పవన్ వెనుక ‘ప్లవర్’ ఫుల్ వెపన్ ఉందా?

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందుకు తిరుపతి పరామర్శల పర్యటన ఉదాహరణ.;

Update: 2025-01-26 02:54 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కూటమిలో పార్టీల మధ్య వర్గ పోరు బాగా నడుస్తోంది. బయటకు కనిపించకుండా చాపకింద నీరులా ఉంది. పైకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పొగుడు తున్నారు. ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని, మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. కొన్ని సమావేశాలకు పవన్ కల్యాణ్ ఆలస్యంగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సైతం సీట్లో నుంచి పైకి లేచి ఆయనను సాదరంగా ఆహ్వానించి తరువాత కూర్చొన్నారు. పైకి చూసేందుకు ఇవన్నీ ఎంతో బాగుంటున్నాయి.

తిరుపతి పరామర్శకు కలిసి ఎందుకు వెళ్లలేదు?

తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. ప్రపంచమంతా ఒక్క సారిగా నివ్వెర పోయింది. చనిపోయిన కుటుంబాల వారు ఆస్పత్రి వద్ద రోదిస్తున్నారు. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలియజేశారు. మీరు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్లి పరామర్శిద్దామని అడిగారు. నేను రావడం లేదని పవన్ కల్యాణ్ సమాధానం చెప్పటంతో ముఖ్యమంత్రి వెళ్లారు. జనవరి 8 రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగ్గురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి 9వ తేదీ వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. పరామర్శలు పూర్తయిన తరువాత సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలువురు అధికారుల తీరును తప్పుపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. పదో తేదీన పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య విషయాలు చర్చించాలని చైర్మన్ ను ఆదేశించారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకున్నారు.

పవన్ సపరేట్ గా ఎందుకు వెళ్లారు?

పరామర్శకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరినా రావడం లేదని చెప్పిన పవన్ కల్యాణ్ 10వ తేదీ హెలికాఫ్టర్ లో తిరుపతికి వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాలను, క్షత గాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జరిగిన తప్పులో పాలకవర్గం బాధ్యత ఎక్కువగా ఉందని, చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులందరూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వం చేసింది తప్పేనంటూ తాను కూడా క్షమాపణ చెప్పారు. నేను చెప్పగా లేనిది మీరెందుకు చెప్పరంటూ పాలక వర్గాన్ని నిలదీశారు. ఇది పలువురిలో చర్చకు దారి తీసింది. టీటీడీ చైర్మన్ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ నేను క్షమాపణ చెబితే చచ్చిపోయిన భక్తులు లేచి వస్తారా? అంటూ వ్యాఖ్యానించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.

చాపర్ వినియోగించ వద్దంటూ ముందుగానే ఆదేశాలు...

ప్రతి కార్యక్రమానికీ హెలికాఫ్టర్ ను ఉపయోగించవద్దంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయినా ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకుండా హెలికాఫ్టర్ లోనే పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి రావడం సీఎం కార్యాలయంలో చర్చకు దారి తీసినట్లు సమాచారం. వద్దని చెప్పినా అవే ఎందుకు పవన్ కల్యాణ్ కావాలని చేస్తున్నారనే చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలైంది. సీఎం రమ్మని పిలిచినప్పుడు వెళ్లి ఉంటే ప్రభుత్వానికి ఎంతో ఖర్చు తగ్గేదని, ఇద్దరూ వేరు వేరుగా వెళ్లడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పడుతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి.

గుంభనంగా తెలుగుదేశం పార్టీ

సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినా పట్టించుకోకుండా తన వ్యవహార శైలిని తాను కొనసాగిస్తూ పవన్ వెళ్లడంపై తెలుగుదేశం పార్టీ గుంభనంగా వ్యవహరిస్తోందని కొందరు నాయకులు సన్నిహితుల వద్ద చెబుతున్నారు. వారినోట్లో వీరి నోట్లో పడి లోలోపల చర్చ జరుగుతూనే ఉంది. శాంతి భద్రతల విషయంలో హోం మంత్రి అనిత ఫెయిల్ అయ్యిందనే విధంగా వ్యాఖ్యానించడం పైనా తెలుగుదేశంలో ఆలోచనలు మొదలయ్యాయి. తిరుపతి లడ్డూ లో కల్తీ నెయ్యి వాడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించడంతో ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి అందరినీ ఆశ్చర్య పరిచారు. దుర్గమ్మ గుడి మెట్లు స్వయంగా కడిగి బొట్లు పెట్టడం కూడా చర్చకు దారి తీసింది. ఎస్పీలకు, కలెక్టర్ లకు ఫోన్ లు చేసి పలానా పనులు చేయాలని ఆదేశించడం పై కూడా తెలుగుదేశం పార్టీలోని కీలక వ్యక్తుల మధ్య చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ లు, ఎస్పీల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మీరు మీ పని పర్ఫెక్ట్ గా చేస్తే మా ఏ ఇబ్బందులూ ఉండవంటూ కాస్త ఘాటుగా మండి పడ్డారు. ముఖ్యమంత్రి వీరికి ఇచ్చిన సమాచారం మేరకు విజన్ 2029 తయారు చేసుకుని తీసుకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు రిపోర్టులు కలెక్టర్ లు అందరూ తెచ్చిన ప్రభుత్వం తరపున సమావేశంలో చాలా మంది మాట్లాడారు.

అందరూ ముఖ్యమంత్రులు కావాలనుకుంటే కుదరదు..

తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ ముఖ్యమంత్రులు కావాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. నేనున్నాను. ఏమి చేయాలో తెలుసు. ఎలా చేయాలో తెలుసు. అవన్నీ మనం చేస్తే చాలు జనానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అంటే దీని అర్థం ప్రభుత్వంలో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ తీరును పరోక్షంగా ప్రస్తావించారనే భావించాల్సి ఉంటుంది.

లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి డిమాండ్ కు నేపథ్యం ఇదేనా..

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాల్సిన కొన్ని అంశాలను పక్కన బెట్టి ముక్కు సూటిగా వెళ్లి పోతున్నారని, అందువల్లే లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చిందనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న మాట. ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ లోకేష్ నేరుగా కలెక్టర్ లు, ఎస్పీలకు ఫోన్ లు చేసి పనులు చెప్పే వారు కాదని, తన డిపార్ట్ మెంట్ వారితో మాత్రమే మాట్లాడుతున్నరని, ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యల అర్జీలను మాత్రం డిపార్ట్ మెంట్స్ వారీగా పంపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వారు చెబుతున్నారు. అలాగే జనసేన, బీజేపీ వారు కూడా తమ పార్టీలకు వచ్చిన అర్జీలను ప్రభుత్వ అధికారులకు పంపిస్తున్నారని, అంత వరకు బాగానే ఉన్నా పవన్ కల్యాణ్ మాటలకు, పనులకు పొంతన లేకుండా ఉంటోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఒకరు తెలిపారు.

బీజేపీ వారు చెబుతున్నట్లుగా చేస్తున్నారా?

ప్రధానంగా ప్రజల్లో ప్రస్తుతం బీజేపీ, పవన్ కల్యాణ్ వ్యవహారం పైనే చర్చ జరుగుతోంది. కేంద్రం నుంచి పవన్ కల్యాణ్ కు అందిన సంకేతాల ప్రకారం పనిచేస్తున్నారని, బీజేపీ వారు తెలుగుదేశం పార్టీపై పట్టు సాధించేందుకు ఇదో మంచి ఆయుధమని భావించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ పరిశీలకుల్లోనూ ఇవే అంశాలు చర్చకు వస్తున్నాయి. పవన్ వెనుక బీజేపీ పవర్ ఉన్నంత కాలం చంద్రబాబు కూడా నోరు మెదిపే పరిస్థితులు లేవనే వ్యాఖ్యలు పలువురు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ మాట మీద నిలబడటం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే అవినీతిని నిర్మూలించడంతో కొంతవరకైనా విజయం సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారంలో కొంత నిజం కూడా ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల అధికారులను ఆయన వెంటపడి పనిచేయిస్తున్న తీరును పలువురు మెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి మాట తీరు కఠినంగా, దురుసుగా కూడా ఉంటోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏమైనా బీజేపీ పవర్ పాకెట్ గా పవన్ కల్యాణ్ కేంద్రానికి ఉపయోగ పడుతున్నారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News