అయోమయంలో జగన్ రాజకీయ భవిష్యత్..

వైఎస్ జగన్ రాజకీయ వ్యూహం ఏమిటి? పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఎక్కడి నుంచి ఉండబోతోంది? పులివెందుల ఎందుకు పోలేకపోతున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది...

Update: 2024-07-11 10:19 GMT

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడిందా? రాజకీయంగా అందరికీ అందనంత ఎత్తులో ఉన్న జగన్ ఒక్కసారిగా అద:పాతాళానికి పడిపోయారు. ఎందుకు ఇలా జరిగిందో ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నర కావస్తున్నా సరైన సమీక్షలు కూడా నిర్వహించలేదు. తాను సాయం చేసిన అవ్వాతాతలు ఏమయ్యారు? అక్కా తమ్ముళ్లు ఏమయ్యారు? అంటూ జగన్ ఆవేదనా స్వరంతో మాట్లాడితే సరిపోతుందా... ఆత్మావలోకనం అవసరం లేదా?. ఇంకా ఆత్మ న్యూనతలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్ పోకడలో మార్పు రాదని పార్టీలోని ప్రతి నాయకుడూ భావిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. పార్టీలో అన్నీ తానై పార్టీ నియోజకవర్గ నాయకత్వానికి అసలు పనే లేకుండా చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ పై పార్టీ క్యాడర్ లో రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతుందే తప్ప సానుకూలత అసలు రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ రాజకీయ వ్యూహం ఏమిటి? ఎలా ముందుకు అడుగులు వేస్తారు? పార్టీలో ఏమి జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పార్టీలో ఎలా ఉంటుంది. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఏ విధంగా ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా పనిచేసారో ఇప్పుడు కూడా అలాగే పని చేస్తారా? చేయరా? అనే చర్చ కూడా సాగుతోంది.

ఇరకాటంలో జగన్

తప్పకుండా గెలుస్తాననే ధీమాలో ఉన్న జగన్ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను కూడా ఎన్నికల సంవత్సరం చివర్లో చేపట్టి చేతులు కాల్చుకున్నారు. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ కూల్చి వేసింది. దీంతో పార్టీ నిర్మాణానికి గండి పడిందని చెప్పొచ్చు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ ఆయా మునిసిపాలిటీలు, పంచాయతీల నుంచి నోటీసులు ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానాలు తయారు చేసుకునే పనిలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఒక వైపు పార్టీ కార్యాలయ నిర్మాణాల కార్యక్రమానికి విఘాతం ఏర్పడింది. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ నిర్మాణాలు కూడా పార్టీ వారు దగ్గరుండి నిర్మించే పరిస్థితి లేదు. బయటి కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ కొంత పార్టీ నుంచి మరికొంత డోనర్స్ నుంచి ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. దీంతో కార్యాలయ నిర్మాణాల భవిష్యత్ కూడా అయోమయంలో పడింది.

ఏ మాజీ ముఖ్య మంత్రికీ ఈ దుస్థితి ఎదురు కాలేదు..

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీకి హాజరు కావాల్సిన పరిస్థితి గతంలో ఏ మాజీ ముఖ్యమంత్రికీ రాలేదు. ఇప్పుడు జగన్ కు వచ్చింది. జగన్ తో కలిపి 11 మంది శాసన సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ వారిని నిలబెట్టు కుంటుందా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే 2014లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ పార్టీకి 65 సీట్లు వచ్చాయి. ఇందులో 22 మంది అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో ఇద్దరికి అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి వైఎస్సార్సీపీని దెబ్బతీశారని భావించొచ్చు. అయితే అవన్నీ జగన్ కు అప్పట్లో కలిసొచ్చాయి. 2019లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో వెల్లికిలా పడటంతో పార్టీ పరిస్థితితో పాటు జగన్ పరిస్థితి కూడా అయోమయంలోకి నెట్టినట్లైంది.

అసెంబ్లీలో అవమానాలు భరిస్తాడా?

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ అధికార పక్షం పెట్టే అవమానాలు భరిస్తూ కూర్చోగలడా? ఒకవేళ కూర్చున్నా ఆయనకు మాట్లాడే అవకాశం దక్కుతుందా? ఒకవేళ అవకాశం ఇచ్చినా ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం కూడా ఉండదేమో. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని అవమానాలు భరిస్తూ అసెంబ్లీలో కూర్చుంటాడా? అనే సందేహాలు పార్టీ వారితో పాటు జనంలోనూ ఉన్నాయి. మరో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. జగన్ మొండి పట్టుదల ఉన్న వాడు. తప్పకుండా అసెంబ్లీలో ఉంటాడు. ఎన్ని అవమానాలైనా భరిస్తాడని కొందరు అభిమానులు, పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను ఫెడర్ ప్రతినిధి మాట్లాడాల్సిందిగా కోరగా అది వారి పార్టీకి సంబంధించిన అంశమని, జగన్ అసెంబ్లీకి వస్తాడా? రాడా? అవమానాలు భరిస్తాడా? లేదా? అనే అంశాలు ఊహా జనితమైనందున ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీనే ప్రతిపక్ష పార్టీ అయినందున అసెంబ్లీలో తప్పకుండా మాట్లాడే అవకాశం జగన్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జగన్ అసెంబ్లీకే రాకపోతే అప్పుడు తాను మాట్లాడొచ్చన్నారు. పార్టీని నడిపించుకోటానికి జగన్ సరైన పందాలో పనిచేస్తే బాగానే ఉటుంది. లేదంటే భవిష్యత్ అయోమయంగానే ఉంటుందనే అభిప్రాయం వెలుబుచ్చారు.

జగన్ ఎక్కడి నుంచి రాజకీయాలు నడుపుతారు?

మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడి నుంచి రాజకీయాలు నడుపుతాడనే అంశం సందిగ్ధంగా ఉంది. తాడేపల్లి నివాసాన్ని ప్రస్తుతానికి పార్టీ కార్యాలయంగా కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే జరిగిన పలు సమావేశాలు ఇక్కడే జరిగాయి. పార్టీ కొత్త ఆఫీస్ కట్టే వరకు తాడేపల్లి జగన్ నివాసం నుంచే కార్యక్రమాలు జరగాలని నిర్ణయించారు. ఈ లోపు తాడేపల్లిలో నిర్మాణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. అందువల్ల రాజధాని కేంద్రంలో ఎక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలు సాగుతాయనేది ఇంకా నిర్ణయించిన దాఖలాలు లేవు. జగన్ అమరావతిలో ఉండే అవకాశం లేదు. పులివెందులలో కూడా ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉంటే పార్టీ కార్యక్రమాల గురించి కాకుండా మాకు రావాల్సిన బిల్లుల పరిస్థితి ఏమిటనే విషయం ప్రశ్నించేందుకు చాలా మంది కాంట్రాక్టర్లు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో పులివెందులలో కూడా ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ బెంగళూరు వెళ్లారంటే జగన్ పారిపోయారంటారు. ఎక్కడ ఉండాలి. పార్టీ పనులు ఎలా ముందుకు పోవాలనే ఆలోచనపై ఇంకా జగన్ ఒక నిర్ణయానికి వచ్చిన దాఖలాలు లేవు.

బలగం ఉన్నా... బలం లేదు...

చూడటానికి, వినటానికి ప్రతి నియోజకవర్గంలోనూ బలగం ఉంది. బలం లేదు. నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు, పనితీరు, అధికారులపై దాష్టీకం గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులపై టీడీపీ వారు దాడులకు తెగబడుతున్నారు. వారిని నిరోధించే పని కూడా జగన్ చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ బలగంలో చాలా మంది జగన్ వల్లే తాము ఓడిపోయామని, తమకు పనులు కూడా లేకుండా పోయాయని వాపోతున్నారు. కోట్లు ఖర్చుపెట్టకుని మట్టికరిచామనే బాధ ఇప్పటికీ చాలా మంది నియోజకవర్గ ఇన్ చార్జ్ ల్లో ఉంది. పార్టీ నిర్మాణ పరంగా స్ట్రాంగ్ గా లేదని చెప్పాల్సి ఉంటుంది. జిల్లా, మండల కమిటీలు ఉన్నప్పటికీ పేరుకు మాత్రమే ఉన్నారు తప్ప వారు పనిచేయడం లేదు. మండల స్థాయిలో ఎన్నికలప్పుడు నియమించిన కన్వీనర్లు, గ్రుహసారధుల జాడ కనిపించడం లేదు.

Tags:    

Similar News