తిరుపతి లడ్డూ తయారీ రాజకీయ రంగు పులుముకుంది. చినికి చినికి గాలివానయ్యేటట్టే కనిపిస్తోంది. ఇది ఎన్ని సుడులు తిరిగి ఏమలుపు వద్ద ఆగుతుందో ఇప్పుడిప్పుడే అంచనా వేయలేక పోయినా 'బుడమేర వరదను' మించిపోయేలా ఉంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ ఆరోపణ చేశారో గాని ఇప్పుడది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా పన్నిన వలలో వైసీపీ నేత జగన్ చిక్కినట్టే కనిపిస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, పంది, ఎద్దు కొవ్వు నుంచి తీసిన నెయ్యిని వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే జనసేన, బీజేపీ, టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ మాట చెప్పడంతో జగన్ స్పందించక తప్పలేదు. జగన్ హయాంలో టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన వారూ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేడీ నడ్డా ఈ మొత్తం వ్యవహారంపై నివేదికను కోరగా తాజాగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం బీజేవైఎం ఆందోళనకు పూనుకుంది. పిఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమ పండితులు కూడా వరుసగా స్పందిస్తున్నారు.
కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేయడం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి అపచారమే అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా మరికొంత మంది వైఎస్ జగన్ కు క్రిస్టియన్ మతాన్ని అంటగట్టాలనే ప్రయత్నంలోనూ ఉన్నారు. అందులో భాగంగానే జగన్ భార్య భారతీ, జగన్ పిన్నమ్మ( బాబాయి వైవీ సుబ్బారెడ్డి భార్య) చేతిలో బైబిల్ ఉండడాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇదే అదునుగా జగన్ మరో వైరి పక్షం నేత పవన్ కల్యాణ్ "ఏడుకొండలవాడా క్షమించంటూ" ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. హిందూ దేవాలయాలన్నింటినీ ఓ ధర్మసంస్థ పరిధిలోకి తీసుకువచ్చి భక్తుల సెంటిమెంట్ ను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్ కోరుతోంది. దాదాపు ఇదే విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా చెప్పడం గమనార్హం.
బీజేపీ ఆదేశాల మేరకే బీజేవైఎం రంగంలోకి దిగిందా?
హైందవ ధర్మానికి ధర్మసంరక్షులుగా చెప్పుకుంటున్న బీజేపీ నేతల ఆదేశాల మేరకే ఆ పార్టీ అనుబంధ సంస్థలు ఆందోళనకు దిగినట్టు వైసీపీ నేత ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లు కాకుండా బీజేపీ అనుబంధ సంస్థలు ఆందోళనకు దిగడమే ఈ అనుమానానికి తావిస్తోందన్నది ఆ నాయకుని మాట. జగన్ నియమించిన టీటీడీ పాలకమండలిలో కేంద్రంలోని బీజేపీ నేతల సిఫార్సు మేరకు నియమితులైన వారూ ఉన్నారు. జగన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్నే చెబుతూ.. నిజంగా నెయ్యిలో కల్తీ జరిగిఉంటే వాళ్లైనా ప్రశ్నించి ఉండాల్సిందిగా కదా అన్నారు. జగన్ ఇలా వ్యాఖ్యానించడమంటే బీజేపీకి సవాల్ విసరడం లాంటిదే. బీజేపీ వాళ్ల విశ్వసనీయతను ప్రశ్నించడమే. బహుశా బీజేపీ ఈ దాడిని తిప్పి కొట్టేందుకు తమ అనుబంధ సంస్థలను రంగంలోకి దింపి ఉండవచ్చునన్నది వైసీపీ నేతల అనుమానం. దీనికి తగ్గట్టుగానే భజరంగ్ దళ్ కార్యకర్తలు సెప్టెంబర్ 21న తిరుపతిలో ఆందోళన చేశారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. సెప్టెంబర్ 22న బీజేవైఎం కార్యకర్తలు ఏకంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యికి జగనే బాధ్యుడంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అరెస్టులు చేసి ఆందోళనకారులను తాడేపల్లి పోలీసు స్టేషన్ కు పంపించబట్టి సరిపోయింది కాని లేకుంటే ఆయన ఇంటిని చుట్టుముట్టి ఉండేవారేమో. మరోపక్క, ప్రసాదాల పవిత్రను కాపాడేందుకు సంప్రోక్షణలు చేయించాలని భావిస్తున్నారు.
బీజేపీ కుట్ర సిద్ధాంతాలలో భాగంగానే చంద్రబాబు ఈ ఆరోపణలు చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. శ్రీవారి ప్రసాదం నిజంగానే అపవిత్రమై ఉంటే దోషులెవరో తేల్చేందుకు పూర్తి స్థాయి విచారణ జరిపించే అధికారం అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్రప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరా అన్నారు. చంద్రబాబు దురుద్దేశంతో లేదా ఉద్దేశపూర్వకంగానే అటువంటి ఆరోపణలు చేసి ఉండవచ్చునని అంటూనే ఇదంతా బీజేపీ కుట్ర సిద్ధాంతంలో భాగమే అయి ఉంటుందని ఆరోపించారు. ఇంతవరకు ఎటువంటి విచారణ సంస్థకు ఈ వ్యవహారాన్ని అప్పగించలేదు.
బీజేపీ నేతల ఏమంటున్నారంటే...
తిరుపతి లడ్డూ వ్యవహారమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇంతవరకు ఎటువంటి కామెంట్ చేయకపోయినా ఆమె పార్టీ నేతలు మాత్రం గత పాలకులు పాపం చేశారంటున్నారు. "టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, ఆనాటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి" అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ఆంజనేయరెడ్డి. వైఎస్ జగన్ పాలనలో తిరుమల ఆలయ పవిత్ర భగ్నమైందన్నారు ఆయన. బీజేపీకి చెందిన కొంపల్లె మాధవీ లత ఇంకో అడుగుముందుకు వేసి దేశంలోని హిందువులంతా కళ్లు తెరవాలన్నారు. జగన్ పాలన అంతా హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిందన్న అర్థం వచ్చేలా బీజేపీ, దాని అనుబంధాల సంఘాల వాదన ఉంది. దీనంతటికీ కారణం వైఎస్సార్ కుటుంబం క్రిస్టియన్ మతాన్ని ఆచరించడమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. "వైవీ సుబ్బారెడ్డి 40 సార్లు అయ్యప్ప మాల వేసినా ఆయన భార్య చేతిలో బైబిల్ ఉండనే ఉంది కదా" అని చంద్రబాబు సైతం వ్యాఖ్యానించడంతో ఇప్పుడందరి వేళ్లూ జగన్ వైపు చూపుతున్నాయి.
ఇప్పుడేమీ ఎలక్షన్లు లేవు. జగన్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలు సాగుతున్నాయి. అంటే దీనర్థం చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న వ్యూహమా అన్పిస్తోందని వైసీపీ గుంటూరు జిల్లా నాయకుడు ఎస్.రఘురామిరెడ్డి అన్నారు. చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా కాగల కార్యాన్ని బీజేపీతో చేయిస్తున్నట్టుగా ఉందన్నది వైసీపీ నేతల అనుమానం.