అమ్మ కంట కన్నీరొలికితే.. అబ్బాయి ఏమవుతాడో!

సీఎం జగన్ కు కళ్లెం వేసేలా కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. జగన్ ను చక్రబంధంలో ఇరికించేలా వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2024-03-20 03:00 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్, తిరుపతి)

ఒకపక్క ఇంటి పోరు, మరోపక్క ప్రత్యర్థుల రాజకీయ పోరు. సీఎం వైఎస్ జగన్, ఆయన చిన్నాన్న కుమారుడు అవినాష్ రెడ్డిని పీడిస్తున్న సమస్యలివి. ఇంటిపోరు ఇంతింత కాదయా అన్నట్టుగా ఇటీవల వీరిద్దరికీ ఈ తలపోటు ఎక్కువైంది. రాజకీయాల్లో అంకెలు తప్ప అనుబంధాలు లేవంటున్న వైఎస్ షర్మిల, ఆమె సోదరి సునీత ఏమి చేస్తారు, వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఏ సైడు వహిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
వివేక భార్య పోటీ చేస్తే.. పులివెందులలో సీన్ రివర్స్?
అత్యంత సామాన్యుడితో సైతం అనుబంధాన్ని పెంచుకున్న వైఎస్ వివేకానంద రెడ్డికి అజాతశత్రువుగా పేరు ఉంది. ఆయన భార్య వైయస్ సౌభాగ్యమ్మ పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తే... పోరాటం ఆషామాషీగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సౌభాగ్యమ్మ పల్లెల్లో కెళ్ళి కన్నీరు పెడితే సీన్ మారిపోక తప్పదనే భావన కూడా ఆ ప్రాంత ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. వివేకానంద రెడ్డి కుమార్తె వైయస్ సునీత రెడ్డికి అమెరికాలో పౌరసత్వం (గ్రీన్ కార్డు) ఉండడం వల్ల, ఇది ఆమెకు అవరోధంగా మారిందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందువల్ల ఆమె ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానం మినహా శాసనసభకు పోటీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవని చెబుతున్నారు.
అన్న పైకి చెల్లెలి బాణం..

గత ఎన్నికల వరకు కుటుంబ సభ్యుల సహకారంతో సీఏం వైయస్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యకలాపాలు అప్రతిహతంగా సాగుతూ వచ్చాయి. వీటికి చెక్ పెట్టేందుకు కడప ఎంపీ స్థానం నుంచి పిసిసి చీఫ్ వైయస్ షర్మిల రెడ్డినీ పోటీకి దించనున్నట్లు సమాచారం. ఈమెకు తోడు, కీలక నాయకులు కూడా పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుటుంబీకులు పులివెందుల నియోజకవర్గంలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై పోటీకి దిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఎందుకంటే..
వివేకా హత్యతో..
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వైయస్సార్ కుటుంబీకుల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. రాజకీయ ఆధిపత్యానికి తెరలేచింది. వైయస్ షర్మిల రెడ్డి పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి తిరగబడ్డారు.
"నా తండ్రి వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులకు కొమ్ము కాస్తున్నారు" ప్రజా కోర్టులో అన్న జగన్ మోహన్ రెడ్డిని ఆయన పార్టీని తిరస్కరించండి అంటూ, మరో చెల్లెలు వైయస్ సునీత రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు.
కలిసొచ్చిన సానుభూతి..!
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం తో వచ్చిన సానుభూతి పవనాలు, కాంగ్రెస్ అధిష్టానం పై తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన తెగువ అప్పట్లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చాయి. దీనివల్ల 2011లో కడప పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5,45,672 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిపై గెలుపొందారు.
మొదటి ఎన్నికకు కూడా..

కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏర్పాటు చేసి 2014లో పులివెందుల ఎమ్మెల్యేగా 1,24,570 ఓట్ల తో ఎన్నికయ్యారు. టిడిపి అభ్యర్థి వెంకట్ సతీష్ కుమార్ రెడ్డికి 49, 333 ఓట్లు వచ్చాయి. 2019లో 1,32,356 ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయనపై మళ్ళీ పోటీ చేసిన వెంకట సతీష్ కుమార్ రెడ్డి 42,246 ఓట్లు సాధించారు.
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన తల్లి విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి, చెల్లెలు వైయస్. షర్మిలా రెడ్డి, బాబాయ్ వైయస్ వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైయస్ సునీత రెడ్డి, మరో బాబాయ్ వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి తో సహా అనేకమంది కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.
" 2019 ఎన్నికలకు ముందే జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య వైఎస్ఆర్సిపి కి సానుభూతి ఓట్లు కూడా కురిపించింది" కడప జిల్లాలో 10 కి 10 శాసనసభ, రెండు ఎంపీ సీట్లను వైఎస్ఆర్ సిపి దక్కించుకుంది.
పులివెందులలో ఏమి జరుగుతోంది...
వైయస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో పరిస్థితి తిరగబడినట్లు అంచనా వేస్తున్నారు. గెలుపోటములనేది పక్కకు ఉంచితే.. కుటుంబ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో మాదిరి కుటుంబీకుల అండ తగ్గడంతో పాటు టిడిపి అభ్యర్థి బీటెక్ రవి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
వారిద్దరూ పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం మండలాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన సత్తా ఉందని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం లక్కిరెడ్డిపల్లి నుంచి పులివెందులలోకి విలీనమైన చక్రాయపేట మండలంలో కూడా టిడిపి ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
ఎంపీగా తమ్ముడు అవినాష్..
బాబాయ్ వైయస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైయస్ అవినాష్ రెడ్డిని 2014 ఎన్నికల్లో అవినాష్ రెడ్డినీ ఎంపీగా మొదటిసారి పోటీపడ్డారు. 12.662 లక్షల ఓట్లలో 6,71,883 ఓట్లు సాధించారు. టిడిపి అభ్యర్థి ఆర్ శ్రీనివాసరెడ్డికి 4,81660 ఓట్లు రాగా.. అవినాష్ రెడ్డి 1,90,323 మెజారిటీతో గెలిచారు.
2019 ఎన్నికల్లో వైయస్ అవినాష్ రెడ్డికి 7,83,499 ఓట్లు, టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డికి 4,02,773 ఓట్లు లభించాయి. వైయస్ అవినాష్ రెడ్డి 3,80,776 మెజారిటీతో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
కడప రెడ్డమ్మ ఎంట్రీ..
అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తిరుగుబాటు చేసిన వైఎస్ షర్మిలరెడ్డి కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈమెకు తోడు దివంగత సీఎం వైఎస్ఆర్ కు సహచరుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి లేదా మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి బిజెపి నుంచి కడప బరిలో నిలిచే అవకాశం లేకపోలేదు అంటున్నారు. వైయస్సార్ సమకాలీకుడు, మాజీ మంత్రి డాక్టర్ డి ఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరులోనూ, అంతకంటే ఎక్కువ సీనియర్ అయిన ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి, కమలాపురంలో పుత్త నరసింహారెడ్డి నుంచి కూడా వైఎస్ఆర్సిపి కి ప్రతిఘటన తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ భారీ స్కెచ్...
వైయస్ఆర్సీపీని బలంగా దెబ్బ కొట్టడానికి ఏఐసీసీ పెద్దలు కడపను టార్గెట్ చేశారని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పోటీ చేయించాలనే వ్యూహంతో.. స్కెచ్ వేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ వ్యూహానికి టిడిపి కార్యాచరణ కూడా తోడయ్యే పరిస్థితి లేకపోలేదని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, టిడిపి, బిజెపి అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.
" పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి కడప నుంచి పోటీ చేస్తారు" అని ఆ పార్టీ సీనియర్ నేత ఎన్. తులసిరెడ్డి చెప్పారు. ఆమె ప్రభావం కడప, అనంతపురం జిల్లాల్లో కూడా ఎక్కువగానే వుంటుందని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. "ఇందులో సందేహం లేదు. వైఎస్. షర్మిలారెడ్డి ప్రభావం తీవ్రంగానే ఉంటుంది" అని రాజకీయ విశ్లేషకుడు తుంగా లక్ష్మి నారాయణ సమర్థించారు.
Tags:    

Similar News