‘దానిపైనే నా రెండో సంతకం’.. స్పష్టం చేసిన చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం తప్ప సీఎం జగన్ చేసిందేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు.

Update: 2024-05-01 14:02 GMT

‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్‌సీపైన.. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్‌పైనే పెడతా’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్.. మాఫిరా రాజ్యంగా మారిందని సీఎం జగన్ టార్గెట్‌గా చంద్రబాబు మండిపడ్డారు. ఐదేళ్లలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని, సంక్షేమాల పేరిట రూ.10 ఇస్తే ధరలు, పన్నులు ఏవేవో కారణాలు చెప్పి రూ.100 గుంజుకున్నారు. మద్యనిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో వైసీపీ అధినేత సీఎం జగన్ టార్గెట్‌గా చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. రానున్న ఎన్నికల్లో ఈ దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

విధ్వంసం ఆయన స్వభావం

ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన చంద్రబాబు.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. విధ్వంసం ఆయన స్వభావమని, ఈ ఐదేళ్ల జగన్ పాలన చూస్తే ఆ విషయం తేటతెల్లం అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘విధ్వంసం ఆయన స్వభావం. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆంధ్రకు అంటే అప్పు వచ్చే పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. పనులు దొరక్క నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువు చెప్పే టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపలాకు నిలబెట్టిన ఏకైక సీఎం జగనే. స్కూళ్లకు రంగులు వేస్తే పిల్లలకు చదువు వస్తుందా? రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? ల్యాండ్ గ్రాంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు. ప్రజల భూమిలపై జగన్ పెత్తనం ఏంటి? మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై నా రెండో సంతకం చేస్తా’’అని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రన్న బీమా ఇస్తాం

వైసీపీ అధికారంలోకి వచ్చి నిలిపేసిన చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తాం. ‘‘సహజ మరణానికి రూ.5 లక్షలు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షల బీమా కుటుంబానికి అందిస్తాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తాం. డిజిటల్ హెల్త్ కార్డ్‌లు ఇస్తాం. బీపీ, షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు ఇస్తాం’’అని వివరించారు.

Tags:    

Similar News