బలమున్న టీడీపీకి ‘అనంత’ కష్టాలు

అనంతపురం జిల్లాలో టీడీపీకి మంచి బలం ఉంది. అయితే వర్గపోరుతో ప్రస్తుతం నలుగుతోంది. దీనిని నేతలు సరిచేస్తారా? అలాగే వదిలేస్తారా? చూడాల్సిందే.;

Byline :  The Federal
Update: 2024-03-10 14:50 GMT
TDP Flogs

జి. విజయ కుమార్ 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలోనే ఆ పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన పట్టు ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కంటే అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనేది మేధావులు, పలువురు రాజకీయ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే ఈ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొన్ని స్థానాల్లో యువతకు, నాయకుల మధ్య సరిగా సయోధ్యలేని చోట కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దీంతో సీనియర్లు కొత్త వారికి అవకాశం ఇవ్వొద్దని, వారికి టికెట్‌ ఇస్తే ఓటమి చెందడం ఖాయమని చెబుతూనే వారి అనుచురులచేత అభ్యర్థులకు వ్యతిరేకంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు కాని, ఆ పార్టీ ముఖ్యనేతలెవ్వరూ కూడా నష్టాన్ని ఇప్పటి వరకు సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఆ పార్టీకి బలమున్న అనంతపురం జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దకపోతే పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మడకశిరలో విభేదాలు
హిందూపురం పార్లమెంటు పరిధిలోని మడకశిర నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు ఎంఈ సునీల్‌ కుమార్‌కు టిక్కెట్‌ ఖరారు చేశారు. అయితే కొంతకాలంగా ఆ నియోజవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నాయి. దీంతో సునీల్‌ కుమార్‌కు టిక్కెట్‌ రాకుండా తిప్పేస్వామి అధిష్టానంపై ఒత్తిడి పెంచినప్పటికీ ఆయన మాటను కాదని సునీల్‌ కుమార్‌ పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చేసేది ఏమీలేక తిప్పేస్వామి వర్గానికి చెందిన మడకశిర నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీడీపీ నేతలతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సునీల్‌కుమార్‌ విజయానికి తాము కృషి చేయలేమని, మరొకరికి అవకాశం కల్పించాలంటూ స్టేట్‌మెంట్లు ఇప్పించారు. అయినా అధిష్టానం కలుగజేసుకోకపోవడంతో నియోజకవర్గ కేంద్రమైన మడకశిరలో ఇటీవల సునీల్‌ కుమార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి విజయం సాధించినా టువంటి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని కూర్చోబెట్టి సయోధ్య కుదర్చకపోతే అక్కడ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కోకతప్పదని మేధావులు చెబుతున్నారు.
పార్థసారధి అలక..
పెనుకొండ నియోజకవర్గం విషయానికొస్తే శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథిని కాదని అక్కడ మాజీ మంత్రి ఎస్‌.రామచంద్రారెడ్డి కుమార్తె ఎస్‌.సవితకు టీడీపీ టికెట్‌ ఖరారు చేశారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పార్థసారథి ఈ సారి తనకే టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోకుండా సవిత వైపే మొగ్గు చూపారు. దీంతో పార్థసారథి అలకబూని తన వర్గాన్ని సవితను కలవనీయకుండా చేస్తున్నారు. సవిత అక్కడ విజయం సాధిస్తే తన రాజకీయ ఉనికికే ప్రమాదం ఉందని గ్రహించిన పార్థసారథి ఇప్పటి వరకు సవితతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు. పార్టీ విజయానికి ఆయన సహకరించకపోతే సవిత విజయం అంత సులువు కాదని చెబుతున్నారు.
పరిటాల సునీత దిద్దుబాటు చర్యలు చేపడుతుందా?
రాప్తాడు నియోజకవర్గం విషయానికొస్తే మాజీ మంత్రి పరిటాల సునీతకు టికెట్‌ ఇచ్చారు. పరిటాల కుటుంబం అంటే జిల్లాలోని పేదలతో పాటు పలు వర్గాలకు మక్కువ ఎక్కువ. అయితే పరిటాల రవి మరణానంతరం ఆయన సతీమణి పరిటాల సునీతకు టీడీపీ తరపున 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు టికెట్‌ ఇవ్వగా ప్రజలు ఆశీర్వదించారు. 2009లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ఆమె సోదరులు రాప్తాడు నియోజకవర్గాన్ని కబ్జా చేసి ఓటేసిన ప్రజలకు అండగా ఉండక పోగా ప్రత్యర్థులతో చేతులు కలిపి సంపాదనే ధ్యేయంగా పని చేసి పరిటాల కుటుంబానికి ప్రజల్లో ఉన్న మంచి పేరును పూర్తిగా చెడగొట్టారనే విమర్శలు ఉన్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆమె పోటీ చేసినా టీడీపీకి చెందిన కొందరు పనికట్టుకొని ఆమెను ఓడించారు. ఆ తర్వాత కూడా ఆమె ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు.
కళ్యాణదుర్గంలో శత్రువులిద్దలూ మిత్రులయ్యారు..
అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకర్గం అభ్యర్థిగా కాంట్రాక్టర్‌ అమిలినేని సురేంద్రబాబును ఖరారు చేశారు. అయితే 2014లో కళ్యాదుర్గం నుంచి ఉన్నం హనుమంతరాయ చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇద్దరు కుమారులు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ పనులు చేయించే వారనే విమర్శ ఉంది. 2019 ఎన్నికల్లో తిరిగి ఆయనకే టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని భావించిన అధిష్టానం ఉమామహేశ్వర్‌ నాయుడుకు టిక్కెట్‌ ఇచ్చింది. ఆయన విజయానికి ఉన్నం హనుమంతరాయ చౌదరి సహకరించకపోగా ఆయన కుమారులు లోలోపల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయానికి సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పుడు అక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన ఉష శ్రీచరణ్‌ విజయం సాధించారు. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అధిష్టానం ఈ సారి కాంట్రాక్టర్‌ అమిలినేని సురేంద్రబాబుకు టిక్కెట్‌ ఇవ్వడంతో గతంలో కలవలని ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర్‌ నాయుడు ప్రస్తుతం చేతులు కలిపి సురేంద్రబాబుకు టికెట్‌ వద్దని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అక్కడ సునాయాసంగా విజయం సాధించాల్సి ఉండగా, అందరూ కలిసికట్టుగా పని చేయకపోతే ఈ సారి కళ్యాణదుర్గంలో గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు.
రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు టిక్కెట్‌ ఇచ్చినా ఆ స్థానాన్ని మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి పూర్తిస్థాయిలో సహకరించకపోతే అక్కడ టీడీపీ అంత సునాయాసం కాదని చెప్పవచ్చు. ఇక ఉరవకొండ నుంచి ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, తాడిపత్రి నియోజకవర్గానికి జె.సి.అస్మిత్‌ రెడ్డిలకు టికెట్‌ ఖరారు చేశారు. ఆయితే ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల నుంచి టిక్కెట్‌ ఆశించేవారు ఎవరూ లేకపోవడంతో వారికి ఈ ఎన్నికల్లో నాయకుల పరంగా ఎలాంటి తలనొప్పులు లేవని చెబుతున్నారు.


Tags:    

Similar News