టిటిడి వివాహ వేదికలో పెళ్లి చేయిస్తే ఆరుగురికి దైవ దర్శనం

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాంటే..;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-18 08:16 GMT

తిరుమలలో టీటీడీ హిందువుల ఉచిత వివాహాలకు కూడా వేదిక కల్పించింది. నవదంపతులు, వారి తల్లిదండ్రులతో కలిపి ఆరుగురికి ప్రత్యేక దర్శనం కూడా కల్పిస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచింది.

తిరుమలలో ఉచిత కల్యాణ వేదిక ఏర్పాటు చేసిన 8 సంవత్సరాలలో 27 వేల మందికి వివాహాలు జరిపించారు.
తిరుమలలో పెళ్లిళ్లు చేయాలి అని భావించే తల్లిదండ్రులకు ఇక్కడ అందుబాటులో ఉన్న నిబంధనలు ఏమిటి అనేది చాలామందికి తెలియదు.
తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి ఏం చేయాలి? సింపుల్ గా వివాహ రిజిస్ట్రేషన్ ఎలా జరిపించాలి. వారికి టీటీడీ ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచిందనే విషయాలు తెలుసుకుందాం.
నిత్య కళ్యాణం..
ఇక్కడ ఉభయదేవేరులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. అందువల్ల తిరుమల శ్రీవారి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మారింది.
ముహూర్తాలతో సంబంధం లేకుండా ఇక్కడ పేదలే కాదు. అన్ని వర్గాల హిందువులు వివాహాలు జరిపించడానికి ఇష్టపడతారు. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలలో చాలామంది సత్యనారాయణ వ్రతం ఇళ్లవద్దే పూర్తి చేసుకుంటారు. నవ దంపతులను వారి తల్లిదండ్రులు తిరుమలకు తీసుకువచ్చి వివాహాలు జరిపించడానికి ఆసక్తి చూపిస్తారు. వారికోసం టీటీడీ ఏమి ఏర్పాటు చేసింది? ఎలాంటి వసతులు కల్పిస్తుందంటే..
ఉచిత కల్యాణ వేదిక

తిరుమలలో 2016 మే 9 వ తేదీ నుంచి పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉచిత వివాహాల కోసం కళ్యాణ వేదికను ఏర్పాటు చేసింది. ఈ ఉచిత వివాహ వేదిక తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సమీపంలో యువతి, యువకులకు ఖర్చు లేకుండా వివాహాలు జరిపించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి విశేష స్పందన లభిస్తుంది.

తిరుమలలో ఉన్న ఉచిత కళ్యాణ వేదిక వద్ద వివాహాలు జరిపించడానికి యువతి, యువకుల తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికోసం తమ సమీప ప్రాంతాల్లోని నెట్ సెంటర్, టీటీడీ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వివరాలకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ – 0877 – 2277744 సంప్రదించవచ్చు.

వివరాల నమోదు

తిరుమలలో తమ పిల్లలకు వివాహాలు జరిపించడానికి తల్లిదండ్రులు కొన్ని వివరాలు అందించాల్సి ఉంటుంది. కళ్యాణ వేదిక డాట్ కాం లో కాబోయే నవ దంపతుల వివరాలను నమోదు చేయాలి. తల్లిదండ్రుల వివరాలు కూడా అందులో ఇచ్చిన కాలంలో ఫిలప్ చేయాలి. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి.
వయసు ధ్రువీకరణ కోసం
యువతి యువకుల వయసు ధ్రువీకరణ కోసం బర్త్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంచాలి. లేదంటే 10వ తరగతి సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, లేదా పాన్ కార్డు, పాస్పోర్ట్ లో ఏదో ఒకటి టిటిడి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తికాగానే, అక్నాలజిమెంట్ లభిస్తుంది.
నిబంధనలు
కొత్తగా పెళ్లి చేసుకునే వారు కరెంట్ లేదా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి.. అది కూడా హిందువులకు మాత్రమే ఇక్కడ వివాహాలు జరిపిస్తారు. వధువుకు 18 సంవత్సరాలు, వరుడు కి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. రెండో పెళ్లి లేదా ప్రేమ వివాహాలకు ఇక్కడ అనుమతి ఉండదు.
కొత్తగా పెళ్లి చేసుకునే వారు టీటీడీ వెబ్సైట్ నుంచి లభించిన అక్నాలజిమెంట్ తీసుకొని ఉచిత వివాహ వేదిక వద్దకు నిర్ణీత సమయానికి 6 గంటల ముందు అక్కడి సిబ్బందికి అందించాలి. ఆ వివరాలు పరిశీలించిన సిబ్బంది తల్లిదండ్రుల సమక్షంలో వివాహాలు జరిపిస్తారు.
ఉచిత కల్యాణ వివాహ వేదిక వద్ద టీటీడీ పురోహితుడని, మంగళ వాయిద్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది.
కాబోయే నవ దంపతులు, వారి కుటుంబీకులకు వసతి గృహాన్ని కూడా కేటాయిస్తుంది.
ఉచిత కల్యాణ వేదిక వద్ద వివాహం జరిపించడానికి కాబోయే దంపతులకు పసుపు, కంకణాలు, కుంకుమ టిటిడి ఉచితంగా అందిస్తుంది. నవ దంపతులకు అవసరమైన దుస్తులు ఇతర సామాగ్రి వారి తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకోవాలి.
గ్రూప్ ఫోటో కానుక
ఉచిత కల్యాణ వేదిక వద్ద వివాహం పూర్తయిన తర్వాత నవ దంపతులకు వారి తల్లిదండ్రులతో కలిసి గ్రూప్ ఫోటో తీస్తారు. ఆ ఫోటో ఓ కానుకగా వారికి అందిస్తారు.
దంపతులైన ఇద్దరికీ వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఆరుగురికి 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ అందిస్తుంది. ఆ టికెట్ ద్వారా నవదంపతులు, వారి తల్లిదండ్రులు మొత్తం ఆరుగురిని ఏటీసీ ( ATC Circle ) సమీపంలోని క్యూ నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనం అనంతరం వారికి స్వామివారి చిన్న లడ్డూలు ఉచిత ప్రసాదంగా అందిస్తారు.

రిజిస్ట్రేషన్

ఉచిత కల్యాణ వేదిక వద్ద ఒక్కటే నవ దంపతులకు టిటిడి సర్టిఫికెట్ మంజూరు చేస్తుంది. వారి వివాహానికి మరింత చట్టబద్ధత కల్పించడానికి తిరుమల లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వం తిరుమల లోని ఎస్ఎంసి (SMC) వసతి గృహాల సముదాయం లోని 233వ గదిలో హిందూ వివాహ రిజిస్టర్ వారి కార్యాలయాన్ని అందుబాటులో ఉంచింది.
నూతన వధూవరులు తమ వయస్సు, నివాస దృపత్రం, వివాహ ఫోటో, కళ్యాణ మండపంలో ఇచ్చిన రసీదు, వివాహ శుభలేఖ అక్కడి రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించాలి. ముగ్గురికి తక్కువ కాకుండా సాక్షులు నవ దంపతుల వివాహాన్ని ధృవీకరిస్తూ సాక్షి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత
విశేష స్పందన
తిరుమలలో వివాహాలు జరిపించడానికి అన్ని వర్గాల హిందువులు ఆసక్తి చూపిస్తారు. శ్రీవారి క్షేత్రంలో యువతీ యువకులకు పెళ్లిళ్లు చేయించడం మొక్కుబడిగా కూడా భావిస్తారు. పేదలు, మధ్యతరగతి హిందువులు ఖర్చు లేకుండా వివాహం జరిపించడానికి టిటిడి ఈ వసతిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆర్థికంగా స్థితి వంతులు కూడా ఇక్కడ పెళ్లిళ్లు జరిపించడానికి ఎక్కువ ఇష్టపడతారు.
తిరుమలలో 2016 ఏప్రిల్ 25వ తేదీ పాప వినాశనానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఉచిత కళ్యాణ వేదికలో 2018 జూన్ మూడవ తేదీ నాటికి పదివేల జంటలు దంపతులయ్యారు.
2025 మే ఒకటో తేదీ వరకు సుమారు 26,250 మంది కి వివాహాలు చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
నవ దంపతుల కోసం టిటిడి కల్పించిన వసతులు, వెసులుబాటు కారణంగా ఉచిత కల్యాణ వేదికలో మంగళ వాయిద్యాలు నిత్యం మోగుతూనే ఉన్నాయి. ఇక్కడ వారికి గదితోపాటు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉచిత భోజనం అందుబాటులో ఉంది. నవ దంపతులకు శ్రీవారి దర్శనం అనంతరం వారి కుటుంబీకులకు స్వామివారి లడ్డూ ప్రసాదాలు కూడా అందిస్తున్నారు. దీంతో తిరుమల క్షేత్రంలో ఉచిత వివాహాలు జరిపించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Similar News