పవన్ కల్యాణ్ కు భీమవరం సేఫ్ కాదా?

వైఎస్ జగన్ పులివెందుల, చంద్రబాబు నాయుడు కుప్పం.. మరి పవన్ కల్యాణ్ ఎక్కడ.. గెలిచినా ఓడినా తనకంటూ ఓ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో పవన్ ఎందుకు వెనకాడుతున్నారు?

Update: 2024-02-27 06:19 GMT
pavan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీ చేయాలనుకోవడం లేదా? భీమవరం నియోజకవర్గం తనకు సేఫ్ కాదని ఎందుకు అనుకుంటారు, తన సొంత సామాజికవర్గం నమ్మకం లేకనా, ప్రత్యర్థి వర్గాన్ని విశ్వసించలేకనా? ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ మళ్లీ భీమవరం నుంచి పోటీ చేయడం లేదన్నది దాదాపు ఖాయమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ కల్యాణ్ కి భీమవరం సేఫ్ కాదనే అనిపిస్తోంది.

భీమవరం శ్రేయస్కరం కాదా...

“భీమవరంలో పోటీ చేయడం పవన్ కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అక్కడ రాజుల కంపెనీలలో, చేపల చెరువుల వద్ద కొన్ని వేలమంది పని చేస్తుంటారు. వారంతా రాజులు ఎవరికి ఓటు వేయ్యమంటే వారికే వేస్తారు. పవన్ ను రాజులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వరు. కాపుల మాత్రమే ఓటు వేస్తే గెలవరు. ఇతర కులాల ఓట్లే ప్రధానం” అన్నారు కాపునాడు నాయకుడు పోతుల హరికృష్ణ. ప్రస్తుత రహస్య బ్యాలెట్ విధానంలో ఇది ఒకింత నమ్మశక్యం కాకున్నా పల్లెపట్టుల్లో బలమైన సామాజిక వర్గాల పెత్తనం ఉంటుందన్నది. కాపేతర కులాల వారిని రాజులు ప్రభావితం చేస్తారనే దానిలో అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. రాజులు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో.. MPగా క్షత్రియ వర్గానికి చెందిన వారికి ఓటు వేసి MLA అభ్యర్థిగా పోటీ చేసిన ఇతర సామాజిక వర్గాలకు ఓటు వేయలేదన్న అనుభవాలు ఉన్నాయి. బహుశా పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోవడానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు.

పులవర్తిని ఎందుకు పిలిపించినట్టు...

పవన్ కల్యాణ్ వెనకడుగు వేసినందునే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులును హుటాహుటిన హైదరాబాద్ పిలిపించారు. సుమారు గంటపాటు పవన్ కల్యాణ్ తో పులవర్తి చర్చలు జరిపారు. భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చర్చించడంతో పాటు పోటీకి సిద్ధంగా ఉండాలని కోరినట్టు సమాచారం. దీనికి మానసికంగా సిద్ధపడే పులవర్తి కూడా హైదరాబాద్ వెళ్లారు. బహుశా ఆయన ఈనెల 28న తాడేపల్లిగూడెం వద్ద జరిగే బహిరంగసభలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారు. అందువల్ల పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదని చెప్పడానికి ఇదో సంకేతం.

పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం టీడీపీ, వైసీపీ.. రెండు పార్టీలకూ ఇష్టం లేదన్న టాక్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ‘పొత్తులో ఉన్నా లేకున్నా పవన్ ఓటమే లక్ష్యంగా వైసీపీ పని చేస్తుంది. ప్రత్యర్థి పార్టీ గనుక అది సహజమే. అయితే పవన్ కల్యాణ్ ఓడిపోవాలని టీడీపీ కూడా కోరుకుంటుంది‘ అంటున్నారు హరికృష్ణ. ఎందుకంటే పవన్ అసెబ్లీలో ఉంటే అటు బాబుకైనా, ఇటు జగన్ కైనా ఇబ్బందే .. కాబట్టి పవన్ పోటీ చేసే చోట టీడీపీ ఓట్లు వైసీపీ అభ్యర్థికి వేసినా ఆశ్చర్యం లేదు. పవన్ ఓడితే... ఎమ్మెల్యే గానే గెలవలేదు.... నీకు CM ఎందుకు? అంటూ గేలి చేసి రాజకీయాల నుంచి పూర్తిగా ఇంటికి పంపొచ్చు అన్నది ప్లాన్ గా ఆయన అభివర్ణిస్తున్నారు.

అందుకే పవన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనిపిస్తోంది. సహజంగా తొలి జాబితాలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఉంటుందని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. తన రైట్ హ్యాండ్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కి సీటు ఇచ్చారు. తెనాలి నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ కల్యాణ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. విలేఖరులు అడిగినా ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా వచ్చింది.

ఆయన దృష్టి కేంద్రీకరించిన స్థానాలు ఇవేనా...

కాబట్టి పవన్ కొన్ని సేఫ్ నియోజకవర్గాలను ఎంచుకున్నారని సమాచారం. వాటిలో చాంతాడంత లిస్టు ఉన్నా ఈసారి కూడా ఆయన కోస్తా జిల్లాల నుంచే పోటీ చేస్తారు. ఆయన పోటీకి ఎంచుకునే నియోజకవర్గాలలో ప్రధానంగా తాడేపల్లిగూడెం, కొత్తపేట, జగ్గంపేట, పిఠాపురం, అవనిగడ్డ, అమలాపుం, విజయవాడ తూర్పు, అనంతపురం అర్బన్, తిరుపతి ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీ అధినేత గా ఉంటూ ఇంతకాలం తనెక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకోకపోవడం విచారించదగిన విషయంగా పవన్ కల్యాణ్ అభిమానులు వాపోతున్నారు.


Tags:    

Similar News