ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అధ్యయనాలతో సరిపెడతారా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారం చేపట్టి ఆరున్నర నెలలైంది. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం హామీపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.;
ఉచితంగా అన్ని వర్గాల ప్రజలకు డబ్బులు, బస్ ప్రయాణాలు, గ్యాస్ వంటివి ఇస్తామని ఎన్నికల్లో సునాయాసంగా పాలకులు హామీలు ఇచ్చారు. అయితే అమలు చేసేందుకు మాత్రం భయం వేస్తోందంటున్నారు. తాము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే భయమేస్తోందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ అనటం పలువురిని ఆలోచింప జేసింది. ఉచిత పథకాల హామీలు ఇవ్వడం దేనికి, అమలు చేయడంలో కష్టాల పాలవడం దేనికనే వర్గం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. గత ప్రభుత్వం కూడా అందరికీ డబ్బులు ఉచితంగా ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టింది. చివరకు ఆ ప్రభుత్వం పనితీరు బాగోలేదని భావించిన జనం విస్తరాకును ముక్కలు చేసినట్లు చించి పడేశారు. అయినా ఉచిత పథకాలు ప్రవేశపెట్టకుంటే తాము హామీలు ఇవ్వడంలో వెనుకబడి పోతామనుకున్నారో ఏమో కాని ఉచిత హామీలు సునాయాసంగా ఇచ్చి ఇప్పుడు ఆయాస పడుతున్నారు.
హామీ ఇచ్చేటప్పుడు లేని ఆలోచన ఇప్పుడెందుకు?
మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో హామీ మేరకు పథకం అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చింది. హామీ ఇచ్చేముందు వెనుకా ముందూ ఆలోచించలేదు. ముందు హామీ ఇస్తే సరి తర్వాత ఆలోచిద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఈ పథకానికి పెట్టే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ పథకం అమలు మొదలైంది. ఉగాది నుంచి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఉంటుందని చెబుతున్నారే తప్ప ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఉచితంగా మహిళలు బస్ పయాణం పథకంలో ఉన్న లోటు పాట్లు తెలుసుకునేందుకు అధ్యయనం కోసం ప్రభుత్వ మంత్రుల బృందం వెళ్లి వచ్చింది. మొదట తెలంగాణలో అధ్యయనం చేశారు. రెండు రోజులుగా కర్నాటకలో అధ్యయనం చేశారు.
అధ్యయనాలతో ఆలస్యం చేస్తారా?
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో హోం మంత్రి వంగలపూడి అనిత, స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి పర్యటించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి అక్కడి కొందరు మంత్రులతోనూ చర్చించారు. పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. దీనిపై ఒక ప్రత్యేక నివేదిక తయారు చేశారు. ఈ రిపోర్టును ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ పథకం అమలు చేయాలన్నా ఏవో లిటిగేషన్ లు పెట్టి ప్రజల్లో కొంత మందికి మాత్రమే అమలయ్యే విధంగా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. గతంలో రైతుల రుణమాఫీలోనూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి కొంతవరకే పరిమితం చేశారు. ఇలా ఏదో ఒకటి తెరపైకి తెస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లోనూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇలా ప్రతి రాష్ట్రం ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని ప్రయారిటీగా తీసుకుంటోంది.
రాష్ట్రంలో మహిళల సంఖ్య 2.657 కోట్లు
మహిళలు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండు కోట్ల 65లక్షల మంది ఉన్నారు. వీరిలో పద సంవత్సరాలలోపు బాలికల సంఖ్య తక్కువగానే ఉండొచ్చని నిఫుణులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర జనాభాలో నడియస్సు వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వృద్ధులు, చిన్న పిల్లల సంఖ్య తక్కువగానే ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన మహిళల ఉచిత బస్ పయాణానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడూ జరిగే సభలు, సమావేశాలు, ఎక్స్ కర్షన్స్ కు బుక్ చేసిన బస్ ల చార్జీలు చెల్లించకుండా ప్రభుత్వం బకాయీ పెడుతోంది. ప్రభుత్వ బకాయి కాబట్టి అధికారులు అంత గట్టిగా అడిగి తీసుకోలేరు. అందువల్లనే ఆర్టీసీ నష్టాల బాట పడుతోందనే విమర్శలు ఉన్నాయి. ఉచిత బస్ ప్రయాణం అనగానే బస్ ల సంఖ్య పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అవసరం లేకపోయినా కొత్త బస్ లను కొనుగోలు చేయడం, పాత బస్ లను రిపేరు చేయించకుండా మూలన పడేయడం పరిపాటిగా మారింది.
వ్యతిరేక ఫలితాలపై అధ్యయనం
కర్నాటక, తెలంగాణల్లో ఆటోలు నడిపే వారి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఏపీలో కూడా ఆటో వాలాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారా? లేదా? అనే విషయం కూడా కర్నాటకలో చర్చకు వచ్చింది. కర్నాటక సర్కార్ ఇటీవల ఈ పథకం రద్దు చేస్తే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందా? రాదా? అనే అంశంపై కూడా చర్చించింది. అందువల్లనే పడుతున్న ఆర్థిక భారం తగ్గించుకుని అడుగు ముందుకు వేయాలంటే వయస్సును పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం వృద్దులకు రాయితీ ఇస్తున్న విధంగా ఆ వయసు మహిళలకు ఉచితంగా ప్రయాణం, మిగిలిన వారికి ఆఫ్ చార్జీ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు సమాచారం.