మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ శకం ముగిసినట్టేనా?
నెల్లూరు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఈ సారి టికెట్ రాలే. టీడీపీలో చేరిన కోటంరెడ్డికి ఖాయమైంది. ఆనంకు ఖరారైంది. కారణం ఏమిటి.;
By : The Federal
Update: 2024-03-19 13:44 GMT
జి. విజయ కుమార్
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కాలంగా ఆ కుటుంబం నెల్లూరు జిల్లా రాజకీయాలను ఏలుతోంది. ఆనం సోదరులు మాదిరిగానే మేకపాటి సోదరులు కూడా అన్యోనతకు మారు పేరుగా చెబుతారు. ఒకే మాటపై నిలబడటం, ఒకే బాటలో నడవడం వీరి ప్రత్యేకత. అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఢిల్లీ రాజకీయాల్లోను, తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోను చక్రం తిప్పుతూ వచ్చారు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకలుగా ఉన్న ఈ సోదరుల మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఆస్తి తగాదాలు, పెళ్లి, కుటుంబ వ్యవహారాలు వంటి అంశాలు వీరి మధ్య గ్యాప్‌ను పెంచాయి. కలవ లేనంతగా ఎడబాటుకు కారణమయ్యాయి.
తొలుత రాజమోహన్‌రెడ్డి పొలిటికల్ ఎంట్రీ
తొలుత అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా 1985 ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత ఢిల్లీ వైపు దృష్టి సారించారు. 1989లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అలా నాలుగు పర్యాయాలు ఎంపిగా గెలిచిన ఆయన పార్లమెంట్‌లో కీలక పదవులు కూడా చేపట్టారు. అన్న రాజమోహన్ రెడ్డి గెలుపునకు తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డి బాగా కష్టపడ్డారు. రాజమోహన్‌రెడ్డి ఢిల్లీలో ఉంటే స్థానిక రాజకీయాలు, కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకోవడం వంటివన్నీ తమ్ముడు చూసుకునే వారు. వ్యాపారాలన్నీ రాజమోహన్‌రెడ్డి చూసుకుంటుంటే రాజకీయాలన్నీ చంద్రశేఖర్‌రెడ్డి చక్కదిద్దే వారు. ఇలా రాజకీయ అనుభవం గణించిన తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డిని కూడా రాజకీయాల్లోకి దింపాలని రాజమోహన్‌రెడ్డి భావించారు. అలా 1999లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన వెనుదిరగ లేదు. తిరుగు లేని నాయకుడిగా ఎదిగారు. నాలుగు పర్యాయాలు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. అంతకు ముందే ఆయన భార్య శాంతమ్మతో కలిసి చంద్రశేఖర్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
2019 నుంచే భేదాభిప్రాయాలు
ఎంతో అన్యోనంగా ఉండే మేకపాటి సోదరుల ఇటీవల కాలంలో విడిపోయారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు కారణంగా వారి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. అప్పటి వరకు అంతర్గతంగా కొనసాగిన ఈ విభేదాలు 2022లో ఒక్క సారిగా బహిర్గతం అయ్యాయి. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఇద్దరు భార్యలు. తొలి భార్య తులసమ్మ, రెండో భార్య శాంతమ్మ. ప్రస్తుతం రెండో భార్య శాంతమ్మతోనే చంద్రశేఖర్‌రెడ్డి ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకోవడం అన్న రాజమోహన్‌రెడ్డి ఇష్టం లేదు. అయినా చంద్రశేఖర్‌రెడ్డి ముందుకెళ్లారు. శాంతమ్మతోనే ఉంటున్నారు. ఇది నచ్చని రాజమోహన్‌రెడ్డి వారిని దూరం పెట్టడం చేశారు. ఇదే మేకపాటి సోదరుల ఎడబాటుకు అసలు కారణంగా చెబుతారు.
చక్రం తిప్పిన శాంతమ్మ
నాలుగు పర్యాయం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గెలిచిన అనంతరం ఆయన భార్య శాంతమ్మ రాజకీయాల్లో జోక్యం పెరిగింది. స్థానికులు, నియోజక వర్గ ప్రజలు ఏదైనా ఆపద వచ్చినా, సహాయం కోసం చంద్రశేఖర్‌రెడ్డిని కాకుండా ఆమెను ఆశ్రయించేవారు. అలా ఆమె నియోజక వర్గంలో షాడో చంద్రశేఖర్‌రెడ్డిగా మారారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఆమె కీ రోల్ పోషించారు. క్రమంగా కీలక నేతగా ఎదిగారు. నియోజక వర్గంలో అన్ని పనులు ఆమె చక్కదిద్దుతోందని, దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె రంగంలోకి దిగనున్నారనే టాక్ అప్పట్లో నడిచింది. ఇది ముదిరి పాకాన పడటంతో అప్పటికే భేదాభిప్రాయాలతో దూరంగా ఉన్న అన్న రాజమోహన్‌రెడ్డి ఆస్తిలో కూడా వాటా ఇవ్వడం నిరాకరించారని చెబుతారు. ఇదే అంశంపై గతంలో మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన భార్య శాంతమ్మలు రాజమోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో తన వాటా ఇవ్వలేదంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. కుటుంబ వ్యాపారంగా ఉన్న ఒక కంపెనీ కోసం అందరం కలిసి కష్టపడ్డామని ఎందుకు తమకు ఆస్తి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తనకు ఓ కుమార్తె ఉందని తన భవిష్యత్ కోసం ఆస్తి ఇవ్వాలని మీడియా ముందు ఏడుస్తూ చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలను మేకపాటి కుటుంబం అప్పట్లో తీవ్రంగా ఖండించింది.
ఎటూ కాకుండా పోయిన చంద్రశేఖర్‌రెడ్డి
అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డితో నెలకొన్న విభేదాలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన చంద్రశేఖర్‌రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ వీడాలనే కారణంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారని అప్పట్లో టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో టీడీపీలోకి వెళ్లి టికెట్ పొందాలని ప్రయత్నించారు. అక్కడ కూడా మొండి చేయి చూపించారు. మరో వైపు ఆయనతో పాటు పార్టీ వీడిన కోటంరెడ్డికి, ఆనంకు టీడీపీ టికెట్లు ఖరారు చేసింది. కానీ చంద్రశేఖర్‌రెడ్డికి సీటు ఇవ్వలేదు. దీనికి ఆయన భార్య శాంతమ్మ కూడా ఒక కారణంగా చెబుతారు. దీంతో నెల్లూరు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన చంద్రశేఖర్‌రెడ్డి అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీ సీటు దక్కక పోవడంతో ఆయన రాజకీయ శకం ఇక ముగిసినట్టేనా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.