సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర టూర్‌ రహస్యం ఇదేనా?

సీఎం చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర పర్యటన వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటి? అందుకే ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నారా?

Update: 2024-11-02 06:44 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన అంశాల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఒకటి. ఎంతో మంది బలిదానాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద కేంద్రం కన్నేయడం, దానిని ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి రంగం సిద్ధం చేడయం, అందులో భాగంగా వేలాది మంది సిబ్బందిని తొలగించడం వంటి అనేక అంశాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిత్యం వార్తల్లో నానింది. దీనిని కాపాడుకునేందుకు రోజుల తరబడి పోరాటాలు సాగించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఈ డ్యామేజ్‌ను ప్యాచ్‌అప్‌ చేసేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. సరిగ్గా ఇదే ప్రాంతంలో ఒక ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను తెరపైకి తెచ్చారు. దీనిని ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. స్టీల్‌ రంగంలో బడా పారిశ్రామిక వేత్తలు ఈ సంస్థను పెడుతారనే టాక్‌ వినిపిస్తోంది. ఉక్కు రంగంలో దిగ్గజాలైన ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థతో పాటు జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీలు ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దశల వారీగా దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నారని, పెట్టుబడులు, సంస్థ ఏర్పాటు వంటి పలు అంశాలపై సీఎం చంద్రబాబు నేడు కీలక ప్రకటన చేయనున్నారని, అందువల్లే ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నట్లు తెలిసింది.

ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపులపై ఇది వరకు ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అనకాపల్లి దగ్గర బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ కేటాయించిన 2వేల ఎకరాల్లో కొంత భూములు, విశాఖ–చెన్నై పారిశ్రామికవాడ ఏర్పాటులో భాగంగా నక్కపల్లి పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూములతో కలిపి దాదాపు 5వేల ఎకరాలను ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ పరిశ్రమ కోసం కేటాయించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News