గుంటూరు పశ్చిమ నియోజక వర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సీహెచ్ శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిని ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఇతర నిందితుల అంతా వారి అనుచరులతో కలిసి బుధవారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య కాలంలో గుంపుగా గుంటూరు మిర్చి యార్డులోకి ప్రవేశించారు. ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండా పెద్ద ఎత్తున తమ అనుచరులతో వచ్చి స్థానిక ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురి చేయడం అనేది నిబంధనలకు విరుద్దం. గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నట్లు ఆ యార్డు కార్యదర్శి అనుమతులు కూడా తీసుకోలేదు. అలా కార్యదర్శి నుంచి అనుమతులు తీసుకోకుండానే మిర్చి యార్డులోకి ప్రవేశించారు. పెద్ద ఎత్తున తమ అనుచరులు వచ్చి గుమి కూడటం వల్ల, మిర్చి యార్డులోకి ప్రవేశించినందు వల్ల అటు స్థానికులకు ఇటు మిర్చి లోడ్‌లతో వచ్చిన మిర్చి రైతులకు తీవ్ర అసౌకర్యం, ఆకంటం కలిగింది. అంతేకాకుండా మిర్చి యార్డు ఎదుట రోడ్డుపైన భారీ సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చి చేరడం వల్ల ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనుమతులు తీసుకోకుండా ఇలా వ్యవహరించడం నిబంధనలకు విరుద్దం. ఈ మేరకు జగన్ మీద ఆయనతో పాటు పాల్గొన్న మాజీ మంత్రులు ఇతర నేతల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు మరో ఏడుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద గుంటూరు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో వైపు జగన్ బుధవారం చేపట్టిన గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు భారీ ఎత్తున ప్రజలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. ఊహించని రీతిలో ప్రజలు హాజరు కావడంతో జగన్‌తో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కంగు తిన్నారు. అంత పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీసులు కానీ ఊహించ లేదు. దీంతో గుంటూరు మిర్చి యార్డు పర్యటన మిర్చి రైతులకు మంచి ఊతమిచ్చింది. మిర్చి రైతుల సమస్యలు ఒక్క సారిగా ప్రపంచ వ్యాప్తం అయ్యాయి. దీంతో పాటుగా జగన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు మిర్చి రైతుల సమ్యల మీద స్పందించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు బుధవారమే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా– గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్‌ల ప్రక్రియతో పాటు నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తి అయింది. మొత్తం 40 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వారిలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 30 మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదం పొందాయి. వీరిలో ఐదుగురు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. చివరికి 25 మంది బరిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తి అయ్యే నాటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.