో ఉన్న బలాన్ని అర్థం చేసుకున్నాయి. అంతే వేటగాడు వల వేయగానే అన్ని పక్షులు కూడబలుక్కొని వలతో సహా ఎత్తుకుపోయాయి. ఇందులో నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుతం మేము పక్షులను ఐక్యం చేసే పనిలో ఉన్నాం. త్వరలోనే వేటగాడికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది‌‌’’ అన్నారాయన. దేశంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి తద్వారా రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటామని విజయ్ కుమార్ చెప్పారు.
Tags:    

Similar News