కాపులకు గాలమా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమా?

మాజీ పోలీస్‌ బాస్‌ ఇంత అకస్మాత్‌గా పార్టీ పెట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నారు. మూడు నెలల్లో పార్టీని అధికారంలోకి తేవడానికి ఎన్‌టీఆర్‌, చిరంజీవీ కాదు..

Update: 2023-12-23 11:09 GMT
JD Lakshminarayana

జేడీ లక్ష్మీనారాయణ ఎలియాస్‌ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ పెట్టిన జై భారత్‌ పార్టీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న చర్చ ఇది. జగన్‌ క్విడ్‌ ప్రోకోకి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్‌ చేసి జైలుకి పంపే నాటికి ఈయన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగానికి జాయింట్‌ డైరెక్టర్‌. అంటే సీబీఐ జేడీ. జగన్‌ అరెస్ట్‌తో ఆయన ఇంటి పేరు మరుగున పడి జేడీ అనేదే ఇంటిపేరయింది. ఇప్పుడీయన పార్టీ పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ ఎంపీ, ఒకప్పటికి కాంగ్రెస్‌ నేత, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చెప్పిన ప్రకారం..

‘జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు పార్టీ పెట్టడం మంచి పరిణామం. ఆ పార్టీకి సీట్లు రాకపోవచ్చు, కానీ ఓట్లు వస్తాయి. ఆ ఓట్లు రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.’
జేడీ పార్టీపై మొదలైన చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఆవిర్భావంపై చర్చ మొదలైంది. ఎన్నికలకు మూడు నెలల ముందు పార్టీ ఆవిర్భావం, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్దం కావడం అనేది ఆషామాషీ కాదు. మరి లక్ష్మీనారాయణ మనసులో ఏముందో.. ఎన్నికల్లో ఎలా ఓటర్లను ప్రభావితం చేస్తారో చూడాల్సి ఉంది. జనసేనలోని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ముఖ్య నాయకుడు చెప్పిన ప్రకారం కాపు ఓట్లను చీల్చడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు.
‘సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన జై భారత్‌ నేషనల్‌ పార్టీపై ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రూ. 1000 కోట్లు సమకూర్చింది. జయప్రకాష్‌ నారాయణ లోక్‌ సత్తా పార్టీని, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌టీపీని మూసేశారు. ఆయన కూడా త్వరలోనే మూసేస్తారు’ అని అన్నారు.
ఇదో మంచి పరిణామం
రాజకీయాల్లోకి విద్యావంతులు రావడం మంచి పరిణామంగా భావించాలి. ఇప్పటికే లక్ష్మీనారాయణ వివిధ పార్టీల్లో టిక్కెట్‌ కోసం ప్రయత్నం చేశారు. ఆయా పార్టీల నుంచి ఇప్పటి వరకు టిక్కెట్‌ ఇస్తామనే హామీ రాలేదు. గతంలో జనసేన పార్టీ తరపున విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలు కులానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. పార్టీ నేతలు కులాలను పట్టించుకోకపోయినా కింది స్థాయి నాయకులు కులాల కుమ్ములాటలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీని రెడ్లు ఓన్‌ చేసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గం వారు ఓన్‌ చేసుకున్నారు. ఇది కాదనలేని సత్యం. ఈ లెక్కన జనసేన పార్టీ నేతలను ఒక సినీ హీరోగా ప్రారంభంలో జనం దగ్గరకు తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా కాపు సామాజికవర్గ పార్టీగా మారిందనవచ్చు. కాపుల్లో చాలా మంది జేఎస్‌పీని మాపార్టీ అని చెప్పుకునే పరిస్థితి ఉంది.
జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం నుంచి కాస్త మద్దతు ఎక్కువగా ఉంటుంటుందని జైభారత్‌ నేషనల్‌ పార్టీ భావించడంలో తప్పులేదు. అయితే మిగిలిన వర్గాల మద్దతు కూడా కావాల్సి ఉంటుంది. అందువల్ల కుల ప్రాతిపదిక అనే విషయం ఆయన నుంచి ఎప్పుడూ రాలేదు. మంచి చేయాలని వచ్చిన నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరుతున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, నాకు అధికారం ఇస్తే ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెబుతున్నారు. ఓట్లు చీల్చడానికి మీరు పార్టీ పెట్టారని, దీనివల్ల ప్రధాన పార్టీలపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందువల్ల మీరు అనుకున్న ప్రయోజనం పొందవచ్చని అనుకుంటున్నారా? అనే సందేహాన్ని విలేకరులు వ్యక్తం చేయగా మేము ఓట్లు చీల్చే వాళ్లం కాదని, సీట్లు మాత్రం చీల్చుకుంటామని వ్యాఖ్యానించడం విశేషం.
విమర్శ కాదు.. విధానం కావాలి
జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడాన్ని స్వాగతించాల్సిందే. విమర్శలు కాదు, ఒక కొత్త రాజకీయ పార్టీకి విధానపరమైన పత్రం ఉండాలి. అప్పుడు ఆయన విధానం ఏంటో బయటకు వస్తుంది. దానిపై ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. పార్టీ పెట్టడం వల్ల దాని పర్యావసానం ఎలా ఉంటుందనేది కూడా ఆయన ఈ పాటికే ఆలోచించి ఉంటారు. దానిని కూడా చూడాల్సి ఉంటుంది. లౌకికవాదం, రాజ్యాంగం, పబ్లిక్‌ రంగంపై ఆయన ఆలోచనలు ఏమిటి? వీటిపై జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కె రామకృష్ణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి, భారత కమ్యూనిస్టుపార్టీ.

ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా మంచిదే

రాజకీయాల్లోకి రావాలనే అభిలాష మంచిది. ఆయన ఉన్నత విద్యను అభ్యశించిన వారు. ఆత్మ విశ్వాసంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రావడం ఆహ్వానించ దగిందే. అయితే ఒకరిచేతిలో కీలు బొమ్మ కాకూడదు. మంచి విధానాలతో ముందడుగు వేయాలి.
నర్రెడ్డి తులసిరెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు.
ముందు కేంద్రంపై పోరాడాలి
రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా మంచిదే. ఎవరిపై పోరాడతారనేది కాదు. ప్రత్యేక హోదాపై పోరాడతామని అన్నారు. అలాంటప్పుడు ముందు కేంద్రంపై పోరాడాలి. ఆయన పార్టీ రాజకీయ విధానాలు ఏమిటో స్పష్టం చేయాలి. 2018లో వేరే వారు పెట్టిన పార్టీని ఈయన తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు రిజిష్టర్‌ చేసింది కాదు. ఎన్నికల సమయంలో పార్టీ పెట్టినా మంచిదే. అయితే ఒక విధానానికి కట్టుబడి పనిచేస్తే బాటుంది.
వి శ్రీనివాసరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం
విమర్శలతో పార్టీ ప్రారంభిస్తారా?
ఒక రాజకీయ పార్టీ ప్రారంభించే ముందు ఆ పార్టీ విధి విధానాలు ఏమిటో వెల్లడించాలి. వాటి కారణంగా ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుందో అందరికీ అర్థం అవుతుంది. అటువంటిదేమీ లేకుండా ఒకరు ఎస్పీజీ చాటున ఉండే వారు, మరొకరు పరదాల చాటున ఉండే వారని విమర్శించినంత మాత్రన ఓట్లు వస్తాయనుకోవడం అవివేకం. జైభారత్‌ నేషనల్‌ పార్టీని మేము పార్టీగానే భావించడం లేదు. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదు.
నెట్టెం ర ఘురామ్, మాజీ మంత్రి, ఎన్‌టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షులు.
Tags:    

Similar News