Naara Bhuvaneswari | కుప్పానికి భావినేత ఎన్టీఆర్ కూతురేనా?

రాజకీయ యవనికపై కుప్పం ప్రాధాన్యం చెరపలేనిది ఈ కేంద్రంపై సీఎం చంద్రబాబు (Cm Chandrababu) భార్య మళ్లీ నాలుగు రోజుల పర్యటనకు మళ్లీ రేపు రానున్నారు.;

Byline :  The Federal
Update: 2025-03-25 11:30 GMT

కుప్పంపై నారా కుటుంబం గతానికి భిన్నంగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించారు. ఆయన భార్య భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనకు నాల్గవసారి బుధవారం రానున్నారు. ఆమె వరుస పర్యటనలపై పార్టీ వర్గాల్లో స్పష్టత ఉన్నా, బయటికి మాట్లాడడం లేదు.


వినూత్న కార్యక్రమాలకు కుప్పం ఓ ప్రయోగశాలగా మార్చారు. కుప్పం గతానికి భిన్నంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వాటిని కొనసాగింపు, సమీక్షలతో ఆయన భార్య భువనేశ్వరి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉండవచ్చు. కానీ, భవిష్యత్తుకు మరింత బలమైన బాట వేసుకుంటున్నట్లే భావిస్తున్నారు.

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోపుడుబండ్లు, మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేస్తున్నారు. వారితో పాటు రైతులతో కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమాలు భవిష్యత్తుకు మరింత బలంగా రాజకీయ బాట వేసుకోవడమే అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట.
సీఎం చంద్రబాబు వయసు కూడా పైనబడింది కదా సార్. మదనపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ మైనారిటీ విభాగం నేత చేసిన వ్యాఖ్య ఇది. "రాజకీయ పరిస్థితి గమనిస్తే, భువనమ్మ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది" అని కూడా అభిప్రాయపడ్డారు.
రోజుల వ్యవధిలోనే...
కొన్ని రోజుల కిందట కుప్పంలో జరిగిన తిరుణాలకు నారా భువనేశ్వరి ఒకరోజు పర్యటనకు వచ్చి వెళ్లారు. మళ్లీ మూడు రోజుల పర్యటనకు బుధవారం ఆమె రావడం వెనుక భవిష్యత్ వ్యూహం ఉందనే అభిప్రాయాలకు బలం ఇస్తోంది. ఇప్పటి వరకు నారా భువనేశ్వరి సాగించిన పర్యటనల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మాత్రమే పల్లెల్లె పర్యటనలు, మహిళలు, విద్యార్థులతో ముఖాముఖికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాయంత్రం విశ్రాంతి సమయంలో పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కావడం ద్వారా రాజకీయ పరిస్థితిని వాకబు చేయడంతో పాటు, పార్టీ స్థితిగతులు తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.
కుప్పం ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు రవి మాట్లాడుతూ, "రానున్న కాలంలో సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పం రాజకీయ తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేడు భువనేశ్వరి పర్యటన ఇలా..
సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనకు బుధవారం కుప్పం రానున్నారు.
మార్చి 26 : హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వస్తారు. కుప్పం ప్రాంతంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం గుడిచెంబగారి గ్రామానికి వెళ్లి, అక్కడి మహిళలతో మాటామంతీ ఉంటుంది. సాయంత్రం అతిథి గృహానికి చేరుకున్న తరువాత పార్టీ ప్రధాన నేతలు, నియోజకవర్గ సమన్వయ కమిటీతో భేటీ అవుతారు.
మార్చి 27 : కుప్పంలో సమస్యలపై ప్రజల నుంచి వినతపత్రాలు స్వీకరించడం, ఇండియన్ బ్యాంకు శాఖను ప్రారంభించడం, ఎన్టీఆర్ కాలనీ, మధ్యాహ్న భోజనం తరువాత కృష్ణదాసరిపల్లె, జరుగుపల్లెల్లో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సాయంత్రం కుప్పం పట్టణంలో ఓటర్లను ప్రభావితం చేయదగిన నేతలతో ప్రత్యేకంగా సమీక్షిస్తారు.
మార్చి 28 : ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించే నారా భువనేశ్వరి అనంతరం శాంతిపురం మండలం నడింపల్లె, గుంజార్లపల్లె పంచాయతీ నక్కనపల్లెల్లో పర్యటించి, మల్బరీ తోటలను పరిశీలించడం తోపాటు రైతులతో మాట్లాడేందుకు వీలుగా కార్యక్రమాలు ఖరారు చేశారు. రామకుప్పం మండలంలో రావుపేట, కంగనపల్లెల్లో కూడా మహిళలతో సమావేశంలో పాల్గొంటారు.
మార్చి 29 : కుప్పంలో షాహి గార్మెంట్ పరిశ్రమ ( Shahi Garment Industry in Kuppam )ను సందర్శించే నారా భువనేశ్వరి అక్కడి మహిళలతో మాటామంతీ సాగిస్తారు. ఆ తరువాత టీటీడీ కల్యాణమండపం (TTD Kalyana Mandapam ) లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు తోపుడుబండ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన తరువాత బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణం అవుతారని ఎన్టీఆర్ ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
వరుస పర్యటనలు...
కుప్పం నియోజకవర్గం నుంచి సీఎం నారా చంద్రబాబు ఎనిమిదిసార్లు విజయం సాధించి, రికార్డు సృష్టించారు. గతానికి భిన్నంగా కుప్పం కోసం ఆయన భార్య భువనేశ్వరి కూడా అడుగులు వేశారు. టీడీపీ కూటమి ( TDP alliance) అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది జూలై 26వ తేదీ కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్య చేయడం ప్రస్తావనార్హం.
"టీడీపీ కార్యకర్తల కోసం ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని చెబుతూనే, వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల్లో ప్రతిఒక్కరూ కోల్పోయిన స్వాతంత్ర్యం కోసమే ఈ ఎన్నికల్లో కూటమికి అఖండ మెజారీటీ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబుకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ణతలు చెప్పడం తెలిసిందే. వారి వ్యూహం వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. రాబోయే కాలానికి నారా భువనేశ్వరి బరిలోకి దిగే అవకాశాలను కూడా రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. కుప్పం రాజకీయాలను దగ్గరగా పరిశీలించే వారు కూడా నారా భువనేశ్వరి భవిష్యత్ కార్యాచరణతోనే ప్రజలతో మమేకం అవుతున్నట్లు చెబుతున్నారు.
1989 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎన్. చంద్రబాబు 2024 ఎన్నికల వరకు అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్నారు. అక్కడి నాయకులతో ప్రధానంగా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. కీలక నేతలు కూడా చంద్రబాబుకు ఆత్మహుతి దళం సభ్యులుగా పని చేస్తున్నారంటే అతిశేయోక్తి కాదు.
2024 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆరు నెలల వ్యవధిలో రెండోసార్లు సీఎం చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి సీఎం చంద్రబాబు అంతకంటే ముందు ఆయన భార్య నారా భువనేశ్వరి గతంలో ఉన్నడూ లేనివిధంగా వరుస పర్యటనలు సాగించారు.
మాజీ సీఎం వైఎస్. జగన్ కుప్పంను టార్గెట్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆ ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు పర్యటనలు చేస్తే, భర్తకు తోడుగా నారా భువనేశ్వరి రంగంలోకి దిగడం, వారి కొడుకు మంత్రి నారా లోకేష్ కూడా కుప్పంలో విస్తృతంగా పర్యటించి, పార్టీ నేతలు, క్యాడర్లో కొత్త శక్తి నింపారని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా..
మహిళలు.. యువత లక్ష్యంగా..

కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఇప్పటికే మూడు పర్యటనల్లో మహిళలు, యువతను ఆకర్షించే యత్నంలో సఫలం అయ్యారు. ప్రతి గ్రామంలో ఆమెకు మహిళలు చీరె,సారె అందించి, బ్రహ్మరథం పట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాదే జూన్ 25వ తేదీ కుప్పం వచ్చిన సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు బిజీ షెడ్యూల్ తో గడిపారు. గతానికి భిన్నంగా నాయకులే కాదు. ప్రజలతో మరింతగా మమేకం అయ్యారు. ఆయన వెళ్లిన కొద్దిరోజులకే.. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నియోజవ్గర్గంలోకి అడుగు పెట్టారు. మూడు రోజుల పాటు సాగించిన పర్యటనలతో మహిళలకు చేరువ కావడంలో సఫలం అయ్యారు.
2024 డిసెంబర్ 19వ తేదీ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ హోదాలో సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నాలుగు రోజులు కుప్పం నియోజకవర్గంలోనే మకాం వేశారు. ఈసారి పర్యటనలో కూడా మహిళలు, యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, కర్తవ్య బోధ చేయడమే కాదు. ట్రస్ట్ ద్వారా మహిళల స్వయం ఉపాధికి ఊతం ఇచ్చారు.
ధైర్యం చెబుతూ.. కర్తవ్య బోధ
"చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది మహిళలే. వారి శక్తి అపారం. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే" అని మహిళా శక్తిని గుర్తు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో మహిళలతో ముఖాముఖికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఈ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో కుప్పంలో సీఎం చంద్రబాబు మాటనే వేదంలా అమలు చేసే నాయకులతో పాటు ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్ అందరిని సమన్వయం చేయడంలో సఫలం అయ్యారు. 13 మంది లబ్ధిదారులకు రూ. 85 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో పాటు శాంతిపురం మండలంలో వెలుగు మండల మహిళా సమాఖ్యకు రూ.6.70 కోట్ల రుణాలు కూడా పంపిణీ చేయడం గమనించతగిన విషయం. చిరు వ్యాపారులకు తోపుడుబండ్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా ఆమె వారి మనసులను దోచుకున్నారు.
బాబుకు తోడుగా...
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భర్తకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీగా ఆయన భార్య భువనేశ్వరి కూడా ప్రత్యేకదృష్టి సారించారు. వారిద్దరి వరుస పర్యటనలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కుప్పం ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు రవి మాట్లాడుతూ, రానున్న కాలంలో సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పం రాజకీయ తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిస్థితి ఏమిటి అంటే? సమాధానం లేదు. దీనిపై టీడీపీలో ప్రధానంగా నాలుగు దశాబ్దాలకు పైగానే చంద్రబాబు వెంట సాగుతున్న నేతలకు కూడా ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయనే అభిప్రాయం ఆ జర్నలిస్టు వ్యక్తం చేశారు.
బాబు మాటే వేదం..
కుప్పం ప్రాంతంలో క్యాడర్ బలంగా ఉండడం టీడీపీకి ఓ వరం అనిచెప్పవచ్చు. అంతేకాకుండా, కంగుంది ప్రాంతానికి చెందిన నేత చంద్రబాబు క్లాస్మేట్ కావడంతో పాటు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, సీఎం చంద్రబాబు పీఏ మనోహర్, మండల స్థాయి నాయకులు పార్టీకి ప్రధానంగా నారా కుటుంబానికి పెట్టని గోడల్లా నిలుస్తారు. బాబు మాటే వారికి వేదం. అందులో సందేహం లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలు, దళితులు టీడీపీ పక్షాన నిలుస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ తరువాత వైసీపీకి మారిన నేతలతో పాటు కార్యకర్తలు కూడా బలంగా నిలబడే వారే అయినా, చంద్రబాబు కోటరీ ముందు వారి శక్తి చాలడం లేదు. అదీకాకుండా, వైసీపీ ప్రయోగించిన బీసీ మంత్రం కూడా కలిసి రాలేదు. ఈ పరిస్థితుల్లో తమ ప్రాబల్యం, బలం నిరూపించుకుంటూనే టీడీపీ సారధిగా సీఎం చంద్రబాబు భవిష్యత్ వ్యూహాల రచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Similar News