వంశీ అరెస్ట్ చంద్రబాబు, లోకేశ్ కుట్ర అంటున్న జగన్!
వైసీపీ నాయకుల్ని, వంశీని అరెస్ట్ చేసిన ఏ అధికారినీ వదలం, బట్టలూడదీసి వీధుల్లో నిలబెడతాం, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడని వైఎస్ జగన్ అన్నారు.;
By : The Federal
Update: 2025-02-18 08:44 GMT
వల్లభనేని వంశీ అరెస్ట్.. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారాయన. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు.
మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్‌మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office Case) తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు.
టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించింది కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
పిడుగరాళ్లలో వైస్ చైర్మన్ పదవి విషయంలో ఏం జరిగిందో చూశాం. 33 కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీనే గెలిచింది. అయినా వైఎస్ చైర్మన్ తామే గెలిచామని టీడీపీ ప్రకటించుంది. తునిలో కూడా 30కి 30 స్థానాలు YSRCPనే గెలిచింది. పాలకొండలోనూ ఇలానేే చేస్తున్నారు. అంతటా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.
అధికారులకు జగన్ విజ్ఞప్తి
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ. పారిశ్రామిక వేత్తలను వీళ్లే బెదిరిస్తారు.. మళ్లీ వీళ్లే కేసులు పెడతారు. పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. పోలీసులు చంద్రబాబు చెబుతున్న వాళ్లకు కాకుండా.. టోపీ మీదున్న మూడు సింహాలకు సెల్యూట్ చేయండి. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక అన్యాయం చేసినవారిని వదిలిపెట్టం. అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం. రిటైర్ అయినా.. సప్తసముద్రాల అవతల ఉన్నా రప్పిస్తాం. అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. ప్రజలు, దేవుడు శిక్షించే రోజు దగ్గర్లోనే ఉంది. అన్యాయంలో భాగస్వామ్యం కావొద్దు.
కూటమి నేతల అక్రమ కేసులతో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచింది. కొద్దిసేపటి క్రితమే పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వంశీతో ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. వైయస్ జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ లోపలికి వెళ్లారు. వైయస్ జగన్ రాక సందర్భంగా జైలు వద్ద కోలాహలం నెలకొంది.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వంశీ ఉంటున్న జైల్ వద్దకు వైయస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జైలు వద్ద అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలు పరిసరాలకు 500 మీటర్లలోపు ఎవరినీ ఉండనివ్వకుండా వెళ్లగొడుతున్నారు. తొలుత జైలు వద్దకి వచ్చిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కారును అడ్డుకుని.. ఆమెను నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లనూ అడ్డుకున్నారు. ఇంకోవైపు.. మీడియా ప్రతినిధులను కూడా అక్కడ ఉండనివ్వకుండా పోలీసులు దూరంగా పంపించి వేస్తుండడం గమనార్హం.