DRONES | రాయలసీమ సిగలో మరో కీర్తికిరీటం ఓర్వకల్లు డ్రోన్ సిటీ
40వేల మందికి ఉపాధి, వందల కోట్ల పెట్టుబడి, 300 ఎకరాల విస్తీర్ణంతో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రానుంది.;
By : The Federal
Update: 2025-01-28 08:19 GMT
డ్రోన్ తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. దేశంలోని మొట్టమొదటి డ్రోన్ స్కూలు అహ్మదాబాద్ లో వస్తే తొట్టతొలి అతిపెద్ద డ్రోన్ సిటీ ఆంధ్రప్రదేశ్ కి రానుంది. డ్రోన్ సిటీని అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తన సాంకేతిక చిత్రపటాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడి, 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద ఈ సిటీ ఏర్పాటు కానుంది.
డ్రోన్ రంగంపై దృష్టి పెట్టిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త రాజధాని అమరావతిలో మూడు రోజుల పాటు డ్రోన్ ఎగ్జిబిషన్ ను నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సరిగ్గా ఆ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా మారుస్తామని చెప్పినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా 2025 జనవరి 23న ఏపీ ప్రభుత్వం జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. దినేష్ కుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలోని తొలి డ్రోన్ తయారీ సెంటర్ ఏపీలోని ఓర్వకల్లులో రాబోతోందని చెప్పడంతో చంద్రబాబు చెప్పిన మాట నిజం కాబోతోందన్న విషయం స్పష్టమైంది.
ఏమిటీ ప్రాజెక్టు, ఏమిటి లాభం?
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ల తయారీ కేంద్రానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయి. దీనికి కావాల్సిన 300 ఎకరాల భూ సేకరణ ఇప్పటికే పూర్తి అయింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశపు "డ్రోన్ రాజధానిగా" మార్చడానికి తోడ్పడుతోంది.
"ఈ డ్రోన్ సిటీలో డ్రోన్లను తయారీ చేస్తారు. డ్రోన్లపై పరిశోధన, అభివృద్ధి ఉంటుంది. పరీక్షలు జరుగుతాయి. మరమ్మతులు, అభివృద్ధి వంటి అన్ని రంగాలకు సమగ్ర ఎకోసిస్టమ్‌ను అందించనుంది" అన్నారు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కే దినేష్ కుమార్. ఈ ప్రాజెక్టు ద్వారా 40,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డ్రోన్ సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయిలోనే నెంబర్ వన్ గా ఎదగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద సాధారణ డ్రోన్ పరీక్షా సదుపాయాన్ని కూడా రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. దీంతో డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత బలపడనుంది.
డ్రోన్ కార్యకలాపాలను ఏ జిల్లాలోనైనా స్థాపించడానికి ఆసక్తి చూపే కంపెనీలకు ప్రోత్సాహక ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ డ్రోన్ సిటీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పురోగమింపజేయడంతో పాటు, భారతదేశాన్ని ప్రపంచ డ్రోన్ తయారీ రంగంలో కీలక స్థానంలో నిలపనుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు తీయించేందుకు ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీన్నో విప్లవాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు.
డ్రోన్ తయారీ రంగంలో దేశానికే నాయకత్వం వహించేలా ఏపీ చర్యలు చేపట్టిందని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ (APDC) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే దినేష్ కుమార్ తెలిపారు.
తాజాగా APDC నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో 100కి పైగా ప్రముఖ పరిశ్రమలు, డ్రోన్ తయారీ, సేవల రంగాల పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశపు డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజన్‌ను దినేష్ కుమార్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం వేగంగా ముందుకు సాగుతోంది. డ్రోన్ రంగం పట్ల ఆసక్తి చూపుతున్న కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. "పెట్టుబడిదారులు తమకు ఇష్టమైన ఏ జిల్లా లోనైనా కార్యకలాపాలను ప్రారంభించడానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాం. భూమి కేటాయింపు, అనుమతుల విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది. చైనా, బెల్జియం, యునైటెడ్ స్టేట్స్ వంటి డ్రోన్ తయారీ దిగ్గజాల సరసన ఏపీని నిలిపేందుకు చర్యలు తీసుకుంటాం" అని దినేష్ కుమార్ చెప్పడం గమనార్హం. డ్రోన్ సిటీ అభివృద్ధి క్రమంలో నైపుణ్యవంతమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దినేష్ కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, డ్రోన్ పరిశ్రమలో ప్రవేశించడానికి ఆసక్తి ఉన్న యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామని అన్నారు. భారతీయ సమాచార సాంకేతికత, డిజైన్, మాన్యుఫాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ (IIITDM) కర్నూలు సహకారంతో ప్రాక్టికల్ వర్క్‌షాపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
డ్రోన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతల సమగ్రతపై పరిశీలన జరుపుతున్నారు. డ్రోన్ సిటీ స్థాపనకు పక్కా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. చాలమంది పారిశ్రామికవేత్తలు ఈ రంగం పట్ల ఆసక్తి చూపడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా ఎంపిక చేయడం పట్ల నిరుద్యోగ యువత కూడా హర్షం వ్యక్తం చేస్తోంది.