పార్టీ ఆఫీసుల నిర్మాణంలోనూ గురుశిష్యులది ఒకటే రూటు!

గురుశిష్యుల మధ్య మరో పోలిక బయటపడింది. కేసీఆర్‌లాగే జగన్ కూడా పార్టీ కార్యాలయాల పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడబెట్టారు.

Update: 2024-06-23 08:57 GMT

గురు శిష్యులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలకు చాలా పోలికలు ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమ హయాంలో సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కీలుబొమ్మలుగా మార్చి తమను చూసే ప్రజలు ఓటు వేస్తారని ఊహించుకున్నారు. తమను తాము అలనాటి రాజులలాగా ఊహించుకుని, ఆ అహంకారానికి మొన్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. అయితే తాజాగా వారి మధ్య మరో పోలిక బయటపడింది. కేసీఆర్‌లాగే జగన్ కూడా పార్టీ కార్యాలయాల పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడబెట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాలు ఉండేవిగానీ జిల్లాలలో పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశానికి ప్రధాన కార్యాలయం సొంత స్థలం, సొంత భవనంలోనైనా ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లీజు తీసుకున్న స్థలంలోనే ఉంది. దానిని సొంత స్థలంలో అధునాతన భవనంలో ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారుగానీ, అది సాకారమవలేదు.

కేసీఆర్ ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కారు. పార్టీ కార్యాలయాలను కార్పొరేట్ ఆఫీసులలాగా నిర్మించటం ఆరంభించారు. ఆయన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలలో, పాత ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయాల నిర్మాణం మొదలుపెట్టారు. దీనికోసం ఆయా జిల్లా కేంద్రాలలో మంచి సెంటర్‌లలో ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రపు ధరకుగానీ, లీజుకు గానీ ఇచ్చేశారు. అక్కడ మంచి పకడ్బందీగా భవనాలు నిర్మింపజేసి తన చేతులమీదగానే ప్రారంభం కూడా చేసేశారు.

ప్రతి జిల్లా భవనాన్నీ ఒక ఎకరం స్థలంలో 50-60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. అన్ని హంగులతో, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక కార్యాలయం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తగ్గట్టుగా జిల్లా పార్టీ కార్యాలయాలను నిర్మించారు. కేటాయించబడిన స్థలంలో కార్యాలయంతో పాటు, దానికి పక్కనే వందలమంది కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి సమావేశ మందిరాలు నిర్మించారు. పక్కనే కిచెన్ షెడ్డులను, స్నానాల గదులను, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు.

ఈ స్థలాల కేటాయింపు, భవన నిర్మాణాలు ఎలా జరిగాయో తెలుసుకోవటానికి వరంగల్ నగరాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. వరంగల్ జిల్లాలో జిల్లా ప్రధాన కార్యాలయం కడతామంటూ అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఖమ్మం హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ నేతలకు ఎకరం స్థలం ఇవ్వాలని జీఓ 48, 167, 158 నంబర్లతో ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది మే 11న బీఆర్ఎస్ పార్టీ పేరుతో కలెక్టర్ నన్నపనేని నరేందర్‌కు స్థలం కేటాయించారు. అదే నెల 20న మంత్రి కేటీఆర్ ముఖ్యం అతిథిగా హాజరై పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కానీ ఇప్పటివరకు ఆఫీసు కట్టలేదు.

రోడ్డును ఆనుకుని, మంచి సెంటర్‌లో ఉన్న ఆ స్థలం ధర తక్కువలో తక్కువ గజం రు.50 వేలకు పైమాటే. కానీ అధికారులు గజం రు.100 చొప్పున ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఈ లెక్కన రు.240 కోట్ల విలువ చేసే 4,840 చదరపు గజాల స్థలాన్ని కేవలం రు. 4 లక్షల 84 వేలకు అప్పనంగా రాసిచ్చారు. ఇంతా చేస్తే, ఆ స్థలంలో నరేందర్ పార్టీ ఆఫీసు కట్టకుండా రెండు కమర్షియల్ షట్టర్ల షాపులు కట్టారు. దీనిపై స్థానిక ప్రజాసంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపులో ఎలా అక్రమాలు చోటు చేసుకున్నాయో ఈ ఘటన తెలుపుతుంది. అయితే చాలా జిల్లా కేంద్రాలలో మాత్రం విజయవంతంగా పార్టీ ఆఫీసులను బీఆర్ఎస్ నిర్మించుకుని ప్రారంభోత్సవాలు కూడా చేసేసుకుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, దారుణంగా శిధిలమైపోయిన రోడ్ల నిర్మాణానికి గానీ, కీలక నీటి పారుదల ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి గానీ ఒక్క రూపాయి విదిల్చకుండా నిధులన్నీ సంక్షేమ పథకాలకు మళ్ళించిన జగన్, తమ పార్టీ జిల్లా కార్యాలయాలను మాత్రం తాడేపల్లి, రిషికొండ ప్యాలెస్‌లలాగే కట్టుకున్న విషయం తాజాగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ప్రతి జిల్లా కేంద్రంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వంనుంచి ఎకరం వెయ్యి రూపాయలకు లీజుకు తీసుకుని కోట్లు ఖర్చుపెట్టి జిల్లా ఆఫీసులు నిర్మించారు. ఒక్కోచోట అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపజేసుకున్నారు, అందుబాటులో లేని చోట, బలవంతంగా, నియమనిబంధలను తుంగలో తొక్కి రాసిచ్చేశారు. చాలాచోట్ల అంతకుముందు వేరే సంస్థలకు, సంఘాలకు కేటాయించిన స్థలాలను వెనక్కు తీసుకుని వైసీపీ జిల్లా ఆఫీసులకు కేటాయించారు. కోట్లు ఖర్చుపెట్టి అన్ని జిల్లాల్లో ప్యాలెస్‌లలాగా నిర్మాణాలు పూర్తి చేసేశారు. అయితే ఒక్క ప్రకాశం జిల్లాలో తప్పితే మరెక్కడా ఈ నిర్మాణాలకు అనుమతులుగానీ, ప్లాన్‌లుగానీ తీసుకోలేదని ఆరోపణలు.

నిన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు బుల్‌డోజర్లతో కూల్చేసిన సంగతి తెలిసిందే. మరి రాష్ట్రమంతటా నిర్మించిన వైసీపీ జిల్లా ఆఫీసుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News