రాజీనామా చేసొస్తే చేర్చుకుంటాం– సీఎం చంద్రబాబు ఓపెన్‌ ఆఫర్‌

వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీలోకి తీసుకోవడంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Update: 2024-08-29 07:44 GMT

అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత ప్రతిపక్ష పార్టీలను నామ రూపాల్లేకుండా చేయడం, ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన నాయకులను తమ పార్టీలోకి తీసుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఫ్యాషన్‌గా మారి పోయింది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

‘ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా.. వు ఆర్‌ మెయింటెన్‌ సర్టన్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ వాల్యూస్‌. కాబటి వాళ్లు రాజీనామా చేసి వస్తే.. దానిని బట్టి.. మనుషులను బట్టి, వాళ్ల క్యారెక్టర్‌ను బట్టి, ఆలోచించి వు విల్‌ టేక్‌’ అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత, గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు, 45 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, దేశంలోనే అందరి కంటే సీనియర్‌ నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలికిన మాటలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక పార్టీకి అధినేతగా ఉండి దేశంలోనే సీనియర్‌ నేత అయిన సీఎం చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విలువలకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి పార్టీ ఫిరాయింపులపై దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన చంద్రబాబు, తానే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా ఉన్నాయనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాదు అమరవాతి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గతంలో కూడా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పలువురు నేతలను తన పార్టీలోకి తీసుకున్నారు. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకున్నారు. వారిలో ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, భూమ అఖిలప్రియకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు. దీనిపైన నాడు పెద్ద దుమారమే రేగింది. సొంత పార్టీకి చెందిన టీడీపీ శ్రేణుల్లో కూడా అంతర్గతంగా వ్యతిరేకత వచ్చింది. అయితే దానిని బయటకు చెప్పడానికి ఎవ్వరూ సాహించ లేదు. సుస్థిరమైన గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసి, అధికారంలో ఉండి, ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను తీసుకోవలసిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఎందుకనే విమర్శలు అటు స్వపక్షం నుంచి ఇటు విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయినా వాటిని పక్కన పెట్టిన చంద్రబాబు 23 మందిని టీడీపీలోకి తీసుకోవడంతో పాటు ముగ్గురికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. చంద్రబాబు నాయుడు మాదిరిగా సంతలో పశువులను కొన్నట్టు తాము చేయమని, ఎలా పడితే అలా తన పార్టీలోకి తీసుకోనని, ఆ పార్టీకి రాజీనామా చేసి వస్తే వైఎస్‌ఆర్‌సీపీలోకి తీసుకుంటామని వ్యాఖానించారు. దీనిని చంద్రబాబు నాయుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు ఉన్నారు. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి మాదిరిగా తాను కూడా అదే విధంగా వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే అటు జగన్‌ కానీ ఇటు చంద్రబాబు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగానే వ్యాఖ్యలు చేయడం.
పార్టీఫిరాంపులకు పాల్పడుతున్నారా లేదా అనే అంశం పక్కన పెడితే.. చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మాటలపై నిలబడుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఎలాంటి రాజీనామాల ప్రస్తావన లేకుండానే 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోవడం, ముగ్గురికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టిన ఉదంతం కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేయడం, రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులు కూడా తమ పార్టీకి రాజీనామాలు చేసిన తర్వాతనే టీడీపీలో చేరుతారనే టాక్‌ వినిపిస్తుండటంతో చంద్రబాబు మాటల్లో విశ్వసనీయత కనిపిస్తోందనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News