ఉప్పలూరు కల్పన కథ కంచికేనా?

ఫస్ట్‌ టీడీపీ నుంచి పోటీ చేశారు. తర్వాత వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఆమె కెరీర్‌లో ఒక సారే గెలిచారు. తీవ్రంగా ప్రయత్నించినా 2024 ఎన్నికల్లో సీటు దక్క లేదు.;

Update: 2024-03-20 10:03 GMT

(జి విజయ కుమార్) 


విజయవాడ: కృష్ణా జిల్లాకు పామర్రు నియోజకవర్గంకు చెందిన  సీనియర్  రాజకీయ నాయకురాలు, ఉప్పులేటి కల్పనకు ఈ సారి టిడిపి టికెట్ దొరక లేదు. దీనితో ఆమె నిరాశ చెందిన తెరమరుగయ్యారు.  సీనియర్‌  టిడిపి నేత, టీడీపీ పాలిట్  బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమారరాజాకు ఈ సీటు  కేటాయించారు. ఆ షాక్‌ నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. అప్పటి నుంచి ఆమె తెరమరుగయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. యాభై ఎనిమిది సంవత్సరాల వయసున్న కల్పన మాల సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ సారి పామర్రు సీటును  తెలుగుదేశం పార్టీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల కుమారరాజాను ఎంపిక చేసింది. ఈ ఎన్నికల్లో ఇది మాలల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో  వేచి చూడాలి.


తెలుగుదేశంతోనే రాజకీయ ప్రయాణం 

ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. 2004లో ఎన్నికల్లోకి అడుగు పెట్టారు. నిడుమోలు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరీలోకి దిగారు. సిపిఎం అభ్యర్థి పాటూరు రామయ్య చేతిలో ఓటమి చవి చూశారు. తర్వాత జరిగిన డీలిమిటేషన్‌లో పామర్రును ఎస్సీ రిజర్వుడు స్థానంగా మార్చారు. 2009లో తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచే పోటీలోకి దిగారు. అప్పుడు కూడా ఓడి పోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఏసుదాసు చేతిలో 6వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ ఆ పార్టీని వీడారు. వైసిపి లో చేరారు.2012లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి


తెలుగుదేశం పార్టీలో పెద్దగా గుర్తింపు పొందలేక పోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో పెద్ద పీట వేశారు. మంచి మంచి పోస్టుల్లో నియమించారు. అదే పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కూడా మంచి పదవినే కట్టబెటారు. అదే పార్టీలోనే కొనసాగి ఉంటే మంత్రి పదవి కూడా ఇచ్చే వారని ఇప్పటికీ ఆ పార్టీ వర్గాలు చెబుతుంటారు. కానీ ఆమె వాటిని దూరం చేసుకున్నారు. అది దక్కేలోపే పార్టీ మారి పోయారు.ఆ పార్టీలో ఆమెకు ఉన్నత స్థానం కల్పించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. . అనంతరం ఆమెను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలిగా నియమించారు.


ఏకైక గెలుపు


2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పామర్రు నుంచి బరీలోకి దిగారు. సమీప టీడీపీ ప్రత్యర్థి అయిన వర్ల రామయ్యపై గెలిచి తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ నియమించారు. అయినా, 2014 టిడిపి అధికారంలోకి చాలా మంది వైసిపి నుంచి తెలుగు దేశం పార్టీలో చేరారు. అందులో భాగంగా ఈమె కూడా పామర్రు ఎమ్మెల్యే  అయినా కూడా  2016 లో తెలుగుదేశం పార్టీలో చేరి పోయారు.


అయితే  2014 లో  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓడిపోయిన పార్టీలో ఉండటం కంటే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లాలని భావించారు. దీంతో పాటుగా తనకు రాజకీయ అవకాశం కల్పించిన పార్టీ కావడంతో వెనుకా ముందు చూసుకోకుండా ఆ పార్టీలోకి చేరి పోయారు. అప్పటి నుంచి ఆమె పతనం ప్రారంభమైందని రాజకీయ నేతలు చెబుతుంటారు. తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పామర్రు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ చేతిలో 30వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆశించి భంగపాటు

2019 ఎన్నికల అనంతరం నుంచి టీడీపీలోనే కొనసాగుతోన్న ఉప్పలేటి కల్పనకు పెద్ద ప్రాధాన్యత లభించ లేదు. పార్టీ పదవులను కూడా ఆమెకు కేటాయించ లేదు. అయినా ఆమె పట్టు వీడ లేదు. 2024ఎన్నికల్లో టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ పార్టీ పెద్దలు మొండి చేయి చూపారు.

Tags:    

Similar News