ISRO- Sriharikota- Navik అంతరిక్షంపై 'ఇస్రో' చెరగని సంతకం
అంతరిక్ష ప్రయోగంలో మూడు రికార్డులు నమోదయ్యాయి. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ విజయవంతమైంది.;
2025 ప్రారంభంలోనే ఇస్రో చరిత్రలో మూడు రికార్డులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయోగించిన మొదటి వాహకనౌక. 'నావిక్' Navigation with Indian Constellation (NavIC) కావడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారుచేసిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV-F-15 NVS-02) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగంతో ఇస్రో చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపింది. అంతేకాకుండా ఇస్రో చైర్మన్ గా నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ప్రయోగం కావడం గమనార్హం.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 'నావిక్' (NAVIK) GSLV-F-15 NVS-02 రాకెట్ ఉదయం 6.23 గంటల 2,500 కిలోల బరువు ఉన్న వాహకనౌకను విజయవంతంగా నింగిలోకి తీసుకుని వెళ్లింది. నావిక్ విజయవంతంతో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయానికి ఇస్రో చెరగని సంతకం చేసింది. ఈ ప్రయోగంతో శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో శాస్త్రవేత్తలతో పాటు వేలాది మంది ఉద్యోగుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. సంబరాలు. పరస్పర అభినందనలతో ఆనందం పంచుకున్నారు.