సజ్జల వ్యాఖ్యలు ఈసీకి ఛాలెంజా .. తామే గెలుస్తామన్న ధీమా..!

ఆంధ్రలో వాతావరణం చట్టబడినా రాజకీయ వాతావరణం ఎన్నడూ లేనంత వేడిగా ఉంది. రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది.

Update: 2024-06-03 13:32 GMT

ఆంధ్రలో వాతావరణం చట్టబడినా రాజకీయ వాతావరణం ఎన్నడూ లేనంత వేడిగా ఉంది. రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఎక్కడా ఏమాత్రం అల్లర్లు జరగకుండా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీల నేతలతో పోలీసులు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్శహించి మరీ హెచ్చరికలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా విజయోత్సవ సంబరాలు చేసుకోవద్దంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

విజయోత్సవాలకు నో

ఇప్పటికే ఇరు పార్టీల శ్రేణులు భారీగా బాణాసంచా కొని పెట్టుకున్నాయి. తమ నేత అధిక్యంలో ఉన్నా, గెలిచినా భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవాలని, ర్యాలీలు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలో వారిని రాష్ట్ర ఎన్నికల అధికారి పిడుగులాంటి వార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సంబరాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా ఈ నిబంధనలను కాదని ర్యాలీలు వంటి నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. పోలీసులు వీటిని కనిపెట్టుకుని ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు.

మా సంబరాలు రేపు ఉంటాయి: సజ్జల

ఒకవైపు విజయోత్సవ సంబరాలకు నో చెప్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తమ సంబరాలు రేపు మొదలవుతాయంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అవన్నీ తప్పుడు సర్వేలేనంటూ కొట్టిపారేశారు. ‘‘తప్పుడు సర్వేలను చూసి టీడపీ ఎగిరెగిరి పడుతోంది. వాళ్ల సంబరాలన్నీ తాత్కాలికం మాత్రమే. అసలు సంబరాలు ఏంటో రేపు మేం చేసి చూపుతాం. మా సంబరాలు చూసీ టీడీపీ మూలన కూర్చుని ఎక్కిఎక్కి ఏడ్వటం ఖాయం’’ అని వైసీపీ గెలుపుపై మరోసారి ధీమా వ్యక్తం చేశారు సజ్జల.

ఈసీవన్నీ తప్పుడు నిబంధనలే

ఈ సందర్భంగానే ఆయన ఎన్నికల సంఘం తీసుకొస్తున్న నిబంధనలను కూడా తప్పుబట్టారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఎన్నికల సంఘం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. ‘‘టీడీపీ.. బీజేపీతో జతకట్టినప్పటి నుంచి ఈసీ.. టీడీపీకి అనుకూలంగా మారింది. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ తీవ్రంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఈసీ అన్ని పనులను నిబంధనలకు విరుద్దంగానే చేస్తోంది. చంద్రబాబు సూచనల మేరకు అధికారులపై ఒత్తిడి తెచ్చింది ఈసీ. ఎవరు ఎన్ని కుట్రపూరిత పాచికలు వేసినా అవి ప్రజల ముంగిట పారవు. మరోసారి వైసీపీనే గెలుస్తుంది. వైసీపీ బలమైన పార్టీ.. భారీ మెజారిటీ గెలవబోతోంది. సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న ప్రచారం అంతా ఒక్కరోజు వరకే. చంద్రబాబు జూన్ 4న విడుదలయ్యే పిక్చర్ బాగా తెలుసు. అందుకే సైలెంట్‌గా ఉన్నారు. లోకేష్ కూడా అడ్రెస్ లేకుండా పోయారు’’ అంటూ విమర్శలు గుప్పించారు సజ్జల.

సజ్జలది ఈసీకి ఛాలెంజా..!

విజయోత్సవాలకు ఈసీ నో చెప్పిన తర్వాత తమ సంబరాలు ఏంటో రేపు చూపిస్తాం అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తన వ్యాఖ్యల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీకి సవాల్ విసురుతున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. వైసీపీ విజయోత్సవాలను ఎవరూ అడ్డుకోలేరని, ఎవరు ఎన్ని చెప్పినా రేపు వైసీపీ విజయోత్సవాలు జరుగుతాయనే సజ్జల అంటున్నారా? అన్న అనుమానాలకు ఆయన వ్యాఖ్యలు తావిస్తున్నాయని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News