జీవీ రెడ్డి టీడీపీలో చేరుతున్నారనేది ప్రచారమే
ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.;
ఏపీ ప్రభుత్వ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో సంచలనాలకు కారణమైన జీవీ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత కార్పొరేషన్ లో గతంలో జరిగిన లోపాలను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. ఏ ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. అన్ని విషయాలు ప్రజల ముందు ఉంచాలని భావించిన జీవీ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రధానంగా నాలుగు ప్రశ్నలు సంధించారు. వాటికి ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం రాకపోగా ఆయనను చైర్మన్ పదవికి రాజీనామా చేయించారు.
తొమ్మిది నెలల్లో ఒక్క కనెక్షన్ ఇవ్వలేరా?
కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది. వందల మంది ఉద్యోగులు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. తొమ్మిది నెలల్లో ఒక్క ఇంటికి కూడా కొత్తగా కనెక్షన్ ఇవ్వలేక పోయారు. ప్రతి నెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నప్పుడు కనీసం ఒక్క కనెక్షన్ ఎందుకు ఇవ్వలేక పోయారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు. కార్పొరేషన్ ఎండీగా ఉన్న కొత్తమాసు దినేష్ కుమార్ నుంచి కూడా సమాధానం లేదు. ‘ఇది ఇన్కం బేస్ట్ ఆర్గనైజేషన్, ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు. సర్వీస్ ఇవ్వాలి. ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి. తొమ్మిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు’ అని జీవీ రెడ్డి చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన మాటల్లో నిజాయితీ ఉందనే చర్చ కూడా జరిగింది.
78వేల కిలో మీటర్లు ఆప్టిక్ ఫైబర్ ఉంది
ఏపీ ఫైబర్ నెట్ కు పెద్ద నెట్వర్క్ ఉంది. కేబుల్ ఆపరేటర్స్ చెబుతున్న దాని ప్రకారం గతంలో బిజినెస్ చేయకపోయినా నెట్ వర్క్ బాగుండేది. ఇప్పుడు ఆ నెట్ వర్క్ కూడా బాగోలేదని వాపోతున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న మెసేజ్ లకు ఆపరేటర్లు భయపడి పోయి ఫైబర్ నెట్ కార్యాలయానికి వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇంట్లో విద్యుత్ ఎలా అవసరమో ఇంటర్ నెట్ కూడా అంతే అవసరం. ఆగకుండా నెట్ వర్క్ బాగుందంటేనే వినియోగ దారులు తీసుకుంటారు. లేదంటే కనెక్షన్ ఆపివేస్తారు. బాగున్న నెట్వర్క్ కు మారతారు. ఇంట్లో టీవీ చూసేవారికి, ఇంటర్ నెట్ వాడుకునే వారికి ఇబ్బంది రాకూడదు. ప్రభుత్వం తక్కువ ధరకు కనెక్షన్ ఇస్తున్నందున చాలా మంది గతంలో తీసుకున్నారు. ప్రస్తుతం మానేస్తున్నారు.
జీవీ రాజీనామాపై క్యాడర్ లో వ్యతిరేకత
జీవీ రెడ్డిని ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయించడంపై తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకత వచ్చింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దల తీరుపై విమర్శల వర్షం కురిసింది. అధికారుల తీరును పట్టించుకోకుండా చైర్మన్ పై చర్యలు తీసుకోవడం ఏమిటనేది ప్రశ్న.
క్యాడర్ ను సంతృప్తి పరిచేదుకు...
క్యాడర్ ను సంతృప్తి పరిచేందుకు జీవీ రెడ్డిని పార్టీలోకి తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీ సభ్యత్వం జీవీ రెడ్డి తీసుకొంటున్నారనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో షురూ చేశారు. అయితే జీవీ రెడ్డిని పార్టీ పెద్దలు సంప్రదించిన దాఖలాలు లేవు.
ఇదంతా ప్రచారం మాత్రమే: జీవీ రెడ్డి
తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ జీవీ రెడ్డిని సంప్రదించగా ఆయన కొట్టి పారేశారు. తాను రాజీనామా చేయడంపై క్యాడర్ నుంచి వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటువంటి పుకార్లు పుట్టించారని చెప్పారు. తాను తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేదన్నారు. రాజకీయ భవిష్యత్ గురించి ప్రశ్నిస్తే ఇవన్నీ ఇప్పుడు చెప్పటం మంచిది కాదని పేర్కొన్నారు.