విజయసాయి స్థానం జనసేనకేనా?

ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం ఏ పార్టీకి దక్కుతుందనేది చర్చగా మారింది.;

Update: 2025-01-26 12:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలూ ఎన్నికల ముందు వరకు వైఎస్సార్సీపీ అధీనంలో ఉండగా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓడిపోగానే ముగ్గరు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరితే ఒకరు బీజేపీలో చేరారు. ఒకరు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పరిమళ్ నత్వానీ అనే వ్యక్తికి రాజ్యసభ సభ్యునిగా నియమించారు. ప్రస్తుతం ఏడుగ్గురు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఉండగా ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నారు. ఒకరు బీజేపీ తరపున గెలిచారు. పరిమళ్ నత్వానీ కూడా పేరుకు వైఎస్సార్సీపీ అయినా బీజేపీ కిందనే లెక్కించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్సార్ సీపీ బలం ఆరుగ్గరు సభ్యులు మాత్రమే.

రాజ్యసభకు ఎన్నికైన వారు వైఎస్సార్ సీపీ ని ఎందుకు వీడుతున్నారు?

వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ముగ్గరు రాజ్యసభ సభ్యులు ఒకేసారి రాజీనామా చేసి కూటమిలో చేరటం ఆపార్టీకి పెద్ద విపత్తుగా చెప్పాల్సి ఉంటుంది. వారిలో ఒకరైన బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. నెల్లూరుకు చెందిన మస్తాన్ రావు వ్యాపార వేత్త. ఆక్వా, ఫిష్ వంటి సముద్ర ఉత్పత్తులు ఆహారశుద్ధి (Food Process) చేసి ఎగుమతులు చేస్తుంటారు. రాజీనామా చేసిన పోస్టులోనే తిరిగి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిచారు. మోపిదేవి వెంకటరమణ తిరిగి పోటీ చేయలేదు. ఆ స్థానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ బాబు తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపున నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఎందుకు పార్టీని వీడారనేది చర్చగా మారింది. వీరు చెప్పిన అంశాల ప్రకారం వైఎస్ జగన్ తమ మాటలు పట్టించుకునే వారు కాదని, మంచి చెప్పినా వినీ విననట్లు ఉండే వారని, అందుకే పార్టీని వీడినట్లు చెప్పారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడారు.

జనసేనకే రాజ్యసభ దక్కుతుందా?

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఏపీలో రాజ్యసభకు ఖాళీ ఏర్పడింది. నోటిఫికేషన్ వెలువడే లోపు అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికవుతాడా? జనసేన పార్టీ నుంచి ఉంటాడా? అనేది ఇప్పుడు చర్చగా మారింది. జనసేన పార్టీకి రాజ్యసభలో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. తమకు రాజ్యసభకు పోటీ చేసే అవకాశం కల్పించాలని జనసేన గట్టిగా కోరుతోంది. బిజేపీ ఎలాగూ జనసేన పార్టీకే సపోర్టు చేస్తోంది. అందువల్ల రాజ్యసభ తెలుగుదేశం పార్టీ వదులు కొంటుందా? లేదా? అనేది వెల్లడి కావాల్సి ఉంది. జనసేనకు టిక్కెట్ కేటాయిస్తే అభ్యర్థి ఎవరనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే నాగబాబును రాష్ట్రంలో మంత్రి పదవి కి ఎంపిక చేశారు. అందువల్ల ఆయనను రాజ్యసభకు పోటీలో ఉంచుతామని ప్రకటించే అవకాశం లేదు.

ఇక చిరంజీవి విషయంలో కొంత చర్చ జరుగుతోంది. రాజ్యసభకు చిరంజీవిని పంపించి ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించాలనే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో ప్రచారం కూడా జరుగుతోంది. అదేంటంటే.. పవన్ కల్యాణ్ రాజ్య సభకు పోటీ చేసి కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకునే ఆలోచనలో ఉన్నారని, ఈ ఆలోచన బీజేపీ నుంచి వచ్చినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే ఉప ముఖ్యమంత్రి పదవి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారు. ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని నారా లోకేష్ కు కేటాయించే అవకాశాలు ఉణ్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీల్లో రాజకీయాలు ఎలా ఉన్నా విజయసారిరెడ్డి రాజీనామా, తరువాత జరిగే పరిణామాలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. ఎప్పుడు ఏ కొత్త వార్త వస్తుందోననే ఆతృత జనంలో ఉంది.

Tags:    

Similar News