బిజెపి మూడోసారి వస్తే ఇక ఎన్నికలుండవు

మోదీ ప్రభుత్వంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఆర్థిక విధ్వంసం జరిగింది. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌;

Update: 2024-04-01 12:24 GMT

కేంద్రంలో మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బిజెపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అవసరమైన అన్ని అస్త్రాలను సంధిస్తోంది. ఒక వేళ బిజెపీ మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలు అవుతాయి. ఇక ఎన్నికలంటూ ఉండవు. ప్రజాస్వామ్య భారత దేశంలో 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు కాకుండా ఉండాలంటే బిజెపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలని ప్రముఖ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కేంద్రంలో మరో సారి బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి వెనుకాడరని, డైరెక్టుగా పార్లమెంట్‌లోనే ప్రకటనలు చేస్తారని చెప్పారు. ఇటీవల విజయవాడలో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ‘సంక్షోభంలో నవభారతం, ఆర్థిక రాజకీయ పరిణామాలు’ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ బిజెపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను తూర్పార పట్టారు. బిజెపీ కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వస్తే ఇటీవల మణిపూర్‌లో బిజెపి నిర్వాకం వల్ల చోటు చేసుకున్న దుర్ఘటనలు ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామంలోకి చొరబడుతాయన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బిజెపీది నూలుపోగంత పాత్ర కూడా లేదన్నారు. అయినా నేడు మేమే దేశ భక్తులమని విర్రవీగుతూ మార్కెటింగ్‌ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బిజెపీ ఇలా నూతన పోకడలకు పోవడం నవభారతంలో నూతన లక్షణమని అభివర్ణించారు. బిజెపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల దేశంలో నిరుద్యోగం భారీ పెరిగిపోయిందన్నారు. ఇటీవల 35వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే దాదాపు 1.24 కోట్ల మంది నిరుద్యోగుల నుంచి దరాఖాస్తులు వచ్చాయన్నారు. భారత దేశంలో సంక్షోభం అనేది ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేశారు. ఆకలి కేకలు భరించ లేకనే ప్రాణ హాని ఉన్న దేశాలకు కూడా వసలు వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ప్రాణ హాని ఉందని తెలిసినా ఇజ్రాయేల్, ఉక్రెయిన్‌ వంటి దేశాలకు పొట్ట చేతపట్టుకొని వెళ్తున్నారనంటే సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. నిరుద్యోగంపైన, సంక్షోభంపైన మోదీ మోసపూరిత లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఎవరిని మోసం చేయడానికి ఈ లెక్కలు చెబుతున్నారని ప్రశ్నించారు. దేశంలోని 20 నుంచి 25 ఏళ్ల యువతలో నిరుద్యోగం ఏకంగా 42 శాతానికి పెరిగి పోయిందంటే ఎవరు కారణమని నిలదీశారు. దుర్భరమైన పరిస్థితులు బిజెపి ప్రభుత్వం కల్పించిన నేటి భారత దేశంలో ఉద్యోగం పొందడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్న పనిగా మారిపోయిందని, ఇదే విషయాన్ని సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో నిర్థారించారని చెప్పారు. నిరుద్యోగం గురించి బిజెపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని, దాని గురించిన ఎలాంటి అధికారిక సమాచారం కూడా బయటకు వెల్లడించడం లేదని చెప్పారు. నిరుద్యోగంపై వాస్తవాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. రాజకీయ విమర్శలపై లెక్కలు చెప్పే మోదీ నిరుద్యోగంపైన, కరోనా సయమంలో ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనే లెక్కలు చెప్ప లేరని, ఎందుకంటే అవి వారికి ప్రాధాన్యం కావని, ఇంత కంటే అమానుషం మరొకటి ఉండదని చెప్పారు. ఆహార ద్రవ్యోల్భణం సగటున 20 శాతానికి చేరిందని ఇది అంత్యంత ప్రమాదకరమని చెప్పారు. దీని వల్ల కుటుంబాలు కూలి పోతున్నాయని, ఆదాయాలు కోల్పోయి బతకలేని దుస్థితిలోకి కూరుకొని పోతున్నాయని ఆవేధన చెందారు. ఇదే సమయంలో మోదీ కార్పొరేట్‌లను సంస్కరించే పనిలో పడ్డారన్నారు. వారికి మేలు చేకూర్చే అంశాలకు ప్రాధాన్యత తీసుకున్నారని చెప్పారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ ఏకంగా 19 శాతం తగ్గించడం, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 25లక్షల కోట్ల మాఫీ చేశారని చెప్పారు. పెట్టుబడులు, ఎఫ్‌డిఐలు కూడా బాగా తగ్గిపోయాయన్నారు. మోదీ నిర్వాకం వల్ల 30 శాతం నుంచి 19 శాతానికి పెట్టుబడులు పడిపోయాయన్నారు. మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్‌ బాండ్లకు తెర తీసిందని, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదొక పెద్ద కుంభకోణమని చెప్పారు. దేశంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను దుర్మార్గంగా హరించి వేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలపై బిజెపీ విరుచుకు పడుతోందని విమర్శించారు. అడ్డుగోలుగా దాడులు జరిపించడం, తద్వారా బడా కాంట్రాక్టులు ఇచ్చిన వారి నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బిజెపీ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుందని ఆరోపించారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణాన్ని మోదీ గేట్‌ అనొచ్చని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఎలక్టోరల్‌ బాండ్ల మహిమ వల్లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నారని, సాక్షులు మాత్రం ఆరాంగా బయట తిరుగుతున్నారని చెప్పారు. ఇంత విధ్వంసానికి పాల్పడుతున్న మోదీ, బిజెపీలపై ప్రజల్లో చైతన్యం తీసుకొని రావలసిన ఆవశ్యకత ఉందని, ఆ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్‌రావు, ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్, బెజవాడ బార్‌ ఆసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు సంపర దుర్గాశ్రీనివాసరావు, ఏఐసిపి నాయకులు నరహరశెట్టి నరసింహారావు, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరు మాధవరావు తదితరులు ప్రసంగించారు.

Tags:    

Similar News