జి. విజయ కుమార్
ఆంధ్రప్రదేశ్ సీనియర్ బిజెపీ నేత సోము వీర్రాజు తీవ్ర మస్తాపానికి గురయ్యారు. బిజెపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సీటు దక్క లేదు. బిజెపి అధిష్టానం ప్రకటించిన 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో అటు పార్లమెంట్ సీటుతో పాటు ఇటు అసెంబ్లీ సీటు కూడా దక్కక పోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రాకపోవడంతో ఆ పార్టీలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సీట్ల కేటాయింపుల అంశంలోనే ఆయన తీవ్ర మనోవేధనకు గురైనట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే మూడు రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన బిజెపి నాయకుల సమావేశానికి ఆయన హాజరు కాలేదని చర్చించుకుంటున్నారు.
రాజమండ్రి రూరల్ సీటు కోరుకున్న వీర్రాజు
రాష్ర్టానికి చెందిన సీనియర్ బిజెపి నేతల్లో ఒకరు. ఆయన ఆ పార్టీ ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. ఆయన ఎప్పటి నుంచో ఆ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి బిజెపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎంతో ఆశ పడ్డారు. ఆ సీటు కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటును టీడీపీకి కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత గొరంట్ల బుచ్చయ్య చౌదరీకి ఆ సీటును కేటాయించారు. దీంతో ఆయన ఆశలకు గండిపడింది. చాలా కాలం ఈ సీటును జనసేనకు కేటాయించాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అనేక పరిణామాల అనంతరం టీడీపీకి కేటాయించారు. ఒక వేళ అది కాకపోతే రాజమండ్రి ఎంపి సీటైనా అడగాలనుకున్నారు. ప్రస్తుత బిజెపి రాష్ర్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కూడా చాన్స్ లేకుండా పోయింది. ఎంతో సీనియర్ నేతైన సోము వీర్రాజుకు ఈ సారి సీటు ఖాయమని అంతా భావించారు. ఆయన సన్నిహితులు కూడా ధీమాతోనే ఉన్నారు. చివరకు దక్కక పోవడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎంతో నమ్మకంగా పార్టీ అభివృద్ధికోసం ఆయన చేసిన సేవలను గుర్తించి సోము వీర్రాజుకు సీటు కేటాయించాల్సిన బిజెపీ అధిష్టానం కూడా సోము వీర్రాజుకు మొండి చేయి చూపించదని అతని సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
తనకంటే జూనియర్లకు సీట్లు
పార్టీలో తన కంటే జూనియర్లకు సీట్లు కేటాయించి తనకు కేటాయించక పోవడం కూడా ఆ పార్టీ శ్రేణులో చర్చనీయాంశంగా మారింది. అలా చేరి ఇలా సీట్లు దక్కించుకున్న తీరుకు, బిజెపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపైన ఆయన తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు చర్చించుకుంటున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కు అలానే సీటు ఖరారుచేశారు. ఆయన బిజెపిలో చేరి ఒక రోజు కూడా కాకుండానే తిరుపతి పార్లమెంట్ సీటును ఖరారు చేశారు. కొత్తపల్లి గీత, సీఎం రమేష్‌తో పాటు ఆఖరుకు మాజీ సిఎం ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి కూడా సోము వీర్రాజు కంటే జూనియర్లే పార్టీలో. అసెంబ్లీ స్థానాల కేటాయింపులు కూడా అలానే జరిగాయి. దీంతో ఆయన తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. సోము వీర్రాజుకు అనారోగ్య కారణాల రీత్యా బిజెపి నేతల సమావేశానికి హాజరు కాలేదని కొంత మంది చెబుతుంటే మరి కొందరు సోము వీర్రాజు పార్టీని వీడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆ పార్టీ అధిష్టానం ఏవిధంగా బుజ్జగించనుంది, ఎలాంటి సముచిత స్థానం కల్పిస్తుందో అనే చర్చ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. `