కాంగ్రెస్‌కు… ఊపిరి పోస్తున్న ఫ్యాన్...!

అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల రెడ్డి ఊపిరిపోస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది.

Update: 2024-04-06 14:39 GMT
కాంగ్రెస్‌లో చేరిన ఎంఎస్ బాబు


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)


తిరుపతి: సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రగులుకుంటుంది. అభ్యర్థిత్వాలు ఖరారు చేసిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమలో గట్టిగా షాక్ తగులుతోంది. అధికార పార్టీకి ఆ సెగ ఎక్కువగా ఉంది. పార్టీని వీడుతున్న వారికి అదృష్టం కలిసి వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు. టిడిపిని వీడుతున్న వారు వైఎస్ఆర్సిపిలోకి క్యూ కడుతున్నారు. ఆ కోవలో ఇంకొంతమంది ఉన్నట్టు సమాచారం. అధికార వైఎస్ఆర్సిపినీ వీడుతున్న వారిలో ఎక్కువమంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల వైఎస్ఆర్సిపి అధినేతలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. "ఉంటే ఉంటారు. పోతే పోతారు" అనే విధంగానే వాతావరణం కనిపిస్తోంది.

ఆపద్బాంధవుడిలా..

అధికార వైయస్సార్సీపి నుంచి బయటకు వస్తున్న మాజీ ప్రజా ప్రతినిధులు, మళ్లీ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఆపద్బాంధవుడిలా అనిపిస్తోంది. రాజకీయాల్లో కొనసాగాలనే ఆశయం కంటే, రాజకీయ పునరావాసానికి కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం ఉందని ధైర్యంతో అధికార పార్టీని వీడుతున్నట్లు కనిపిస్తోంది. పదవులు దక్కవనే నిరాశ కంటే, ఏదో ఒక పార్టీలో ఉండి తమ అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా... తమను నిర్లక్ష్యం చేసిన వైసీపీకి గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఊపిరి పోస్తున్న కాంగ్రెస్

వారి ఆశలకు కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోస్తోంది అనడంలో సందేహం లేదు. అందులో ప్రధానంగా అధికార పార్టీని వీడుతున్న వారందరూ గతంలో కాంగ్రెస్ నేతలతో, పార్టీలో మెలిగిన వారే.. వారి అదృష్టవశాత్తు ఎన్నికల వేళ కాలం కలిసి వచ్చింది. ఇది కూడా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల రెడ్డి పిసిసి అధ్యక్షురాలిగా రావడమే. అధికార ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యం, వివక్షకు గురైన వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కు పాతర

రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పాతర వేశారు. ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడం ద్వారా తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహాన్ని నవ్యాంధ్రలో ఓటు ద్వారా గట్టిగా జవాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కోలుకోలేని దెబ్బ తగిలింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ నుంచి సీఎంలుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి వంటి నాయకులు వెలుగొందిన గడ్డపై రాష్ట్రంలో చక్రం తిప్పిన నేతలు, కేంద్రంలో వెలుగు వెలిగిన వారందరూ.. ఎక్కడున్నారో కూడా తెలియకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. "వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి.. సంక్షోభాలు కొత్తేమీ కాదు. మళ్లీ లేచి నిలబడతాం" అనే ధీమాతోనే ఆ పార్టీ నాయకులు కాలం గడిపారు.

కలిసొచ్చిన కాలం..

కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టి ఒంటిచేత్తో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత దివంగత సీఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంపశయ్య పైకి చేరింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో.. దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె ఆశాదీపంలా దిగొచ్చారు. అనూహ్య పరిణామాల మధ్య వైయస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ అదనుగా భావించిన ఏఐసీసీ కమాండ్ ఆమెకు ఏపీసిసి సారథ్య బాధ్యతలను అప్పగించింది.

షర్మిలారెడ్డి రాక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాడిన పడింది. టికెట్లు దక్కక, అభ్యర్థిత్వాలు ఖరారు కానీ అధికార ప్రతిపక్షాల నేతలు కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పదవులకు రాజీనామా చేసిన మాజీ ప్రధాని ప్రజాప్రతినిధులు కూడా చేరుతుండటం కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడానికి, పుంజుకోవడానికి మార్గం ఏర్పడింది. అధికార ప్రతిపక్ష పార్టీల్లో నిర్లక్ష్యానికి గురైన వారు రావడమే ఆలస్యం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ కండువా చేసి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఆ కోవలో..


వైఎస్ఆర్సిపికి షాక్

రెండు నెలల కింద వరకు టిడిపి, వైయస్సార్ సీపీలో నిర్లక్ష్యానికి గురైన వారికి ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. 2024 ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేల పేరుతో సిట్టింగ్లకు అదికూడా.. దళిత బీసీ సామాజిక వర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. " తమను ఎవరు పట్టించుకోవడం లేదు" అని నిర్లక్ష్యానికి గురైన ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో అక్రోశం వెళ్లగక్కారు. నిరాదరణకు గురైన వారంతా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు.

ఆ కోవలో..

పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెస్ బాబుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఎం ఎస్ బాబు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గట్టిగా స్వరం వినిపించారు. " సర్వే నివేదికలు అనేది దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పనిచేస్తుందా? పట్టపగలు సహజ వనరులను దోచుకున్న వారి నియోజకవర్గాల ఎందుకు మార్చడం లేదు" అని కూడా ఆయన నిగ్గదీశారు. కొంతకాలం వేచి చూసిన ఆయనకు వైఎస్ఆర్సిపి నుంచి ఎలాంటి స్పందన లేని స్థితిలో... కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే బాటలో..

ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీ అధిష్టానం పై అసంతృప్తితో సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైయస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె తల్లి, మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు శమంతకమణితో కలిసి నాలుగేళ్ల క్రితం వైయస్సార్ సీపీలో చేరారు. శమంతకమణి టిడిపిలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈమె కుమార్తె యామిని బాల టిడిపి ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. టిడిపిలో నిరాదరణకు గురైన వారిద్దరూ.. వైఎస్ఆర్సిపిలో చేరారు. 2024 ఎన్నికలకు అభ్యర్థిత్వం దక్కని స్థితిలో యామిని బాల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ మేరకు "పార్టీ కార్యాలయానికి లేఖ పంపాను" అని ఆమె విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి టికెట్ దక్కలేదు. ఆ స్థానాన్ని ఆశించిన యామిని బాల ఆసరా కూడా నెరవేరలేదు. అనూహ్యంగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక్బాల్ దారెటు..?

షేక్ మహమ్మద్ ఇక్బాల్. పోలీసు శాఖలో మంచి పేరు ఉన్న అధికారి.ఆయన ఉద్యోగ విరమణ అనంతరం వైఎస్ఆర్సిపి లో చేరడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఎందుకంటే... టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో సెక్యూరిటీ ఆఫీసర్ గా వెళ్లారు. ఏసిపి గా ఉన్న ఆయనకు డీసీపీగా పదోన్నతి కల్పించి, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా కొనసాగించారు. ఉద్యోగ విరమణ అనంతరం షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైయస్ఆర్సీపీలో చేరారు. హిందూపురం శాసనసభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.

అంతేకాకుండా, హిందూపురం పార్లమెంటు ఇన్చార్జిగా ఉన్న ఆయనను తప్పించి దీపికను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో తన ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు ఇక్బాల్ మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. దీంతో ఆయన అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన నిర్లక్ష్యం చేస్తున్నారని భావించారు ఏమో..! 2027 వ సంవత్సరం వరకు ఉన్న తన ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని కూడా కాదనుకొని పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇక్బాల్ ప్రకటించారు. " తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు" ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఇది వైఎస్ఆర్సిపి కి ఒక గుణపాఠం లాంటిదేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మద్ ఇక్బాల్ టిడిపి వైపు వెళ్లే అవకాశం లేకపోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

టిడిపికి దెబ్బ

అనంతపురం జిల్లాలో టిడిపికి కూడా గట్టి దెబ్బ తగిలింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో తనకు అభ్యర్థిత్వం దక్కని స్థితిలో.. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైయస్ఆర్సీపీలో చేరారు. అభ్యర్థిత్వం దక్కక తీవ్ర నిరాశ చెందిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా ఆ పార్టీని వీడారు. దీంతో అనంతపురం జిల్లాలో అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఫిరాయింపుల ఫోటో ఎక్కువగానే ఉంది. అదేవిధంగా గుంతకల్లు, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం శాసనసభ స్థానాల్లో టిడిపికి తలపోటు ఇంకా తగ్గలేదు.

టిడిపి ఆవిర్భావం నుంచి వెంట నడుస్తున్న వారందరూ ఆ పార్టీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలతో పక్కదారి మళుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లలితా థామస్ ఇటీవల టిడిపికి రాజీనామా చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్ఆర్సిపి లో చేరారు. ఇంకొన్ని రోజుల్లో వైఎస్ఆర్సిపి, టిడిపి నుంచి ఏం కొందరు బయటకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. రానున్న రోజుల్లో ఇటువంటి పరిణామాలు ఎన్ని జరుగుతాయో వేచి చూద్దాం.



Tags:    

Similar News